Telangana | పురపాలక శాఖ.. 2 ముక్కల వెనుక? వేర్వేరుగా ఎంఏ అండ్ యూడీ

  • By: sr    news    Apr 28, 2025 11:56 PM IST
Telangana | పురపాలక శాఖ.. 2 ముక్కల వెనుక? వేర్వేరుగా ఎంఏ అండ్ యూడీ
  • R R R లోప‌ల‌ అర్బ‌న్ డెవలప్‌మెంట్‌
  • దానికి బ‌య‌ట‌ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌
  • ఢిల్లీ, క‌ర్ణాట‌క త‌ర‌హాలో ప్రభుత్వ ప్ర‌యోగం
  • రెండు ముక్క‌లైన ఎంఏ అండ్ యూడీ
  • సీఎం వ‌ద్ద అర్భ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ‌
  • మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌కు వేరే మంత్రి!

Telangana |

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 28 (విధాత‌): తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతం రోజురోజుకూ విస్త‌రించ‌డం, విల్లాలు, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు రావ‌డం, వాణిజ్య కార్య‌క‌లాపాలు పెర‌గడంతో ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి అప్ర‌మ‌త్త‌మయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బన్‌ డెవ‌ల‌ప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా ఉన్న శాఖ‌ను రెండుగా విడ‌గొట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇక నుంచి ఈ శాఖ‌లో కార్య‌ద‌ర్శులు, ముఖ్య కార్య‌ద‌ర్శి, ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వేర్వేరుగా ఉంటారు. ప్ర‌స్తుతం ఈ విధానం ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వం, క‌ర్ణాట‌క రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న‌ది. రెండు ద‌శాబ్ధాల క్రితం ఔట‌ర్ రింగ్ రోడ్డుకు అంకురార్ప‌ణ చేశారు. అప్పుడు ప‌రిధి చూసి ఇంత పెద్ద విస్తీర్ణ‌మా? అని ప‌లువురు ఆశ్చర్యం వ్య‌క్తం చేశారు. జ‌నాభా పెర‌డం, లే అవుట్లు రావ‌డంతో ఖాళీ స్థ‌లాల ల‌భ్య‌త త‌గ్గిపోయింది.

దీంతో ప‌లువురు ఔట‌ర్ రింగ్ రోడ్డు బ‌య‌ట ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్లు కొనుగోలు చేయ‌క త‌ప్ప‌డం లేదు. దీనికి తోడు రంగారెడ్డి జిల్లాలోని నాగార్జున‌సాగ‌ర్ హైవే పై ఉన్న ఏడు మండ‌లాల్లో విస్త‌రించి ఉన్న 30వేల ఎక‌రాల్లో ఫ్యూచ‌ర్ సిటీని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం ఫ్యూచర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌ అథారిటీని ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్క‌డే ఏఐ సిటీని కూడా అభివృద్ధి చేస్తున్నామ‌ని ఇటీవ‌లే జ‌పాన్ దేశంలో ప‌ర్య‌టించిన ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు బ‌య‌ట కూడా అభివృద్ధి వేగంగా వ‌స్తుండ‌టంతో రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్‌)కు టెండ‌ర్లు ఆహ్వానించారు.

కొన్ని ప్యాకేజీల‌కు ఆహ్వానించ‌గా మిగ‌తా ప్యాకేజీల‌కు పిల‌వాల్సి ఉంది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్ర‌భుత్వం కొంత మేర నిధులు స‌మ‌కూర్చుతున్న‌ది. భ‌విష్య‌త్తులో ట్రిపుల్ ఆర్ వ‌ర‌కు ప‌ట్ట‌ణ ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సి ఉండ‌టంతో ప్రత్యేక శ్ర‌ద్ధ పెడితే ఆదాయంతో పాటు ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తులు ల‌భిస్తాయ‌ని మున్సిప‌ల్ ప‌రిపాల‌న, ప‌ట్ట‌ణాభివృద్ధి (ఎంఏ అండ్ యూడీ)ని రెండుగా విడ‌గొట్టాల‌ని నిర్ణ‌యించారని తెలుస్తున్నది. ప్ర‌స్తుతం ఈ విధానం ఢిల్లీలోని కేంద్ర ప్ర‌భుత్వం, కర్ణాట‌క రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న‌ది. అదే త‌ర‌హాలో తెలంగాణ‌లో అమ‌లు చేయ‌నున్నారు. క‌ర్ణాట‌క‌లో ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ను మాత్ర‌మే డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

ముఖ్య‌మంత్రి వ‌ద్దే ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌

ముఖ్య‌మంత్రి ఏ రేవంత్ రెడ్డి ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ (యూడీ)ను త‌న‌వ‌ద్దే పెట్టుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని అధికారులు సూచ‌న‌ప్రాయంగా వెల్ల‌డించారు. ట్రిపుల్ ఆర్‌ వ‌ర‌కు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ (యూడీ) ప‌రిధిలో పెట్టి, ట్రిపుల్ ఆర్ బ‌య‌ట ప్రాంతాన్ని మున్సిప‌ల్ వ్య‌వ‌హారాల శాఖ (ఎంఏ)కు అప్ప‌గించ‌నున్నారని తెలుస్తున్నది. మున్సిప‌ల్ వ్య‌వ‌హారాల శాఖను కొత్త‌గా వ‌చ్చే మంత్రికి అప్ప‌గిస్తారు. స‌ద‌రు మంత్రి కేవ‌లం ట్రిపుల్ ఆర్ బ‌య‌ట ఉన్న మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్లు, ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల‌ను ప‌ర్య‌వేక్షించాల్సి ఉంటుంది.

కాగా స‌చివాల‌యంలో మున్సిప‌ల్ వ్య‌వ‌హారాలు, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌లో 13 సెక్ష‌న్లు ఉండ‌గా, వాటిని కూడా స‌గం చొప్పున విభ‌జించ‌నున్నారు. తాజా బ‌దిలీల్లో ఈ మేర‌కు ఇద్ద‌రు ఐఏఎస్ అధికారుల‌ను నియ‌మించారు. ట్రిపుల్ ఆర్ వ‌ర‌కు కే ఇలంబ‌ర్తిని, ట్రిపుల్ ఆర్ బ‌య‌ట ప్రాంతానికి టీకే శ్రీదేవిని నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు అధికారుల‌కు కేటాయించిన ప్రాంతాలు, బాధ్య‌త‌లు ఇలా ఉన్నాయి.

ఇలంబ‌ర్తి ప‌రిధిలోకి వ‌చ్చే ప్రాంతాలు

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైద‌రాబాద్ మెట్రో వాట‌ర్ స‌ప్ల‌యి బోర్డు, హైద‌రాబాద్ మెట్రో రైలు, హెచ్ఆర్‌డీసీఎల్‌, హెచ్‌జీసీఎల్‌, ఎంఆర్ డీసీఎల్, వైటీడీఏ, రెరా, రెరా అప్పీలేట్ ట్రిబ్యున‌ల్‌, కులీ కుతుబ్ షా అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ అథారిటీ, హైడ్రా, ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్‌ అథారిటీ.

టీకే శ్రీదేవి ప‌రిధిలోని ప్రాంతాలు

క‌మిష‌న‌ర్ అండ్ డైరెక్ట‌ర్ మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, డైరెక్ట‌ర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌, ఇంజినీర్ ఇన్ ఛీప్ (ప‌బ్లిక్ హెల్త్‌), వీటీఏడీఏ, టీయూఎఫ్ఐడీసీ, మెప్మా.