REVNTH REDDY: రుద్రారంలో.. తోషిబా కొత్త ఫ్యాక్టరీ

  • By: sr    news    Apr 18, 2025 7:40 PM IST
REVNTH REDDY: రుద్రారంలో.. తోషిబా కొత్త ఫ్యాక్టరీ

రూ.562 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం

విధాత: పెట్టబడుల సాధనకు జపాన్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో తోషిబా కంపనీ రూ.562కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, టీటీడీఐ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

విద్యుత్తు రంగంలో కీలక పురోగతి

ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్ ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్‌గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది.

ఈ ప్రాజెక్ట్ కు రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది.

పారిశ్రామిక ప్రగతికి తోషిబా ఒప్పందంతో కొత్త శక్తి

తోషిబా ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరివర్తనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు. పరిశ్రమల భాగస్వామ్యాలు, వ్యూహాత్మక సహకారాలతో అన్ని రంగాల్లో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని అన్నారు. కొత్త పెట్టుబడులకు తోషిబా చేసుకున్న ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహమిస్తుందని అన్నారు.

టీటీడీఐ చైర్మన్ హిరోషి ఫురుటా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. కొత్త ఆవిష్కరణల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత తెలంగాణను పెట్టుబడుల గమస్య్థానంగా మార్చుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంతో ఉన్నట్లు చెప్పారు