Kadiam Kavya: మహిళల ఆర్థికాభివృద్ధికి.. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు

  • By: sr    news    Mar 05, 2025 7:38 PM IST
Kadiam Kavya: మహిళల ఆర్థికాభివృద్ధికి.. రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు

విధాత, వరంగల్: మహిళలు ఆర్థిక ప్రగతి సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (Kadiam Kavya) అన్నారు. ప్రపంచంలో తాము సాధించలేనిదంటూ ఏదీ లేదని మహిళలు రుజువు చేస్తున్నారని, అన్నీ రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఇండియా వారి మెగా MSME ఔట్‌రీచ్ క్యాంపెయిన్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మహిళలు అర్థికంగా రాణించినప్పుడే ఆ కుటుంబాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెగా MSME ఔట్రీచ్ ప్రచారం ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రోత్సహించడం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు అందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

ఈ సందర్భంగా యూనియన్ బ్యాంకు సంస్థను ఎంపీ అభినందించారు. ఇలా బ్యాంకులు కల్పిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని మహిళలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలతో చిన్న చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా పెద్ద వ్యాపారాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సెంట్రల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ గుణనంద్ గామీ, జనరల్ మేనేజర్ రమేష్, రీజనల్ హెడ్ సత్యంపాల్గొన్నారు.