Earthquake Hyderabad | హైదరాబాద్‌ సిలికాన్ వ్యాలీ భ‌ద్ర‌మేనా?

మాండ‌లేలో వ‌చ్చిన విధంగా 7.7 తీవ్ర‌త‌తో సమీప ప్రాంతాల్లో భూ కంపం వ‌స్తే హైద‌రాబాద్ ప‌రిస్థితి ఏమిటీ? మాండ‌లేలో భూ కంపం వ‌స్తే 1300 కిలో మీట‌ర్ల దూరంలో బ్యాంకాక్ ఆగ‌మైంది. అదే హైద‌రాబాద్ కు అతి స‌మీపంలో ఉన్న లాతూర్‌లో వ‌స్తే హైద‌రాబాద్ ప‌రిస్థితి ఏమిటి? మ‌న భ‌వ‌నాల భ‌ద్ర‌త ఎంత‌? అన్న చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

  • By: sr    news    Apr 01, 2025 6:25 PM IST
Earthquake Hyderabad | హైదరాబాద్‌ సిలికాన్ వ్యాలీ భ‌ద్ర‌మేనా?
  • మాండ‌లేలో భూకంపం వ‌స్తే 1300 కి.మీ. దూరంలోని బ్యాంకాక్‌లోనూ విధ్వంసం
  • 1993లో లాతూరులో భారీ భూకంపం
  • అక్కడి నుంచి హైదరాబాద్‌కు దూరం 298 కిలోమీటర్లే
  • 2021 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 10 సార్లు కంపించిన భూమి
  • 196 సార్లు భూ ప్ర‌కంప‌న‌లు
  • ఒక్క గ‌చ్చిబౌలి ఏరియాలోనే150కి పైగా ఆకాశ హర్మ్యాలు
  • భార‌త్, నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల‌లో ఎక్క‌డ భూ కంపం వ‌చ్చినా ముప్పు
  • బహుళ అంతస్తుల భ‌వ‌నాల‌తో డేంజరంటున్న నిపుణులు
  • విచ్చలవిడిగా స్కైస్క్రాపర్స్‌కు ప్రభుత్వం అనుమతులు
  • కష్టకాలంలో హైదరాబాద్‌ను నాశనం చేసేవి అవే!

(విధాత ప్రత్యేకం)

2025 ఏప్రిల్‌ 28: మయన్మార్‌లోని మాండలేలో 7.7 తీవ్రతతో భూకంపం చోటు చేసుకున్నది. దీని ప్రభావానికి అక్కడికి 1300 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకాక్‌లో సైతం పెను విధ్వంసం చోటు చేసుకున్నది. వేల మంది చనిపోయారు.

1993, సెప్టెంబర్‌ 30 : మహారాష్ట్రలోని లాతూరులో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. వేల మంది ప్రాణాలను బలిగొన్నది. దీని ప్రభావంతో అక్కడికి 298 కి.మీ. దూరంలోని హైదరాబాద్‌ సహా తెలంగాణ అంతటా ప్రకంపనాలు వచ్చాయి.

2024, డిసెంబర్‌ 4 : ములుగు జిల్లాలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా.. హైద‌రాబాద్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ములుగు నుంచి హైదరాబాద్‌కు 198 కిలోమీటర్లే.

ఇదే లాతూరు, ఇదే ములుగులో మాండలే తరహాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవిస్తే కూతవేటు దూరంలో ఉన్న హైదరాబాద్ పరిస్థితేంటి? ఎక్కడో 1300 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకాక్‌ పెను విధ్వంసానికి గురైతే.. వందల కిలోమీటర్ల దూరంలోనే ఉన్న హైదరాబాద్‌ ఎలాంటి విపరిణామాలను ఎదుర్కొంటుంది? ప్రత్యేకించి ఒకేచోట వందల బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు 30, 40, 50 అంతస్తులు దాటి విచ్చలవిడిగా వెలిసిన, వెలుస్తున్న చోట జరిగే విధ్వంసం తీవ్రత ఎంత? మాండలేలో భూకంపం నేపథ్యంలో భవన నిర్మాణ రంగ నిపుణులను కలవరపెడుతున్న అంశాలివి.

గచ్చిబౌలిలో ఆకాశానికి నిచ్చెనలు!

