Pahalgam Attack | పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యలు మనదేశ హిందువులకు మేలు చేస్తాయా?
సంక్షోభంలో చిక్కి ఆకలి దారిద్యాలతో తల్లడిల్లే పాకిస్తాన్ ప్రజలు రేపో మాపో తమ సర్కార్ పై తిరగబడే పరిస్థితి వుంది. యుద్ధం బూచిగా చూపి ప్రజల్లో జాతీయోన్మాదం రెచ్చగొట్టి గద్దెమీద ఇంకా కొనసాగే అవకాశం పాక్ సర్కార్ కి లభిస్తుంది. లేదా సింధూ జలాలను భారత్ ఆపితే, ఆ రైతుల అండతో పాక్"ఉగ్రవాద" సంస్థలు గద్దె ఎక్కవచ్చు. ఇది అటు వైపు జరిగేది. ఇటు భారత్ సర్కార్ కి తక్షణ యుద్ధం అవసరం ఎందుకు వుందో చూద్దాం.

Pahalgam Attack | “ఉగ్రవాద” నిర్మూలన పేరిట సింధూ జలాల్ని అడ్డం పెట్టుకొని కోట్లాది పాక్ రైతు కుటుంబాల పొట్టకొడితే మన దేశ హిందువులకి న్యాయం జరుగుతుందా?
హిందువుల శ్రేయస్సు పేర హిందుత్వ సర్కార్ చేపట్టే యుద్ధోన్మాదంతో మున్ముందు ప్రధానంగా బలి పశువులయ్యేది హిందువులు కాదా? దేవుడి దర్శనానికి వెళ్లిన హిందూ మత భక్తులు ప్రాణాలు కోల్పోవడానికి ప్రభుత్వ భద్రతా వైఫల్యం ప్రధాన కారణం. అందుకు మోడీ సర్కార్ మొదట బహిరంగ ఆత్మవిమర్శ ప్రకటించాలి. అది కనీస ధర్మం. ఇంతవరకు మోడీ నోటి ఒక్క మాట రాలేదు.
మన ఇంటికి కన్నం వేసే దొంగల నేరం పై నిప్పులు కక్కితే మన స్వంత నేరం మాసిపోదు. మన ఇంటి రక్షణ కోసం చేపట్టాల్సిన బాధ్యతని నిర్లక్ష్యం చేసిన మన స్వీయ నేరం నుండి తప్పించుకోలేం. హిందూ భక్తులకు కల్పించాల్సిన భద్రతా వైఫల్యం పై మోడీ సర్కార్ స్వీయవిమర్శ లేకుండా పరవిమర్శని ఓ విధానంగా చేపట్టింది. “మా ప్రభుత్వ భద్రతా వ్యవస్థపై విశ్వాసంతో కాశ్మీర్ యాత్రకు వెళ్లిన హిందూ మత భక్తుల ప్రాణాల్ని కాపాడడంలో వైఫల్యం చెందింది. మేం ప్రగాఢ విచారం వ్యక్తం చేస్తున్నాం” అని ఒక్క మాటైనా ఐదు రోజుల్లో దేశ ప్రధాని మోడీ నోటి నుండి వినబడలేదు.
నిజానికి ఇలా “విచారం” వ్యక్తం చేస్తే సరిపోదు. ఈ క్రింది “క్షమాపణ” ప్రకటన కూడా చేయాల్సి వుంది.
“ఆర్టికల్ 370, 35A రద్దుతో కాశ్మీర్ ఓ సుస్థిర శాంతిసీమగా మారిందనే మా ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. ముఖ్యంగా హిందువుల్ని ఎక్కువగా నమ్మించింది. ఇప్పుడది అసత్యమని రుజువైంది. దేశ ప్రజల ఎదుట మా తప్పు ఒప్పుకుంటున్నాం. ముఖ్యంగా మమ్మల్ని నమ్మి బలైన హిందూ మత భక్తులకు క్షమాపణ చెబుతూ మన్నించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.”
