Zoho | చిప్ తయారీ ప్రాజెక్టు.. వెనుకకు తగ్గిన జోహో

విధాత: జోహో కంపెనీ 5900 కోట్ల రూపాయలతో ప్రారంభించ తలపెట్టిన చిప్ తయారీ పరిశ్రమపై వెనుకకు తగ్గింది. మన దేశానికి చెందిన బహుళజాతి కంపెనీ 5900 కోట్ల రూపాయల వ్యయంతో కర్ణాటక గ్రామీణ ప్రాంతంలో ఒక చిప్ తయారీ పరిశ్రమను ప్రాంరంభించదలచినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు వెంబు శ్రీధర్ కొంతకాలం క్రితం ప్రకటించారు. అయితే చిప్ తయారీ రంగంలో తగిన అనుభవం ఉన్న భాగస్వామ్య కంపెనీ లభించకపోవడం వల్ల ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.
చిప్ తయారీ కంపెనీ ప్రారంభించడానికి ఏడాదిగా జోహో వేర్వేరు టెక్నాలజీ కంపెనీలతో చర్చలు జరుపుతూ వచ్చింది. ఆ చర్చలు ఏవీ ఫలించలేదని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో కేంద్రప్రభుత్వం సెమీ కండక్టర్ పరిశ్రమల రంగంలో చేస్తున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సెమీ కండక్టర్ల పరిశ్రమను ప్రారంభించేందుకు గౌతమ్ అదానీ ఇజ్రాయెల్‌కు చెందిన టవర్ సెమీకండక్టర్‌తో జరుపుతున్న చర్చల్లో కూడా ప్రతిష్టంభన ఏర్పడింది. అదానీ 85000 కోట్లతో అతిపెద్ద సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రారంభించాలని భావించారు. అయితే అంతర్గత అధ్యయనాల తర్వాత ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను నిలిపివేసినట్టు చెబుతున్నారు.