50 years of PDSU । ప్రారంభ దశలో కోదాడ విప్లవ విద్యార్థి ఉద్యమం – కొన్ని జ్ఞాపకాలు

రాజకీయ సభలో భాగస్వామ్యమైన కోదాడ విద్యార్థులు మరింత చైతన్యపు రాజకీయాలకు దగ్గరయ్యారు. ఈ ప్రాంతంలో విప్లవ పార్టీ నిర్మాణం లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఆ రాజకీయాలు కలిగిన వారు గ్రామాలలో అక్కడక్కడ ఉన్నారు. వీరితో మాకు రాజకీయ సంబంధాలు కొనసాగుతుండేవి. ఈ సందర్భంగా ఒక ఘటనని ఉటంకిస్తున్నాను.

50 years of PDSU । ప్రారంభ దశలో కోదాడ విప్లవ విద్యార్థి ఉద్యమం – కొన్ని జ్ఞాపకాలు

50 years of PDSU । తాతలు కలుసుకుంటారట. పిల్లల నాటి సంగతులు మాట్లాడుకుంటారట. వాళ్ళ చదువుల రోజులను గుర్తు చేసుకుంటారట. ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.

మా చదువు రోజులు 1972 -75 ల్లో విప్లవోద్యమం ఉరకలేస్తుంది. విద్యార్థులపై అమోఘమైన ప్రభావం ఉంది. అప్పుడంతా ప్రభుత్వ, దాని ఎయిడెడ్ బడులు, కాలేజీలే. ప్రైవేట్ విద్యా విధానం మాటనే లేదు. విద్యార్థుల సమస్యలన్నీ ప్రభుత్వంతోనే ముడిపడి ఉండేవి. పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలే ప్రధానంగా ఉండేవి. వీటితోపాటు సామాజిక, సాంఘిక సమస్యలు వెంటాడేవి. ఇవి వ్యవస్థ ప్రతిరూపాలుగా ఉండేవి. ఆనాటి విప్లవోద్యమం వీటిని ప్రశ్నించే చైతన్యాన్ని ముందుంచింది. వ్యవస్థ ప్రభావితంలో ఉన్న శక్తులను మార్చడం, ఎదుర్కోవడం కఠినంగా ఉండేది. ఆ విధంగా కోదాడ కాలేజీలోని విద్యార్థులం రెండు వర్గాలుగా విడిపోయినం. విప్లవోద్యమాన్ని గమనిస్తున్న మేము, అది కూడా మమ్మల్ని గమనిస్తుంది. చేరదీసుకుంటుంది. వర్గ పోరాటాలే కళాశాలలు అనే నినాదం మమ్మల్ని బాగా ఆకట్టుకున్నది.

సామాజిక మార్పును కోరుకునే విద్యార్థులం కోదాడ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ (పి. ఎస్. యు) ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి సి. బాబూరావు ముఖ్యపాత్ర వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై పోరాడినం. దీనికి అన్ని ప్రభావితం కల విద్యార్థులు ఒక్కటై కదిలినారు. కాలేజీ అకాడమిక్ సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు సాగినవి. కాలేజి సమస్యలపై నిరవధికంగా పోరాడిన ఫలితంగా కాలేజీలో సైకిల్ స్టాండ్, టాయిలెట్స్, బాలికలకు లంచ్ రూముని సాధించుకున్నాo. ఇలా ఎన్నెన్నో… వీటితోపాటు అసాంఘిక శక్తుల అసభ్యతలను పి.ఎస్.యూ ప్రశ్నించింది. వారి దాడులను ప్రతిఘటించింది. ఒక నిప్పురవ్వ దావాగ్నిలా మారుతుందన్నట్లు, కోదాడ విద్యార్థి ఉద్యమం గ్రామీణ, హైస్కూల్ లకు ఎగబాకింది. ప్రజల్లో గొప్ప చర్చనీయాంశంగా మారింది.

ప్రగతిశీల భావాలతో రాష్ట్రంలో వివిధ పేర్లతో నిర్మాణమై కొనసాగుతున్న సంస్థలతో 1974 అక్టోబర్ 11, 12 తేదీలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యూ) ఆవిర్భవించింది. దానిలో కోదాడ పి.ఎస్.యూ కూడా విలీనం అయింది. సమగ్ర దృక్పథం కలిగిన పిడిఎస్ యూ విద్యార్థులను సంఘటిత పరిచింది. చైతన్య పూరిత ఉద్యమాలను కొనసాగించింది. విద్యార్థుల సమస్యలతో పాటు ప్రజల, ప్రజాస్వామికవాదుల సమస్యలపై కూడా స్పందించింది. వాటికి క్రియాశీల సంఘీభావాన్ని ప్రకటించింది. పిడిఎస్ యూ చేపట్టిన న్యాయమైన పోరాటాలకి ఉపాధ్యాయులు కూడా స్పందించారు. మద్దతు ఇచ్చేవారు. కోదాడ కాలేజీలోని ఉపాధ్యాయులు వారి సమస్యలపై రెండు వర్గాలుగా విడిపోయినా మా విద్యార్థి ఉద్యమానికి పోటీపడి ఇరువురు మద్దతు ఇచ్చేవారు. పొలిటికల్ సైన్స్ మేడం జానకి గారి ఇంట్లో పిడిఎస్ యూ కు చెందిన విద్యార్థినీల విస్తృత సమావేశం నిర్వహించుకున్నారు. అసాంఘిక శక్తుల ఆగడాలకు లెక్చరర్ల కుటుంబాలు కూడా ఇబ్బందులకు గురయ్యేవి. ఆ సందర్భంగా పిడిఎస్ యూ ను ఆశ్రయించేవారు. వాటిని ప్రతిఘటించడం తో పిడిఎస్ యూ ను మనసా, వాచా కోరుకునేవారు. అప్పుడు ప్రగతిశీల విద్యార్థి, ఉపాధ్యాయ బంధం విడదీయలేనిది. ఆనాటి పిడిఎస్ యూ పోరాటాలు ఉపాధ్యాయులను కూడా ప్రగతిశీల భావాలవైపు తిప్పిన శక్తిని ప్రదర్శించింది. క్లాసు రూమ్ మీటింగులు కూడా బాగా జరిగేవి. ఆ సందర్భంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఐదు నిమిషాలు పక్కకు పోయేవారు. వారు విద్యార్థి ఉద్యమానికి సహకరించే ధోరణిని అభివృద్ధి చేసింది పి డి ఎస్ యూ.

కోదాడ కాలేజీకి వచ్చే విద్యార్థులు వారి స్తోమతను బట్టి హాస్టల్స్ లోనూ, కిరాయి రూమ్స్ లలోను నివసించేవారు. సమీప గ్రామాల విద్యార్థులు బస్సుల్లోనూ, సైకళ్లతోనూ వచ్చి పోతుండేవారు. హాస్టల్ సమస్యలపై, రూమ్స్ లోని విద్యార్థుల స్టవ్వులకు కిరోసినివ్వాలని (అప్పుడు కిరోసిన్ స్టవ్ లే), బస్సుల్లో వచ్చే విద్యార్థులకు టికెట్ రాయితీ ఇవ్వాలని పోరాడినారు. అప్పుడు అన్నీ ప్రైవేట్ బస్సులే. బస్ యజమానులకు వ్యతిరేకంగానూ, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలుగాను కొనసాగినవి. విద్యార్థులకు ఆ పోరాటాలు ప్రజాస్వామిక చైతన్యాన్ని, పరిమిత వర్గ చైతన్యాన్ని అందించాయి. వీటి నుండి గ్రామాల్లో పిడిఎస్ యూ పార్టీగా మారిపోయింది. గ్రామాల్లో అధికార పార్టీల ఆగడాలను తట్టుకోలేని వారికి పిడిఎస్ యూ నే ప్రత్యామ్నాయంగా భావించారు. వారి పిల్లలు పిడిఎస్ యూ లో చేరడాన్ని బాధిత తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆధిపత్య పార్టీల వారి సంఘాల దాడులను ఎదుర్కోవడం పిడిఎస్ యూ విద్యార్థులకు కొన్ని సందర్భాల్లో కష్టతరంగా ఉండేది. దానికి ఇతర శక్తుల నుండి మిత్రులను సంపాదించుకునేందుకు పురమాయించాము. ప్రారంభం నుండే జరిగే అన్నిరకాల దాడులను అంచనా వేస్తూ వాటిని ప్రతిఘటించే కర్తవ్యాన్ని కూడా చర్చిస్తుండే వారిమి. దానికి తగిన తయారీలను చేసుకునేవారిమి. అప్పుడే ఉద్యమ భాగస్వాములకు విశ్వాసం కలిగిస్తాము. పట్టణంలోని సహసానికి మారుపేరైన యువకులు బ్రహ్మచారి, అల్తాఫ్ హుస్సేన్ మొదలగు వారు ముందుకు వచ్చారు. వారు ఇంకా రాజకీయంగా సంఘటితపడని కారణంగా సలసల మరిగే ఉడుకు రక్తంతో నిత్యం శత్రువుపై దాడుల గురించి మాట్లాడుతుండేవారు, దుందుడుకు స్వభావం కలిగి ఉండేవారు. స్థానికంగా పునాది వర్గం నుండి కొన్ని కొత్త శక్తులు లభించడంతో సంఘానికి మాత్రం కొంత ధైర్యం దొరికింది. ఈ క్రమంలో స్థానికులు మునగాల ప్రభాకర్ విస్తృతంగా పట్టణ యువకుల అభిమానం పొందిన వాడు. హైదరాబాదులో చదువుతూ విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైనాడు. ఇతను కోదాడ రాకతో విద్యార్థి ఉద్యమానికి ఎంతో ఊపునిచ్చింది.

వెలిదండలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుల సంస్మరణ సభని కోదాడ విద్యార్థులు, గ్రామ ప్రగతిశీల విద్యార్థి సంఘం గొప్పగా నిర్వహించింది. కాశీపతి కంఠం నుండి వెలిదండ విప్లవాల పూదండ అని మారుమోగింది. హైదరాబాద్ అరుణోదయ కళాకారులు లలిత, గీత, అనురాధ, చలపతి మొదలగు వారితో చెల్లి చంద్రమ్మ ఒగ్గుకథ ఉర్రూతలూగించింది. రాజకీయ సభలో భాగస్వామ్యమైన కోదాడ విద్యార్థులు మరింత చైతన్యపు రాజకీయాలకు దగ్గరయ్యారు. ఈ ప్రాంతంలో విప్లవ పార్టీ నిర్మాణం లేదనే చెప్పుకోవచ్చు. కానీ ఆ రాజకీయాలు కలిగిన వారు గ్రామాలలో అక్కడక్కడ ఉన్నారు. వీరితో మాకు రాజకీయ సంబంధాలు కొనసాగుతుండేవి. ఈ సందర్భంగా ఒక ఘటనని ఉటంకిస్తున్నాను.

చదువు కోసం నేను కోదాడ వచ్చిన సమయంలోనే వృత్తిరీత్యా డాక్టరు జాస్తి సుబ్బారావు గారు అదే సంవత్సరం కోదాడ వచ్చారు. ఈయన వద్దకు వైద్యానికి పోవాలంటే అమ్మో అనుకునేవారు. విపరీత జనం. చిన్నా ,పెద్ద అనే తేడా లేకుండా అందరినీ బాగా చూస్తాడు. ఇతర డాక్టర్లతో పోల్చితే బాగా తక్కువ డబ్బులు తీసుకుంటాడు. స్కూల్ విద్యార్థులను వదిలేస్తాడు. మంచి డాక్టర్ అని కొద్ది రోజుల్లోనే పెద్ద పేరు వచ్చింది. ఈయన అనుకోకుండానే 50 సంవత్సరాల తర్వాత నాకు ఇటివలఎదురుపడ్డాడు. ఆనాడు మా ఇద్దరి సంబంధం తో ఉండే ఒక ఘటనను పూసగుచ్చినట్లు గుర్తు చేసిండు. ఒక పేలుడు ఘటనలో గాయపడిన నక్సలైట్ నా వద్దకు చేరుకున్నాడు. ఆయనను మారుపేరుతో డాక్టర్ సుబ్బారావు గారి హాస్పటల్లో చేర్పించాను. ఒకరోజు హాస్పిటల్ లోనే క్షతగాత్రుడైన నక్సలైట్ ని పోలీసు గుర్తించి అరెస్టు చేసింది. దీనితో డాక్టర్ సుబ్బారావు పై పోలీసు పెట్టిన ఒత్తిడి మామూలు కాదు. చాలాకాలం హాస్పిటల్ పై నిఘా ఉండేది. అదంతా 50 ఏళ్ల తర్వాత గుర్తు చేస్తుంటే ఆయనపై నాకున్న అభిప్రాయం మారిపోయింది. ఎంతో మారిపోయిండు అనుకునే డాక్టర్ సుబ్బారావు మారలేదు. సామాజిక మార్పు ఆవశ్యకతనూ నొక్కి చెపుతూనేవున్నాడు.

పిడిఎస్ యూ విద్యార్థులను ఉద్యమాల్లో భాగస్వామ్యం చేసే దానిలో భాగంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టాము. యువ అనాధ మూగ మనిషి మా సహకారాన్ని కోరాడు. కాలేజీ తరగతులన్నీ తిప్పి సహకరించమని విజ్ఞప్తి చేసినాం. విద్యార్థి ,ఉపాధ్యాయులు స్పందించారు. పిడిఎస్ యూ నాయకులు ఆత్మకూరు మోహన్ రెడ్డి రూములో ఈ మూగ మనిషి 6 రోజులు ఉన్నాడు. ఒకరోజు కలవరిస్తూ మాట్లాడుతున్నాడని మోహన్ చెప్పాడు. అప్పుడు ఎవరూ అని పరిశీలిస్తే మారువేషంలోని పోలీసు అని తేలింది. పిడిఎస్ యూ రాష్ట్ర మహాసభల అనంతరం ఒక సంవత్సరం తర్వాత మొదటి రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని నిర్ణయించింది. దీన్ని కోదాడలో 1975 జూన్ 15 నుండి 19 వరకు ఐదు రోజులు 300 మంది పి.డి.ఎస్.యూ కార్యకర్తలతో దిగ్విజయంగా నిర్వహించాము. దీనికి రాజకీయ బాధ్యుడిగా జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ వారం ముందే ఒక ఇనుప పెట్టెతో కోదాడ చేరుకున్నాడు. కౌన్సిల్ సందర్భంలో ప్రతిరోజు రాత్రి ఏదో ఒక ఊరెళ్ళి బహిరంగ సభ నిర్వహించాo. వక్తగా కాశీపతి తదితరులు ఉండేవారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేవి. కౌన్సిల్ ముగింపు సభ కోదాడ పాత బస్టాండ్ లో నిర్వహించాము. విజయవాడ నుండి కెమెరా తో రమణ వచ్చాడు. ఫోటోలు తీశాడు. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ తో ఏదో మాట్లాడుకున్నాడు. కౌన్సిల్ తదనంతరం మూడు రోజులకి జంపాల కోదాడ నుండి విజయవాడ వెళ్లాడు. మరో మూడు రోజులకే 1975 జూన్ 25 అర్ధరాత్రి ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రతిపక్ష నాయకులనూ నిర్బంధించింది. సొంత పార్టీలోని అసమ్మతి వాదులను కూడా వదిలిపెట్టలేదు. విప్లవకారులను తీవ్ర నిర్బంధకాండకు గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా పిడిఎస్ యూ నాయకులను నిర్బంధించింది. ముఖ్య నాయకత్వం అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. అందులో భాగమే జంపాల. అదే సంవత్సరం నవంబరు 4 రాత్రి విజయవాడ లో చండ్రపుల్లారెడ్డికి కుడి భుజంగా ఉండే నీలం రామచంద్రయ్యతో జంపాలను కూడా రాజ్యం నిర్బంధించింది. బూటకపు ఎన్కౌంటర్లో కాల్చి చంపింది. పైన పేర్కొన్న విజయవాడ రమణనే పోలీస్ ఇన్ఫార్మర్ గా మారి పట్టించాడని తర్వాత రుజువు అయింది.

కోదాడలో కూడా మాపై గుప్తంగా పోలీసు కదలికలు ఉన్నాయి. కానీ మేము గమనించలేదు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న నేను అనుమానంగా ఒక నెల ఆలస్యంగా కాలేజీకి వెళ్లాను. పోలీస్ వాకప్ చేస్తున్నది. పది మంది పోలీసులు కాలేజీ గేటు వద్దకు చేరుకున్నారు. ప్రిన్సిపాల్ నాగయ్య గారు అనుమతి లేనిది ప్రవేశించరాదని పోలీసులను ఆపుతున్నాడు. ఆ సమయంలో క్లాసులో ఉన్న నన్ను సిమెంటు కిటికీ తొలగించి అవతలికి పంపించాక పోలీసులని ప్రవేశింపజేశారు. ఫోటో కూడా ఇవ్వనని నిరాకరించాడు. కోదాడ అధ్యాపక బృందం సహకారం ఎంతో సాహసోపేతమైనది. అప్పటి నుండి నేను కె.ఆర్.ఆర్ కళాశాల నుండి వర్గ పోరాటాల కళాశాలలో విద్యార్థిగా చేరాను. నాతోపాటు సైన్స్ విద్యార్థి మోహన్ రెడ్డి, ప్రభాకర్ లను కూడా పోలీసు వేటాడింది. ముగ్గురం కోదాడ కాలేజీ నుండి అజ్ఞాత జీవితంలోకి వెళ్లిపోయాం. అలా రాష్ట్రంలో సుమారు 70 మంది పిడిఎస్ యూ విద్యార్థి నాయకులు రహస్య జీవితంలోకి వెళ్లారు. అతదుపరి కోదాడ విద్యార్థి నాయకులు, మా గ్రామస్తులు గురూజీ, వెంకటేశ్వర్లు కాలేజీ వదిలేసి గ్రామాల్లో నాతో తిరిగారు. మాకోసం అనేకమంది విద్యార్థులను పోలీసు టార్చర్ చేసింది. ఉన్నం ( మీసాల) రామారావు, నాగేశ్వరరావు, శ్రీమన్నారాయణ మొదలగు వారిని గాయాలకు గురి చేశారు. మేము కిరాయి ఉన్న ఇళ్లవారిపై దాడులు చేశారు.

అత్యవసర పరిస్థితి కాలంలో విద్యార్థి ఉద్యమం స్తబ్దతకు గురైంది. అది తొలగిపోగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా రెట్టింపు ఉత్సాహంతో విద్యార్థి ఉద్యమం ఉరుకులు పెట్టింది. ఉక్కు పాదంతో ఉద్యమాన్ని తాత్కాలికంగా అణచగలరేమో గాని, శాశ్వతంగా నిర్మూలించలేరని చరిత్ర రుజువు చేసింది. కోదాడ పోలీస్ స్టేషన్ లోని ఒక దుర్మార్గ దురాగతానికి వ్యతిరేకంగా చిన్ని, కృష్ణారెడ్డి నాయకత్వంలో వందలాదిమంది హైస్కూల్ విద్యార్థులు పీ..డీ..ఎస్.. యూ… అని నినదించుకుంటూ విసిరిన రాళ్లు న్యాయాన్ని పలకరించాయి. ఇంటర్ విద్యార్థులు బంగారు, రంగారావు, విద్యాసాగర్ రెడ్డి, సీతారాములు మొదలగువారి రూములు ఆఫీసుగా ఉండేవి. వీరిలో తర్వాత పి రంగారావును డిగ్రీ చదువు కోసం ఖమ్మం వెళ్ళమన్నాను. తదుపరి రాంబాబు, దుర్గాప్రసాద్, జ్వాలా, నాగిరెడ్డి, వెంకట్రావు, నాగార్జున, రాఘవరెడ్డి మొదలగు వారు జట్లు, జట్లుగా విడిపోయి రాసిన గోడ రాతల నినాదాలు నేటికీ కాషన్ చేస్తూనే ఉన్నాయి. గౌరీ శంకర్ పోకస్ (గోడపత్రిక) చీకటిలో వెలుతురిని వెదజల్లుతుంది. అచ్యుత రామారావు ఆణిముత్యపు రాతతో ఫెయిర్ చేసిన కరపత్రాలు నిత్యం అచ్చు అవుతూనే ఉంటాయి. భగవాన్, హరికిషన్, బాలు, కొండల్, కోటి, వెంకటేశ్వర్లు, మట్టా, ఉదయ్ కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తూనే ఉంటాయి.

ఉద్యమాలకు అసమాన వ్యవస్థనే పునాది. అది మారకుండా దాని మూలంగా ఆవిష్కృతమయ్యే ఉద్యమాలను అణచడం సూదిని మూటగట్టడమే. వ్యవస్థ కు చేత కానిది తమ స్వయం కృతాపరాదంకు ఉద్యమం విచ్చిన్నతను ఎదుర్కొన్నది. ఏ కారణాల చేతనైన సంస్థలు చీల్చేవారు పేరు సవరించుకోవడం కనీసపు నైతికత. కానీ అందరూ పీడీఎస్ యూ పేరిటనే వేరువేరుగా కొనసాగడం, విప్లవ విద్యార్థి ఉద్యమానికి అపహాస్యం తలపెట్టడమే. భవిష్యత్తులోనైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిద్దాం.

వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా పిడిఎస్ యూ రాజకీయ, సామాజిక, చైతన్యాన్ని, ప్రాపంచిక దృక్పథాన్ని సంతరించుకున్నది. ఇంటా, బయట విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ, అద్భుతమైన ఐదు దశాబ్దాల విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రను సృష్టించింది. ఘనంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనూ, అక్టోబర్ 24న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలోనూ, నవంబర్ 5న విజయవాడలోనూ అర్థ శతాబ్దోత్సవాన్ని నిర్వహించుకుంటున్న పిడిఎస్ యూ కు లాల్ సలామ్…

 

– పి సూర్యం
13-10-2024

http://50 ఏండ్ల పీడీఎస్‌యూకు విప్లవ జేజేలు https://vidhaatha.com/latest-news/a-special-article-on-the-occasion-of-50-years-of-pdsu-99982

https://vidhaatha.com/vidhaatha-special/many-vicissitudes-in-the-journey-of-pdsu-movement-of-five-decades-99842