హిందువుల పట్ల మోడీ సర్కార్ కి నిజంగా ప్రేమ వుంటే పై ఆత్మవిమర్శ ప్రకటన వచ్చి ఉండేది. సౌదీ నుండి రాగానే మోడీ పహల్గామ్ వెళ్లలేదు. మృతుల సందర్శనకి ఓ సమగ్ర ప్రయత్నం చేయలేదు. హాస్పటళ్ల సందర్శన చేయలేదు. మృతులకు దేశవ్యాప్తంగా ఓ వారం సంతాప దినాలనైనా ప్రకటించలేదు. మూడు రోజులైనా, పోనీ ఒక్క రోజైనా ప్రకటించలేదు. సానుభూతి సూచకంగా కనీసం బీహార్ ఎన్నికల బీజేపీ ప్రచారాన్ని వారం వాయుదా వేయలేదు. అఖికపక్ష సభకు కూడా దేశ ప్రధానిగా హాజరు కాలేదు. హిందువుల ఆచారం ప్రకారం ఇంట్లో శవం వుంటే పక్కింటి వాళ్ళు అన్నం తినరు. హిందువుల తరపున వకాల్తా తీసుకొని హిందువులు పాటించే కనీస ధర్మాల్ని కూడా పాటించలేదు. తెల్లారే బీహార్ ఎన్నికల ప్రచార సభలకు మోడీ వెళ్ళాడు. ఇది హిందువుల పట్ల ఆర్.ఎస్.ఎస్., బీజేపీ, మోడీ ల వాస్తవ నైజాన్ని వెల్లడిస్తుంది.
అడవి నుండి పాములు ఇంట్లో దూరనివ్వకుండా భద్రత కల్పించాల్సిన ప్రధాన బాధ్యత ఇంటి యజమానిది. ఆ ఇంటి యజమాని వైఫల్యం చెందాడు. ఆ పాము కాటుకు బలైన వారికి సంజాయుషీ ఇవ్వాల్సిన యజమాని తన నేరాన్ని బహిర్గతం కానివ్వకుండా అడవిని తగలబెడితే పాములు రావని కవ్విస్తున్నట్లు వుంది.
దున్నేసమయంలో కంది చేలో పారేసుకున్న నాగలి కర్రుకోసం కందిపప్పుతో వండిన పప్పుగిన్నెలో వెనకటికో పిచ్చోడు భూతద్ధంతో వెదికాడట. హిందూమత భక్తులకు భద్రత కల్పించడంలో స్వంత వైఫల్యానికి గల కారణాలను వెదకడం బాధ్యత గల ప్రభుత్వాల కనీస ధర్మం. “ఉగ్రదాడి” జరిగిన పహల్గామ్ లో వాస్తవ మూలకారణాల్ని వదిలేసి సింధూ జలాల్లో వెదకడం హాస్యాస్పద విధానమే. దేశ ప్రజల పట్ల, ముఖ్యంగా హిందూ మత భక్తుల పట్ల మోడీ సర్కార్ జవాబుదారీ తనాన్ని ప్రదర్శించడం లేదు. తన విధిని వదిలేసి పొరుగు దేశపు కోట్ల రైతు కుటుంబాలకు సింధూ జలాల్ని నిలిపి, పొట్టకొట్టే వ్యూహ రచనకి దిగడం “ఉగ్రవాద” నేరం కంటే అమానుషమైనది. ఏ చట్టాల్ని పాటించని రాజ్య రహిత “ఉగ్రవాద” సంస్థల కంటే బాధ్యత గల సర్కార్ ది నూరు రెట్ల నేర విధానమే. రోగం ఒకటైతే మందు మరొకటి వాడే విధానమిది. ఇది నిజంగా హిందువులకు మేలు జరుగుతుందా? చేలో పారేసిన కర్రు కోసం పప్పుకుండలో వెదికే పిచ్చోడికీ, మోడీ సర్కార్ కీ తేడా ఏమైనా ఉందా?