గచ్చిబౌలి ప్రాంతంలో గమనిస్తే ఆకాశానికి నిచ్చెనలు వేశారా? అన్నట్టు వందల సంఖ్యలో ఆకాశహర్మ్యాలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్‌ నగరానికి ఉన్న జంట జలాశయాల సమీపంలోని కోకాపేట, బుద్వేల్‌, ఫైనిన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌ గూడ, మంచిరేవుల, నార్సింగి తదితర ప్రాంతాల్లో దాదాపు 50 అంతస్తుల వరకూ నిర్మాణాలు కొనసాగుతున్నవీ ఉన్నాయి. వాటిని చూస్తే అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఉన్నామా? అనే భ్రాంతి కలుగుతుంది. వీటిల్లో లక్షల మంది నివసిస్తున్నారు. వీరంతా భద్రంగానే ఉన్నారా? వీరు నివసిస్తున్న ఆకాశహర్మ్యాలు భద్రంగానే ఉన్నాయా? ఒకే ప్రాంతంలో కుప్పలుగా కట్టిన స్కై స్క్రాపర్ల బరువు కారణంగా కలిగే ఒత్తిడి భూమిపై ఎంతగా ఉన్నది? ఎక్కడో మయన్మార్‌లోని మాండలేలో భూకంపం సంభవిస్తే దానికి 1300 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకాక్‌ తీవ్రంగా ప్రభావితమైతే.. మరి లాతూర్‌, ములుగు వంటి సమీప ప్రాంతాల్లో అదే స్థాయి భూకంపాలు చోటు చేసుకుంటే పరిస్థితి ఏంటి? విచ్చలవిడి కట్టడాలతో హైదరాబాద్‌కు మేలెంత? నష్టమెంత?

ఎఫ్‌ఎస్‌ఐ తొలగింపుతో యథేచ్ఛగా..

గతంలో హైదరాబాద్‌లో ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు ఉండేవి. అంటే.. నిర్దిష్ట ప్రాంతంలో ఎన్ని అంతస్తులు కట్టాలనే దానిపై పరిమితులు ఉండేవి. కొన్నేళ్ల క్రితం వాటిని ఎత్తివేసిన తర్వాత నగరంలో, ప్రత్యేకించి గచ్చిబౌలి వంటి ఐటీ పరిశ్రమలు కొలువుదీరిన ప్రాంతంలో యథేచ్ఛగా 150కిపైగా భారీ టవర్ల నిర్మాణాలు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వెయ్యి మంది నివసించేందుకు అవకాశం ఉన్న చోట లక్ష మంది నివసిస్తున్నారు. ఆ టవర్లకు నీటి సరఫరాకు పాతాళ లోకానికి వేల సంఖ్యలో తవ్వుతున్న బోర్లు, అనేక అంతస్తుల సెల్లార్లు, బేస్‌మెంట్ల పేరిట తవ్విపారేస్తుండటంతో అక్కడ భూమి పుండులా మారిపోయిందనే ఆవేదనలు వ్యక్తమవుతున్నాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థ జలాలను తట్టుకునే స్థాయిలో మురుగునీటి పారుదల వ్యవస్థల్లేక రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. ఆయా టవర్ల నుంచి నిర్దిష్ట సమయాల్లో రాకపోకలతో రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటికి తోడు ఇదే ప్రాంతం భూకంపాలు రావడానికి అవకాశం ఉన్న ప్రాంతమని భూగర్భ శాస్త్రవేత్తలు సైతం గతంలోనే పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో భూకంపం రాలేదా?

హైదరాబాద్‌ భూకంపాలకు అతీతమైన ప్రాంతమేమీ కాదు. నగరంలో ఇప్పటి వరకూ 196 సార్లు ప్రకంపనలు వచ్చాయని నివేదికలు చెబుతున్నాయి. 2021 నుంచి లెక్కలు చూస్తే.. పదిసార్లు తక్కువ తీవ్రతతో భూకంపాలు చోటు సంభవించాయి.
ఇవీ ఆ వివరాలు..

తేదీ రిక్ట‌ర్ స్కేల్‌పై తీవ్ర‌త‌
26 జ‌న‌వ‌రి 2020 ఎం. 4.5
24 ఏప్రిల్ 2020 ఎం. 4.8
11 జూలై 2021 ఎం. 4.4
11 అక్టోబ‌ర్ 2021 ఎం. 4.3
23 అక్టోబ‌ర్ 2021 ఎం. 4.0
31 అక్టోబ‌ర్ 2021 ఎం. 4.3
09 జూలై 2022 ఎం. 4.5
21 మార్చి 2024 ఎం.4.6
10 జూలై2024 ఎం.4.4
04 డిసెంబ‌ర్ 2024 ఎం.5.0

