Warangal: సంకీర్ణ ప్రభుత్వాలతోనే సుస్థిర పాలన

  • By: sr    news    Mar 23, 2025 10:26 AM IST
Warangal: సంకీర్ణ ప్రభుత్వాలతోనే సుస్థిర పాలన

విధాత, వరంగల్ : సమాజ సమిష్టి ప్రయోజనాలే ద్యేయంగా, ప్రజలకు సుస్థిరమైన పాలన అందించడంలో సంకీర్ణ ప్రభుత్వాలు కీలకమని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ప్రతాపరెడ్డి అన్నారు. శనివారం కాకతీయయూనివర్సిటీ  సెనేట్ హాల్ లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు మరియు ప్రజాస్వామ్యం “అనే అంశంపై జరిగిన జాతీయ సెమినార్ ముగింపు కార్యక్రమం రాజనీతి శాస్త్ర విభాగాధిపతి సంకినేని వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నేటి రాజకీయాలను శాస్త్రీయ దృక్పథంతో నిరంతరం అధ్యయనం చేయాల్సిన బాధ్యత రాజనీతి శాస్త్ర విభాగం పోషించాలని కోరారు. సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వాలు బహుళ వర్గాల ప్రజల ఐక్యతకు ప్రతీకయే కాకుండా ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తాయని తెలిపారు. ఓయూ సోషల్ సైన్స్ మాజీ డీన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కే.శ్రీనివాసులు జాతీయ సెమినార్ ముగింపు కీలక ఉపన్యాసం చేస్తూ ఏక పార్టీ ప్రభుత్వంలో పాలన అధికారం కేంద్రీకరించబడుతుందని, సంకీర్ణ ప్రభుత్వంలో పాలన అధికారం వికేంద్రీకరించబడుతుందని దీంతో శాసన ,న్యాయ, కార్యనిర్వాహణ శాఖల అధికారాలకు రక్షణ ఉంటుందని తెలిపారు.


ఏక కేంద్ర ప్రభుత్వల పాలనలో సిబిఐ ,ఈడి, ఎలక్షన్ కమిషన్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలు కీలు బొమ్మలుగా మారే ప్రమాదం ఉందన్నారు.
దేశంలో సంపద కొద్ది మంది పెట్టుబడిదారుల వద్ద కేంద్రీకరించబడిందని, అధికార వికేంద్రీకరణ అయినట్లు సంపద ప్రజల మధ్య వికేంద్రీకరణ కావాలన్నారు. లేకపోతే ఆర్థిక అసమానతలు పెరిగిపోయి భారతీయ సమాజం కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. జాతీయ ,ప్రాంతీయ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు వారిని ఆత్మగౌరవంతో నిలబడి అభివృద్ధి వైపు తీసుకువెళ్లే విధంగా ఉండాలి కానీ వారిని శక్తిహీనులుగా మార్చే విధంగా ఉండొద్దన్నారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో పార్టీల మధ్య ఆరోగ్యకరమైన విమర్శ ,ప్రతి విమర్శలు ఉండాలి కానీ అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి తీవ్రమైన నష్టకరమన్నారు.

ఈ ముగింపు కార్యక్రమంలో ప్రత్యేక అతిధి కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం, కే.యు.  యు.జి.సి కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి. మల్లికార్జున రెడ్డి, మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సి. లక్ష్మనణ్ లు పాల్గొని ప్రసంగించారు. వివిధ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి. వీరన్న నాయక్, డాక్టర్ హరిప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ సత్యనారాయణ , డాక్టర్ నాగరాజు, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ లలిత కుమారి, డాక్టర్ సంజీవ్, డాక్టర్ విజయ్, డాక్టర్ సునీల్ ,డాక్టర్ భాగ్యమ్మ ,రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు పాల్గొన్నారు.