Delimitation: సీట్ల సంఖ్య మార్చకుండా.. డీలిమిటేషన్ చేపట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

Delimitation | Cm Revanth Reddy
విధాత : లోక్ సభ ప్రస్తుత సీట్ల సంఖ్య మార్చకుండా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రల అఖిల పక్ష సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. డీలిమిటేషన్ ప్రక్రియలో నా మొదటి డిమాండ్ సీట్లు పెంచొద్దు.. ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలని కోరారు. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలానే పునర్విభజన చేపట్టిందని.. లేకుంటే రాష్ట్రాల మధ్య రాజకీయ తేడాలు (అసమతౌల్యాలు) వచ్చేవన్నారు. 2001లో ప్రధానమంత్రి వాజ్‌పేయ్ నేతృత్వంలోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను అలానే ప్రారంభించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. లోక్‌సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే విధంగా చేయగలరా? అని ప్రశ్నించారు.
నా రెండో డిమాండ్ జనాభా దామాషా ప్రాతిపదిక పునర్విభజను దక్షిణాది వ్యతిరేకిస్తోందని..బీజేపీ ప్రతిపాదిస్తున్న జనాభా దామాషా పద్దతిలో పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలైన మనం రాజకీయ గళం కోల్పోతామన్నారు. మనల్ని ఉత్తరాది కింద ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించివేస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చలాయిస్తాయని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారన్నారు. ఏ పరిస్థితుల్లోనూ మనం దీనికి అంగీకరించకూడదన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానానికి వ్యతిరేకంగా దక్షిణాది ప్రజలు, పార్టీలు, నాయకులు ఏకం కావాలని కోరారు.
మూడో డిమాండ్ ప్రొరేటా విధానాన్ని అంగీకరించలేమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొరేటా విధానం కూడా దక్షిణాదికి నష్టమే కలిగిస్తుందని.. ప్రొరేటా ప్రక్రియ కూడా రాజకీయ అంతరాలను పెంచుతుందన్నారు. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుందని.. ఒక్క సీటు కూడా తేడాను చూపుతుందన్నారు. ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన దేశంలో ఉందని గుర్తు చేశారు. అందుకే ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రిజర్వేషన్ సీట్లు పెంచాలి
మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా సీట్ల పెంపు వాయిదా వేసి డీలిమిటేషన్ చేపట్టాలని, పునర్విభజనకు రాష్ట్రాన్ని యూనిట్ తీసుకొని చేయాలని, రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలన్నారు. తాజా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచాలని, ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్లను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్ర నిధుల్లోనూ దక్షిణాదికి అన్యాయం
ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను డీలిమిటేషన్ రూపంలో ఎదుర్కొంటోందని.. బీజేపీ జనాభా నియంత్రణకు జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందన్నారు. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని రేవంత్ రెడ్డి వివరించారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయని.. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయన్నారు. దేశ ఖజానాకు మనం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నామని పేర్కొన్నారు. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తుంటే… ఉత్తర ప్రదేశ్‌కు రూపాయికి 2.73 పైసలు వెనక్కి వెళుతున్నాయని, బీహార్ రూపాయి చెల్లిస్తే 9. 22 పైసలు వెనక్కి తీసుకుంటుంటే, కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయని వివరించారు. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.2.79 పైసలు వెళుతున్నాయని తెలిపారు.
పురోగామి రాష్ట్రాలకు డీలిమిటేషన్ శిక్ష
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు.. పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందని, చివరకు జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మనది ఒకే దేశం.. మనం దానిని గౌరవిస్తాం.. కానీ ఈ పునర్విభజనను మనం అంగీకరించబోమన్నారు. ఎందుకంటే ఇది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కుదింపు ప్రక్రియగా మారనుందని.. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాలను ఈ ప్రక్రియ శిక్షిస్తోందని, ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా మనం బీజేపీని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేను తెలంగాణలోని మల్కాజిగిరి ఎంపీగా చేశాననని.. అది ప్రపంచంలోనే అతి పెద్ద నియోజకవర్గం.. అక్కడ మొత్తం జనాభా 45 లక్షలైతే ఓటర్లు 32 లక్షలు.. కాబట్టి నేను ఈ సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోగలనని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ దేశానికి విధానపరమైన శాసనాలను రూపొందిస్తుందే తప్ప ప్రజలకు అవసరమైన చిన్న చిన్న సమస్యలపై నిర్ణయాలు చేయదని. ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలను స్థానిక సంస్థలు, రాష్ట్రాలు, శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.
నేను చేసే తుది డిమాండ్.. చూపించే పరిష్కారం… జనాభా నియంత్రణకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పాలని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. దేశ నిర్మాణంలో 1975 నుంచి 2025 వరకు 50 ఏళ్ల పాటు మనం అందించిన సేవలకు మనల్ని అభినందించాలని.. మనకు వెనక్కి కొంత చెల్లించాలని రేవంత్ అభిప్రాయపడ్డారు.
డీలిమిటేషన్ చేస్తే మా డిమాండ్ ఇదే
ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనుకుంటే నా ప్రధాన డిమాండ్ ఇదేనని…543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130.. ఇది మొత్తం సీట్లలో 24 శాతం.. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో మాకు 33 శాతం సీట్లు ఇవ్వాలనేది దక్షిణాది రాష్ట్రాలుగా మా డిమాండ్ అని రేవంత్ రెడ్డి తన వాదన వినిపించారు. బీజేపీ 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్ సభ సీట్ల సంఖ్య 815 అవుతుందని.. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం అంటే 272 సీట్లు ఇవ్వాలని…ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పుడున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచవచ్చని రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలో మిగిలిన సీట్లను ఉత్తరాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం తమ అభిమతం మేరకు పంచవచ్చు.. అనుకున్న దానికంటే దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గిస్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.
దక్షిణాది రాష్ట్రాల తదుపరి భేటీ హైదరాబాద్ లోనే
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. పునర్విభజన అన్యాయంపై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పునర్విభజన ప్రక్రియపై తర్వాత సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తానని.. మన పోరాటాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళదామనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చిద్దామన్నారు. ఈ పోరాటంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఒక భారీ బహిరంగ సభను నేను ఏర్పాటు చేస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశానికి చెందిన అన్నతమ్ముళ్లు.. అక్కా చెల్లెళ్లంతా కలిసి వచ్చి.. మన హక్కుల రక్షణకు కలిసి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు మన విభేదాలను విస్మరించి పునర్విభజనలో మన వాటా దక్కించుకునేందుకు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. పునర్విభజన ప్రక్రియపై మా రాష్ట్ర శాసనసభలో త్వరలోనే తీర్మానం ఆమోదిస్తాం… మేం మా రాష్ట్రంలో ఎలా చేస్తున్నామో మీ మీ రాష్ట్రాల్లోనూ అలానే చేయాలని సహచర ముఖ్యమంత్రులు, ఇతర నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నానని రేవంత్ రెడ్డి కోరారు. దక్షిణ భారతదేశ పౌరుల గళాన్ని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపిద్దామని సూచించారు.