పాకిస్తాన్ బేస్ గా గల ఇస్లాం ఉగ్రవాద సంస్థలపై ప్రతీకారం పేర పాకిస్తాన్ ప్రజల్ని మోడీ సర్కార్ టార్గెట్ చేస్తోంది. ఇది ఏ ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా టార్గెట్ చేస్తుందో, ఆచరణలో దాన్ని మరింత పెంచి తీరుతుంది. నేటికీ పాకిస్తాన్ ఆర్ధిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ప్రధానంగా పార్లమెంటరీ పార్టీలే శాసిస్తున్నాయి. ఇస్లాం తీవ్రవాద సంస్థల స్థానం పాక్ పౌర సమాజంలో నేటికీ బలహీనమైనదే. ఏ ఇస్లాం ఉగ్రవాద సంస్థల్ని భారత సర్కార్ నిషేధించి వేటాడుతుందో, వాటినే పాకిస్తాన్ సర్కార్ కూడా నిషేధించి వేటాడుతోంది. అవి పాకిస్తాన్ ని ఆధారం చేసుకొని ప్రధానంగా పాక్ సాయుధ బలగాల మీద దాడులు చేస్తున్నాయి. ఓ పదిశాతమో ఎక్కువో తక్కువో భారత్ లోనూ చొరబడి దాడులు చేస్తున్నాయి. ఆ సంస్థల దాడులకు బలైన పాక్ సైనికుల సంఖ్య పరిశీలిస్తే ఈ నిజం అర్ధమౌతుంది. మోడీ సర్కార్ ప్రకటిత విధానం ప్రకారం తాజా పహల్గామ్ టెర్రరిస్టు దాడి పాక్ ఉగ్రవాద సంస్థ చేస్తే మనం ఏం చేయాలి? ఏ దౌత్య విధానం ద్వారా ఆ ఉగ్రవాదశక్తుల నిర్మూలన కోసం ప్రయత్నించాలి?
ఈ సందేశాన్ని పాక్ సర్కార్ కి మోడీ పంపి వుండాల్సింది. ‘మీ సర్కార్, మా సర్కార్ ఒకే ఉగ్రవాద ప్రమాదానికి నేడు బలి అవుతున్నాయి. మన రెండు బాధిత సర్కార్ల మధ్య సమన్వయంతో పని చేద్దాం. వాటి అణచివేత కోసం మా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోతే మీ దేశం పై మా దౌత్య, దౌత్యేతర వత్తిళ్ళు వుంటాయి.’
ఉదాహరణకు ఇటు మన ఈశాన్య రాష్ట్రాల్లో, అటు మియన్మార్ లో మనుగడలో వున్న కొన్ని ట్రైబల్ జాతులున్నాయి. అవి స్వయం విమోచనకి సాయుధ సంస్థలుగా తీవ్రవాద కార్యకలాపాల్ని సాగిస్తున్నాయి. ఉదా:- భారత సర్కార్ పై పోరాడే సాయుధ జాతీయ సంస్థ అదే జాతి నివసిస్తున్న మియన్మార్ లో కూడా చొరబడి ఆ దేశ సర్కార్ పై దాడులకు దిగిందని అనుకుందాం. సహజ న్యాయ సూత్రాల ప్రకారం భారత్, మియాన్మార్ సర్కార్లు మిత్రురాళ్లు అవుతాయి. తుంది. ఆ సంస్థ పై యుద్ధం చేస్తూ, దానిచే సైనిక నష్టాలు పొందే భారత్ సర్కార్ మియాన్మార్ సర్కార్ కి శత్రువు అవుతుందా? ఆ సంస్థ మియాన్మార్ లో చేసిన దాడికి ప్రతీకారం పేరిట భారత్ సర్కార్ పై మియన్మార్ యుద్ధ ప్రకటన చేయొచ్చా?
పాకిస్తాన్ సర్కార్ కి గల ద్విముఖ స్వభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుందాం. ఓవైపు ఇస్లామిక్ తీవ్రవాదంచే పెద్ద బాధిత రాజ్యంగా, మరోవైపు వీలున్నమేరకి భారత్ పైకి ఉసిగొలిపే రాజ్యంగా ద్విముఖ స్వభావాన్ని గుర్తిద్దాం. ఆ ప్రకారం తాజా ఫహల్గామ్ “ఉగ్రదాడి” వెనక పాక్ ప్రమేయం వుంటే, వాటి ఆధారాల్ని UNO ఎదుట ఉంచి ప్రపంచం ఎదుట నిరూపించి తగుచర్యల్ని కోరాలి. ఒకవేళ ఎవరికి వారే ఏకపక్షంగా చర్యల్ని చేపడితే ‘MIGHT IS RIGHT’ విధానం కాదా? మాట వరసకు వద్దాం. అంతర్జాతీయ నదీ జల చట్టాలకు లోబడి జరిగిన ఒప్పంధాలకు భిన్నంగా సింధూ జలాల్ని భారత్ బంద్ చేస్తే, రేపు చైనా బ్రహ్మపుత్ర జలాలతో ఆటలాడుకోవడానికి అవకాశం ఇవ్వదా?
ఈనాటికీ పాకిస్తాన్ ప్రధాన పౌర సమాజం ఇస్లాం తీవ్రవాదానికి ఆలంబనగా లేదు. నేడు సింధూ జలాల్ని ఆపితే రేపు ఏం జరుగుతుంది? సాగుచేసుకునే కోట్లాది పాకిస్తాన్ రైతులకు రేపు పంటలు ఎండి కడుపు మాడుతుంది. ఆ బాధిత రైతు కుటుంబాల్ని యిదే ఇస్లాం తీవ్రవాద సంస్థలు రెచ్చగొట్టే అవకాశాన్ని ఇస్తుంది. ప్రాధమికంగా పార్లమెంటరీ వ్యవస్థ నేటికీ మనుగడ సాగించే పాకిస్తాన్ రేపు ఏ తరహా వ్యవస్థగా మారుతుంది? అది మోడీ సర్కార్ కి తెలియని విషయమా?
స్థూలంగా పార్లమెంటరీ వ్యవస్థ గల మనదేశాన్ని 2014 నుండి పాలించినా హిందూ రాష్ట్రంగా మార్చే ఆర్.ఎస్.ఎస్. లక్ష్యం నెరవేరలేదు. పైగా దాని స్థాపన జరిగి ఈ ఏడాదికి నూరేళ్లు నిండింది. తీవ్ర అసహనంతో వుంది. తమ లక్ష్య సాధనకు స్వదేశీ హిందువుల సహకారం అందడం లేదు. సింధూ జలాల్ని ఆపి, కోట్లాది పాక్ రైతు కుటుంబాల్ని “ఉగ్రవాద” శక్తుల వైపు పంపే కొత్త వ్యూహాన్ని పన్నిందేమో! అక్కడది జయప్రదమైతే, దానికి కౌంటర్ ప్రోడక్ట్ గా ఇక్కడ మనది హిందుత్వ ఉగ్రరాజ్యంగా తేలిగ్గా మారుతుందనే అంచనాకి వచ్చి ఉండొచ్చేమో! ఇదే బహుశా ఆర్.ఎస్.ఎస్. వ్యూహం కావచ్చేమో! పాక్ వందశాతం ఇస్లాం మతతత్వ ఉగ్రవాద రాజ్యంగా మారితే, భారత్ నూరుపాళ్ళ హిందుత్వ ఉగ్రవాద రాజ్యంగా మారడానికి వీలుందనే కొత్త వ్యూహం ఐవుండొచ్చేమో!
ఈ యుద్ధోన్మాదం వాస్తవ యుద్దానికి దారితీసిందని అనుకుందాం. భారత్, పాకిస్తాన్ దేశాల ప్రజలు నష్టపోతారు. కానీ రెండు ప్రభుత్వాలకు రాజకీయ లబ్ది చేకూరుతుంది. అదే ఎలాగో చూద్దాం.
సంక్షోభంలో చిక్కి ఆకలి దారిద్యాలతో తల్లడిల్లే పాకిస్తాన్ ప్రజలు రేపో మాపో తమ సర్కార్ పై తిరగబడే పరిస్థితి వుంది. యుద్ధం బూచిగా చూపి ప్రజల్లో జాతీయోన్మాదం రెచ్చగొట్టి గద్దెమీద ఇంకా కొనసాగే అవకాశం పాక్ సర్కార్ కి లభిస్తుంది. లేదా సింధూ జలాలను భారత్ ఆపితే, ఆ రైతుల అండతో పాక్”ఉగ్రవాద” సంస్థలు గద్దె ఎక్కవచ్చు. ఇది అటు వైపు జరిగేది. ఇటు భారత్ సర్కార్ కి తక్షణ యుద్ధం అవసరం ఎందుకు వుందో చూద్దాం.
370, 35A రద్దు చేసి ఈ ఆగస్టుకు ఆరేళ్లు! ఐనా కాశ్మీర్ లోయ ఆచరణలో కబ్జా కాలేదు.
అడవులను కబ్జా చేసే కగార్ ఆపరేషన్ ప్రక్రియకి నిరసన పెరుగుతోంది. ఈ ప్రజాస్వామ్య తలం అడ్డు వస్తోంది. యుద్దోన్మాద వాతావరణం ఏర్పడితే ఆ తలం (స్పేస్) ఉండదు.
త్వరలో బీహార్, బెంగాల్ ఎన్నికలున్నాయి. NRC, CAA చట్టాల అమలుతో భారత్ ని మతతత్వ రాజ్యంగా మార్చడానికి బెంగాల్ సారవంత క్షేత్రం.
ఈ మూడింటితో పాటు క్రింది అవసరాలు కూడా మోడీ సర్కార్ ఎదుటకి వచ్చి వున్నాయి.
దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ప్రైవేటీకరణ ధరలు, రూపాయి విలువ పతనం, సుంకాల యుద్ధ చెడు ఫలితాలు వంటి సమస్యలతో సంక్షోభం తీవ్రతరం అవుతోంది. ఈ జనరల్ సమస్యల్లో క్రింది రెండు పెద్ద ప్రమాదాలుగా ముందుకు రానున్నాయి.
ట్రంప్ సుంకాల యుద్ధం మోడీని లొంగదీసింది. అమెరికా, యూరోప్ ల వ్యవసాయ ఉత్పత్తులు భారత్ కి దిగుమతుల పై సుంకాలలో కోత పడి, యదేచ్చగా డంపింగ్ జరగబోతోంది. మరోవైపు విదేశాలకు భారతదేశ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల పై సుంకాల శాతాలు పెరిగి స్థంభించి ఫోనున్నాయి. ఫలితంగా ఇప్పుటికే కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్రం కానుంది. అది అక్కడే ఆగకుండా పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు విస్తరిస్తుంది. ప్రదానంగా అమెరికా సృష్టించే ఈ వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక సంక్షోభాలకు వాస్తవ కారణాల్ని అమెరికా పైకి మళ్ళించనివ్వకుండా ఓ సంక్షుభిత, పేద విఫల రాజ్యమైన పాకిస్తాన్ పైకి దారి మళ్ళించే అవసరం ట్రంప్, మోడీ సర్కార్లకు తక్షణ అవసరమే.
నేడు కృత్రిమ మేధ (AI) ని కార్పొరేట్లు కంపెనీలకి వరంగా మారింది. అవి AI ద్వారా కోట్ల మంది ఉద్యోగుల పొట్ట కొట్టే వ్యూహ రచనలో మునిగి వున్నాయి. ఇది త్వరలో ఓ భయంకర నిరుద్యోగ సంక్షోభ భారతదేశాన్ని ఆవిష్కరణ చేయనుంది. ఈ నిరుద్యోగ సంక్షోభం సాంప్రదాయ కార్మిక, ఉద్యోగ వర్గాలతో పాటు సాఫ్ట్ వేర్ వంటి వివిధ అధికాదాయ ఉద్యోగ వర్గాలను సైతం ఈసారి బలి తీసుకోబోతోంది. ఈ రెండింటికి బలికానున్న బాధిత వర్గాల దృష్టిని దారి మళ్ళించడానికి ఓ యుద్దోన్మాదం అవసరం. అది సరిపోకపోతే నిజ యుద్ధం కూడా అవసరం అవుతుంది.
యుద్ధం వస్తే, ఎన్ని వేల మంది సైనికుల ప్రాణాల్ని బలిగొంటుందో! ఎన్ని లక్షల మంది ప్రాణాల్ని బలి తీసుకుంటుందో! ఎన్ని పదుల కోట్ల మంది ప్రజలకు జీవన భారంగా మారుతుందో! ఆ జీవన విధ్వంసానికి బలయ్యే దేశ ప్రజల్లో మతపరంగా హిందువులే అత్యధిక శాతం మంది వుంటారు.
పాకిస్తాన్ రైతులకు సింధూ జలాల్ని ఆపితే ప్రతీకారంగా ఒకవేళ 56 ఇస్లాం దేశాల సంస్థ, 21 అరబ్ దేశాల సంస్థ ఐక్య పిలుపు ఇస్తే భారతదేశ ప్రజలకు నష్టం ఎంతో? గల్ఫ్ దేశాలు వలస కార్మికుల్ని బహిష్కరిస్తే నష్టం ఎంతో! 1973 లో ఒపెక్(OPEC) పెట్రోల్ అమ్మకాల్ని బహిష్కరిస్తే నష్టం ఎంతో! గల్ఫ్ లో ఉద్యోగాలు పోగొట్టుకునే వారిలో అత్యధిక శాతం మంది హిందువులే!
అమెరికా నుండి మన దేశస్తుల్ని బేడీలు వేసి పశువుల్లా కట్టివేసి సైనిక విమానాల్లో పంపిన ట్రంప్ ఎదుట మోడీ సర్కార్ సాగిలపడింది. సుంకాల యుద్ధంలో ట్రంప్ ఎదుట మోడీ సాగిలపడాడం వల్ల నష్టపోయే వారిలో అత్యధిక శాతం మంది హిందువులే! బలికానున్న వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాల బాధిత వర్గాల్లో అత్యధిక శాతం మంది హిందువులే! ఈ ద్రోహం దేశ ప్రజల కన్ను కప్పాలంటే మోడీ సర్కార్ కి తక్షణమే ఓ యుద్ధం అవసరమే. ప్రజలకు మాత్రం అవసరం లేదు.
ప్రజల జీవన విధ్వంసం సృష్టించే యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించడంలో సైతం హిందువులే కీలకపాత్ర పోషించి ఆదర్శంగా నిలబడాల్సి వుంది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందిన మోడీ సర్కార్ ని నిలదీసే కర్తవ్యాన్ని కూడా హిందువులే ప్రధానంగా చేపట్టాల్సి వుంది. తమ హిందువుల శ్రేయస్సు పేరిట దేశాన్ని యుద్ధం వైపు నడిపిస్తున్న మోడీ సర్కార్ యుద్దోన్మాద విధానానికి వ్యతిరేకంగా హిందువులు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం వుంది.
భారతదేశాన్ని యుద్ధం వైపు నడిపిస్తున్న మోడీ సర్కార్ కి వ్యతిరేకంగా సర్వ వర్గాల, రంగాల ప్రజలు సమైక్యంగా గళం విప్పి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడింది. దేశ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తారని ఆశిద్దాం.
– ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
27-4-2025
గమనిక:– పహల్గామ్ దుర్గటనకు కారణాల పట్ల నా అభిప్రాయాలు నాకు వున్నాయి. మాలెగాం నుండి పుల్వమా వరకు అనుభవాల వెలుగులో, హేమంత్ కర్కారే అమర స్మృతిలో, మాజీ J&K గవర్నర్ సత్యపాల్ మాలిక్ సత్యవాక్కుల వెలుగులో నాకు ఏర్పడ్డ అభిప్రాయాల వెలుగులో రాయలేదు. సగటు దేశ ప్రజల మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని రాశానని మిత్రుల దృష్టికి తెస్తున్నా.
— —- —- — — – — – – – – – – – – – – – — – – — – – – –
ఇవి కూడా చదవండి..
“రక్తం మరుగుతోంది”.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Pahalgam | పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిలా.. పూర్తిగా చిత్రీకరించిన తొలి వీడియో! NIA చేతిలో కీలక ఆధారం!
భారత్ పైకి 130 అణుబాంబులు సిద్ధం: పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ బెదిరింపులు