ప్రభుత్వాన్ని కూలుస్తామనలేదు: కొత్త ప్రభాకర్ రెడ్డి

విధాత: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని నేను చెప్పలేదని దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ ఇచ్చారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారంటూ..అందుకు డబ్బులు కూడా ఇస్తామంటున్నారని అంతకుముందు ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు దీనిపై మండిపడ్డారు. తన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో నేను అదే చెప్పానని..నన్ను అడ్డుకున్నా..నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. మీకు మీ పార్టీపై నమ్మకం ఉంటే మా పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీలో తీసుకున్నారని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వంపై నేను చేసిన విమర్శలపై లైవ్ డిటెక్టర్ టెస్టు కు నేను రెడీ అని, మరి కాంగ్రెస్ మంత్రులు కూడా టెస్టుకు రావాలని డిమాండ్ చేశారు. నేను కేసీఆర్ ఆత్మ అని..అందుకే నా మాటలు కేసీఆర్ మాటలు అని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి అభ్యతరం వ్యక్తం చేశారు. నేను కేసీఆర్ ఆత్మ అయినప్పటికి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని నాకు చెప్పలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు ఉంటే మళ్లీ మనం అధికారంలోకి వచ్చి 15ఏళ్లు అధికారంలో ఉంటామని కేసీఆర్ మాకు చెప్పారన్నారు. బిల్డర్లు వ్యాపారవేత్తలు మాకు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారని..బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలివస్తారన్నారు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.