Telangana | పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన గురుకులాలు

  • By: sr    news    Apr 30, 2025 3:41 PM IST
Telangana | పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన గురుకులాలు
  • 98.7 శాతం ఉత్తీర్ణత
  • మొత్తంగా బాలికలే టాప్‌
  • ఈ ఏడాది 92.78 శాతం ఉత్తీర్ణత
  • గతేడాది కంటే 1.47% ఎక్కువ
  • బాలురు 91.32%, బాలిక‌లు 94.26%
  • 4,629 స్కూళ్లలో 100% ఉత్తీర్ణ‌త
  • 99.29%తో అగ్ర‌స్థానంలో మ‌హ‌బూబాబాద్
  • జూన్ 3 నుంచి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ

విధాత: తెలంగాణ పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పదవ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది పది ఫలితాలలో విద్యార్ధులు 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే 1.47 శాతం ఎక్కువ ఉతీర్ణత సాధించారు. గురుకులాల్లో 98.7 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. సీజీపీఏ విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలను జరిగిన విషయం తెలిసిందే.

దాదాపు 5లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫెయిలైన విద్యార్థుల‌కు జూన్ 3వ తేదీ నుంచి 13తేదీ వరకు అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఫీజులు చెల్లించేందుకు మే 16 వరకు గడువు విధించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్ లకు మే 15చివరి తేదీ. రీకౌంటింగ్ కు ఒక్కో పేప‌ర్‌కు రూ. 500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంద‌ని అధికారులు పేర్కొన్నారు. రీవెరిఫికేష‌న్ కోసం ఒక్కో పేప‌ర్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

బాలికలు టాప్

ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో బాలురు 91.32 శాతం, బాలిక‌లు 94.26 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలిక‌లు బాలుర కంటే 2.94 శాతం అధికంగా ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ఈ ఏడాది 4,629 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణ‌త సాధించాయి. రెండు పాఠ‌శాల‌లు మాత్రం సున్నా శాతం ఫ‌లితాలు పొందాయి. మ‌హ‌బూబాబాద్ జిల్లా 99.29 శాతంతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, వికారాబాద్ జిల్లా 73.97 శాతంతో చివ‌రి స్థానంతో స‌రిపెట్టుకుంది. తెలంగాణ గురుకుల పాఠ‌శాల‌లు 98.79 శాతం ఉత్తీర్ణ‌త సాధించాయి. ఎయిడెడ్, జ‌డ్పీ, గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్ రాష్ట్ర స‌రాస‌రి ఉత్తీర్ణ‌తా శాతం 92.78 కంటే త‌క్కువ ఉత్తీర్ణ‌త సాధించాయి.