Revanth Reddy: తెలంగాణకు ఆత్మబంధువు.. మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వాలి
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ విగ్రహం
- అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్బంగా వెల్లడించిన సీఎం రేవంత్
విధాత: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం ఈ దేశానికి తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి.. కానీ తెలంగాణకు ఆయన ఆత్మబంధువు అని కొనియాడారు. తెలంగాణకు పురుడుపోసిన వ్యక్తిగా అయన్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారన్నారు. మన్మోహన్ సింగ్ తో జైపాల్ రెడ్డి కి ఎంతో సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఆయన సూచనలు, సలహాలతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని అన్నారు. అలాంటి ఆయనకు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఆయన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సభ్యుల సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని మేం భావిస్తున్నామని తెలిపారు.
మౌనముని అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన తన సహనాన్ని కోల్పోలేదని సీఎం రేవంత్ తెలిపారు. దేశాన్ని ఆర్దికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టిసారించారన్నారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆదర్శంగా తీసుకునే వారిలో మన్మోహన్ సింగ్ మొదటి వరుసలో ఉంటారని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆనాడు పార్లమెంటు సభ్యులుగా మాతో పాటు ఆయన ఢిల్లీలో నిరసనలో పాల్గొన్నారని, ఇది మాకు జీవిత కాలం గుర్తుండిపోయే సంఘటన అని అన్నారు. పార్లమెంట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నిరసనలో పాల్గొనడం వారి నిరాడంబరతకు నిదర్శనమన్నారు.

ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని సీఎం రేవంత్ కొనియాడారు. ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అని అన్నారు. 2013 భూసేకరణ చట్టం తెచ్చి భూమి లేని పేదలకు మేలు జరిగేలా చేశారని చెప్పారు. 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ అని, అంబేద్కర్ స్పూర్తిని కొనసాగిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చారని తెలిపారు. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
మన్మోహన్ తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ-దిశను మార్చాయని సీఎం అన్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలకు మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నామనిచెప్పారు. పార్టీలకు అతీతంగా మన్మోహన్ గారి పట్ల ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram