Rahul Gandhi | కేంద్రాన్ని ఒత్తిడి చేయగలం.. కుల గణన నిర్ణయంతో రుజువు

- లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్
- కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం
- వ్యవవధిపై స్పష్టతకు డిమాండ్
న్యూఢిల్లీ : తదుపరి జనాభా లెక్కల సందర్భంగా కుల గణన కూడా చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఎప్పటిలోగా కుల గణను పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిర్ణయం అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కుల గణన అనేది లోతైన సామాజిక సంస్కరణకు తొలి అడుగుగా ఆయన అభివర్ణించారు. ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వాన్ని మేం ఒత్తిడి చేయగలమని నిరూపించాం’ అని ఆయన అన్నారు.
కుల గణనను జరిపించి తీరుతామని తాము పార్లమెంటులోనే చెప్పామని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని కూడా ఎత్తివేయాలని తాము చెప్పామని అన్నారు. నాలుగే కులాలు ఉన్నాయని ప్రధాని నరేంద్రమోదీ చెబుతుంటారని, ఏం జరిగిందో ఏమోకానీ.. 11 ఏళ్ల తర్వాత కుల గణనపై ప్రకటన చేశారని వ్యాఖ్యానించారు. రాబోయే కుల గణనకు తెలంగాణ నమూనాను ఎంచుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. కేంద్రానికి ఇది ఒక బ్లూప్రింట్ తరహాలో పనికొస్తుందని అన్నారు.
బీహార్‌లోనూ కులగణన చేసినా.. తెలంగాణ నమూనాకు, బీహార్ నమూనాకు పూర్తి తేడాలు ఉన్నాయని చెప్పారు. కుల గణన చేయడమే కాకుండా.. ఓబీసీలు, దళితులు, ఆదివాసీలకు దేశంలో వారి నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లకు అనుమతించే రాజ్యాంగంలోని 15(5)వ అధికరణాన్ని అమలు చేయడం ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు.
పహల్గామ్ ఘటనపై మాట్లాడుతూ.. ‘28 మందిని దారుణంగా చంపారు. దానికి బాధ్యులెవరో అందరికీ తెలిసిందే. బాధ్యులైనవారు తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకోవాల్సిందే. ప్రధాన మంత్రి అందుకు పూనుకోవాలి. తీసుకునే చర్యలు చాలా స్పష్టంగా, బలంగా, ఎలాంటి గందరగోళం లేకుండా ఉండాలి. ప్రధాన మంత్రి
ప్రధానమంత్రి తొందరపడకూడదు, సమయం వృధా చేయకూడదు, భారతదేశం ఈ రకమైన అర్ధంలేని పనిని సహించబోదని చాలా స్పష్టంగా చెప్పాలి. కాబట్టి, ఆయన చర్య తీసుకోవాలి… ఆయన ఏ సమయంలోనైనా అవసరమని భావిస్తే ఆ సమయంలో చర్య తీసుకోవచ్చు కానీ ఆయన త్వరలోనే చర్య తీసుకోవాలి. ప్రధాని ఉదాసీనంగా వ్యవహరించకూడదు. సమయం అస్సలు వృథా చేయొద్దు. ఇటువంటి చెత్తను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని చాలా స్పష్టంగా చెప్పాలి. అందుకు ఆయన కార్యాచరణలోకి దిగాలి. ఎప్పుడు చేయాలనుకుంటున్నారో చేయండి కానీ.. త్వరగా చేయాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు.