Energy Efficiency | కేంద్రం చేతిలోకి ఏసీ రిమోట్‌.. ఇకపై 20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉండకూడదు!

Energy Efficiency | కేంద్రం చేతిలోకి ఏసీ రిమోట్‌.. ఇకపై 20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉండకూడదు!

Energy Efficiency |  దేశంలో విద్యుత్తు వినియోగంలో వృథాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలో నూతన విద్యుత్తు పాలసీని అమల్లోకి తీసుకురానున్నది. ఇందులో ఏసీల వాడకం అనేది అత్యంత కీలకంగా ఉండబోతున్నది. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ బుధవారం ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇకపై ఏసీలకు కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు విధించబోతున్నట్టు ప్రకటించారు. వీటి ప్రకారం.. ఏసీలు కనిష్ఠంగా 20 కంటే తక్కువ ఉష్ణోగ్రతలో వాడకూడదు. అలానే.. గరిష్ఠంగా 28 డిగ్రీల వరకూ ఉంచవచ్చు. ఏసీని ఎక్కువగా వాడితే మనకు వచ్చే బిల్లులపై వాటిని వాడే ఇళ్లలో పూర్తిగా అవగాహన ఉండే ఉంటుంది. వేసవి వచ్చిందంటే చాలు.. ఏసీలతో కరెంటు బిల్లు మోత మోగిపోతుంది. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది.

ఏసీ ఉష్ణోగ్రతలను నియంత్రించడం వినూత్న ప్రయోగమని కేంద్రమంత్రి అభివర్ణించారు. సుస్థిర పట్టణ జీవనాన్ని ప్రమోట్‌ చేసేందుకు ఉద్దేశించి విస్తృత స్థాయి వ్యూహం ఇదని ఆయన చెప్పారు. అదే సమయంలో నానాటికీ పెరుగుతున్న విద్యుత్తు అవసరాలను, ప్రత్యేకించి వేసవి సీజన్‌లో విద్యుత్‌ డిమాండ్‌ను పరిష్కరించేందుకు ఈ విధానం తీసుకువస్తున్నట్టు తెలిపారు. నివాసాల్లోనూ, కమర్షియల్‌ ప్రదేశాల్లోనూ వినియోగించే ఏసీలు దేశంలో అత్యధిక విద్యుత్‌ను ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీలపై కేంద్ర దృష్టిసారించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) రూపొందిస్తున్నది. ఏసీ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఉపయోగిస్తే ఇంధనం ఆదా అవుతుందని బీఈఈ చెబుతూ వస్తున్నది. ఈ నిబంధనలు అమల్లోకి రాగానే.. ఇకపై తయారు చేసే కొత్త ఏసీలన్నీ నిర్దేశిత ప్రమాణాల మేరకు తయారు కానున్నాయి. ఇప్పటి వరకూ కనిష్ఠంగా 16 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలను తగ్గించుకునే అవకాశం ఉండగా.. ఇకపై వచ్చే వాటిలో దానిని తొలగించనున్నారు. నివాసాలు, కార్యాలయాలు, కమర్షియల్‌ కాంప్లెక్లులు, సినిమా థియేటర్లు.. ఇలా అన్నింటిలోనూ నిబంధనలను వర్తింపజేయనున్నారు.

ఇప్పటికే రోమ్‌లో 23 డిగ్రీలు, జపాన్‌లో 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు అమలువుతున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకున్నది. ఏసీలో ఒక డిగ్రీ సెల్సియస్‌ను పెంచితే.. విద్యుత్తు వినియోగం సుమారు 6 శాతం పెరుగుతుందని ప్రభుత్వం గణాంకాలు పేర్కొంటున్నాయి. కొత్త విధానాన్ని విస్తృతస్థాయిలో అమలు చేసినట్టయితే.. చాలా లాభాలు ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నది. దేశంలో ఆరు కోట్ల నివాసాలు, 12 లక్షల వాణిజ్య ప్రదేశాల్లో ఈ విధానం అమలు చేస్తే.. నాలుగైదు కొత్త థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లు నిర్మించాల్సిన అవసరం ఉండదని, కర్బన ఉద్గారాల విడుదల కూడా గణనీయంగా తగ్గిపోతుందని పేర్కొంటున్నది.