జోన్‌ 2లో హైదరాబాద్‌

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం త‌క్కువ భూకంప తీవ్ర‌త క‌లిగిన ప్రాంతం (జోన్‌-2)గా వ‌ర్గీక‌రించారు. హైద‌రాబాద్‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లాలో 2024 డిసెంబ‌ర్‌ నెలలో రిక్ట‌ర్ స్కేల్ పై 5.3 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. దాని ప్రభావంతో హైద‌రాబాద్‌లో కూడా కొన్నిప్రాంతాల్లో భూమి కంపించింది. తెలంగాణ రాష్ట్రంలో గ‌త 50 ఏళ్ల‌లో వ‌చ్చిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. 1982లో ఉస్మాన్ సాగ‌ర్ జ‌లాశ‌యం స‌మీపంలో సూక్ష్మ భూ కంపం వ‌చ్చింది. 2020లో ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో వ‌చ్చిన భూ ప్ర‌కంప‌న‌లు భ‌యాందోళ‌న‌కు గురి చేశాయి. అక్టోబర్ 1994 నుంచి నవంబర్ 2017 మధ్య, ఒక్క‌ జూబ్లీ హిల్స్‌లోనే 979 భూకంపాలు నమోదయ్యాయి, వాటిలో అత్యధికంగా 2.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని రికార్డులు చెపుతున్నాయి. 1969 ఏప్రిల్ 13న భద్రాచలం సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.7. 2024, డిసెంబర్ 4న ములుగు జిల్లాలో వచ్చిన భూకంపం తీవ్రత 5.3. ములుగు, భద్రాచలం, కొత్తగూడెం, హైదరాబాద్, విజయవాడ వంటి చోట్ల దీని ప్రభావం కనిపించింది. హైదరాబాద్‌లోని బోరబండ, కార్మికనగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్ వంటిచోట్ల 2 నుండి 3 సెకన్ల పాటు స్వల్ప భూప్రకంపనలు నమోదయ్యాయి.

6.2 తీవ్రతకు కుప్పకూలిన లాతూర్‌

తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతం గోదావరి రిఫ్ట్‌ జోన్‌లో ఉన్నది. ఇక్కడ టాక్టోనిక్‌ యాక్టివిటీ కారణంగా ఓ మోస్తరు భూకంపాలు సంభవించే ప్రదేశం. హైద‌రాబాద్ మ‌హాన‌గరానికి 298 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లాతూర్ భూ కంప కేంద్ర నిల‌యం. ఇక్క‌డ 1993లో వ‌చ్చిన భూకంపంతో హైద‌రాబాద్ స‌హా తెలంగాణ అంత‌టా వ‌రుస ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. నాడు లాతూర్‌లో రిక్ట‌ర్ స్కేల్‌పై 6.2 తీవ్ర‌త‌తో వ‌చ్చిన భూ కంపంతో నాడు లాతూర్ అంతా కుప్పకూలింది. 52 గ్రామాలు పూర్తిగా నాశ‌నం అయ్యాయి. 10 వేల మంది ప్ర‌జ‌లు మ‌ర‌ణించారు. 30 వేల మంది గాయప‌డ్డారు. రూ.130 కోట్ల ఆస్తిన‌ష్టం జ‌రిగింది. అలాంటిది మాండ‌లేలో వ‌చ్చిన విధంగా 7.7 తీవ్ర‌త‌తో సమీప ప్రాంతాల్లో భూ కంపం వ‌స్తే హైద‌రాబాద్ ప‌రిస్థితి ఏమిటీ? మాండ‌లేలో భూ కంపం వ‌స్తే 1300 కిలో మీట‌ర్ల దూరంలో బ్యాంకాక్ ఆగ‌మైంది. అదే హైద‌రాబాద్ కు అతి స‌మీపంలో ఉన్న లాతూర్‌లో వ‌స్తే హైద‌రాబాద్ ప‌రిస్థితి ఏమిటి? మ‌న భ‌వ‌నాల భ‌ద్ర‌త ఎంత‌? అన్న చ‌ర్చ జ‌రుగుతున్న‌ది.

ఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలు పాటించాల్సిందే

భ‌వ‌నాల నిర్మాణంలో ఎఫ్ఎస్ఐ నిబంధ‌న‌లు పాటిస్తే ప్ర‌కృతి విప‌త్తులు జ‌రిగిన‌ప్పుడు కాస్తంత‌నైనా భ‌ద్ర‌త ఉంటుదని నిపుణులు అంటున్నారు. బ‌హుళ అంత‌స్థుల నిర్మాణాలు చేసే బిల్డ‌ర్లు, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ కంపెనీలు భ‌వ‌న నిర్మాణాల స‌మ‌యంలో భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేయడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. కొంత మంది భ‌వ‌న నిర్మాణదారులు భూకంపాలు త‌ట్టుకునేలా నిర్మిస్తున్నామని చెబుతున్నా.. అది ఎంత మంది అమల్లో పెడుతున్నారన్నది ప్రశ్నార్థకమే. ప్రభుత్వమే నిర్దిష్ట పారామీటర్లు పెట్టి అనుమతులు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని ఆకాశహర్మ్యాలకు చెక్‌పెట్టాలని, లేదంటే మన పరిస్థితి కూడా ఎప్పటికైనా బ్యాంకాక్‌ తరహా ప్రమాదాన్ని ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.