Zoho CEO Sridhar Vembu : 20ఏళ్లకే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలి

జోహో సీఈవో శ్రీధర్ వెంబు యువతకు 20ఏళ్లకే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని సూచించారు. గ్రామీణ జీవనం, సేవా కార్యక్రమాలతో వెంబు మరోసారి చర్చల్లోకి.

Zoho CEO Sridhar Vembu : 20ఏళ్లకే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలి

విధాత : యువతీయువకులు 20ఏళ్లకే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలని జోహో సీఈవో శ్రీధర్‌ వెంబు సూచించారు. తనను కలిసి చాలా మంది యువతకు ఇదే సలహా ఇచ్చినట్లు వెల్లడించారు. 20ఏళ్లలోనే పెళ్లి చేసుకోవడం ద్వారా మన పెద్దలు, సమాజం పట్ల ఉన్న బాధ్యతను పూర్తిచేయాలని సూచించారు. అపోలో సీఎస్‌ఆర్‌ వైస్‌ చైర్‌పర్సన్‌, నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన చేసిన పోస్ట్‌ను ఉద్దేశించి ఆయన ఈ అభిప్రాయం వ్యక్తంచేశారు.

ఇటీవల ఉపాసన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో సాగించిన సంభాషణను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. పెళ్లి చేసుకుంటున్నారా..? అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని ఆమె వెల్లడించారు. ఇదంతా చూస్తుంటే..మహిళలు కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టారని అర్థమవుతుందని..ఇది సరికొత్త భారత్‌’’ అని ఆమె రాసుకొచ్చారు. ఉపాసన పోస్టుపై వెంబు స్పందించారు. యువత 20ల్లోనే పెళ్లి చేసుకొని.. పిల్లల్ని కనాలని నేను సలహా ఇస్తుంటాను. వారు తమ సమాజం, పూర్వీకుల కోసం ఈ విధిని నిర్వర్తించాలి. ఇవన్నీ పాతకాలం మాటల్లా అనిపిస్తాయి. అయితే మళ్లీ ఈ మాటలే ప్రతిధ్వనిస్తాయని నేను భావిస్తున్నాను’’ అని ఒక పోస్ట్ చేశారు. శ్రీధర్ సలహాపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడుకు చెందిన సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు.. ఐఐటీ, మద్రాస్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆయన సిలికాన్ వ్యాలీలో జోహో కార్పోరేషన్ పేరుతో సాఫ్ట్‌వేర్ కంపెనీని ప్రారంభించి..దానికి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. దాదాపుగా వేల కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతియైన ఆయన.. అకస్మాత్తుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు. తన మాథాలంపరై గ్రామంలో సైకిల్‌పై తిరుగుతూ..గ్రామస్తులతో కలిసి సాదాసీదా జీవనం గడుపుతున్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడం, ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.