Holidays |
విధాత, హైదరాబాద్ : తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవులు కేవలం టెట్ పరీక్షా కేంద్రాలకు కేటాయించిన స్కూళ్లకు మాత్రమే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
14వ తేదీ మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీన టెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.
టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు కొనసాగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. టెట్‌కు 20 శాతం వెయిటీ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు