Telangana | కులగణనలో.. తెలంగాణ దేశానికి రోల్ మోడల్: సీఎం రేవంత్ రెడ్డి

- రాహుల్ గాంధీ సంకల్పంతోనే కేంద్రం కులగణన ప్రకటన
- కులగణన నిర్వాహణలో మెట్టుదిగుతాం..సలహాలిస్తాం
- తెలంగాణ కులగణన శాస్త్రీయం
- మోదీ నన్ను అనుసరిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలకు అసూయ
విధాత, హైదరాబాద్ : కులగణనలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మా ప్రభుత్వం కులగణనను శాస్త్రీయంగా చేసి చూపించిందని గుర్తు చేశారు. జనగణనతో పాటు కులగణన నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆయన మీడియా సమావేశంలో స్పందించారు. జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విని..కులగణన చేస్తామని హామీ ఇచ్చారని..ఆయన సంకల్పంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగి కులగణనకు ముందుకొచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారన్నారు.
రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామమని.. అసెంబ్లీలో రెండు తీర్మాననాలు చేసి కేంద్రానికి పంపామన్నారు. జనగణనలో కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపామని..కేంద్రం ఆమోదం కోరుతూ జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టామని గుర్తు చేశారు. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారన్నారు. మొన్నటి వరకు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిందన్న సంగతి అందరికి తెలిసిందేనన్నారు.
కులగణన అనివార్యతను కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైన గుర్తించి కులగణనకు నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జనగణనతో కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని మోదీ స్పష్టం చేయాలన్నారు. బీజేపీ తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే కులగణన చేసి తీరాల్సిన పరిస్థితిలోకి నెట్టామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు 400 సీట్లు ఇవ్వకపోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ఇప్పుడు కేంద్రం కులగణనకు అంగీకరించిందని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు 400సీట్లు ఇచ్చి ఉంటే రిజర్వేషన్లు ఎత్తివేసేవారని..రాజ్యాంగాన్ని మార్చేవారని రేవంత్ రెడ్డి మరోసారి బీజేపీపై ఆరోపణలు చేశారు.
కులగణనపై కేంద్రానికి సహకరిస్తాం
రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన పూర్త్తి చేసిన అనుభవంతో కులగణనపై కేంద్రంతో మా అనుభవాన్ని పంచుకోవడానికి మాకు ఎలాంటి భేషజాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా మెట్టుదిగి కేంద్రానికి కులగణనలో సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధమన్నారు. బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే మా సంకల్పమన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టడానికి అనేక సవాళ్లు ఉన్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి ఉదాహారణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా ఉన్న బోయలు కర్ణాటకలో ఎస్టీలుగా ఉన్నారని తెలిపారు.
తెలంగాణలో ఎస్టీలుగా ఉన్న లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారని..ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ సమస్యలు ఉన్నాయన్నారు. అందుకే కుల గణన చేపట్టేందుకు మంచి కసరత్తు చేయాలని..కేంద్ర మంత్రులతో కమిటీ వేయాలి..నిపుణుల కమిటీని నియమించాలని సూచించారు. దేశవ్యాప్త కుల గణనకు విధివిధానాలు (టర్మ్స్ ఆఫ్ రిపరెన్సెస్) రూపొందించాలన్నారు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న అనుభవాన్నికేంద్రం వినియోగించాలని, మేం కుల గణన చేపట్టిన తీరు..ఇతర అంశాలపై మా దగ్గర ఉన్న సమాచారాన్నిపంచుకోవడానికి మేం సిద్దంగా ఉన్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనాల విషయంలో మేం రాజకీయాలకు పాల్పడదల్చుకోలేదన్నారు.
తెలంగాణ కులగణన శాస్త్రీయం
మేం తెలంగాణలో కులగణన చేపట్టే క్రమంలో విధి విధానాలు రూపొందించి ప్రజల ముందు పెట్టామని, తెలంగాణలో మేం 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మంత్రుల కమిటీని, నిపుణుల కమిటీని నియమించామని, వారు జిల్లా కేంద్రాలకు వెళ్లి ప్రజల డిమాండ్లను విన్నారన్నారు. కులగణనలో మేం అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశామన్నారు. ఎక్కడా మా పార్టీ కార్యక్రమంలా చేయలేదని, అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన శాస్త్రీయంగా పూర్తి చేశామని స్పష్టం చేశారు. అందుకే కులగణనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో నిలిచిందన్నారు. మమ్మల్ని విమర్శించే బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నానని..పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే మాపై విమర్శలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ, అసూయా స్థానిక బీజేపీ నాయకులలో కనిపిస్తుందన్నారు. బీహార్ చేపట్టిన కుల గణనను కోర్టు తప్పుపట్టడంతో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ రాష్ట్రం చేపట్టిన కుల గణన అశాస్త్రీయం అని చెప్పారని..ఆయన తెలంగాణ కులగణనను తప్పు పట్టలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.