CM Revanth Reddy | విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి
CM Revanth Reddy | తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని సీఎం సూచించారు. విద్యా శాఖపై ఐసీసీసీలో రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన విద్యార్థుల సంఖ్య అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సోలార్ కిచెన్లు ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం అధికారులకు సూచించారు.
డ్రాప్ అవుట్స్ నివారించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్య, ఇంటర్మీడియట్‌లో నమోదు అవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సీఎం సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందొచ్చని.. తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఏ.శ్రీదేవసేన, విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరిత తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram