ఏక‌గ్రీవ సాంప్ర‌దాయానికి గండి కొట్టిన బీఆరెస్‌

రాష్ట్రంలో ప‌ద‌విలో ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఏకార‌ణం చేత‌నైనా మ‌ర‌ణిస్తే ఆ స్థానానికి వ‌చ్చే ఉప ఎన్నిక‌కు గ‌తంలో ఏ రాజ‌కీయ పార్టీ కూడా పోటీ పెట్ట‌కుండా సిట్టింగ్ పార్టీ అభ్య‌ర్థి ఏక‌గ్రీవంగా ఎన్నిక చేసుకునే వారు. ఈ మేర‌కు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఒకే మాట మీద ఉండి స‌హ‌క‌రించుకునే వాళ్లు... ఈ విధంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన వారు ఎక్కువ‌గా కుటుంబ స‌భ్యులే ఉండేది. 2001 డిసెంబ‌ర్ 29వ తేదీన‌ దేవ‌ర కొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ రాగ్యా నాయ‌క్‌ను న‌క్స‌లైట్లు కాల్చి చంపారు.

  • By: Subbu |    politics |    Published on : Nov 14, 2025 7:42 PM IST
ఏక‌గ్రీవ సాంప్ర‌దాయానికి గండి కొట్టిన బీఆరెస్‌

విధాత‌, హైద‌రాబాద్‌: రాష్ట్రంలో ప‌ద‌విలో ఉన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ ఏకార‌ణం చేత‌నైనా మ‌ర‌ణిస్తే ఆ స్థానానికి వ‌చ్చే ఉప ఎన్నిక‌కు గ‌తంలో ఏ రాజ‌కీయ పార్టీ కూడా పోటీ పెట్ట‌కుండా సిట్టింగ్ పార్టీ అభ్య‌ర్థి ఏక‌గ్రీవంగా ఎన్నిక చేసుకునే వారు. ఈ మేర‌కు అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఒకే మాట మీద ఉండి స‌హ‌క‌రించుకునే వాళ్లు… ఈ విధంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన వారు ఎక్కువ‌గా కుటుంబ స‌భ్యులే ఉండేది. 2001 డిసెంబ‌ర్ 29వ తేదీన‌ దేవ‌ర కొండ ఎమ్మెల్యే డాక్ట‌ర్ రాగ్యా నాయ‌క్‌ను న‌క్స‌లైట్లు కాల్చి చంపారు.

అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీల మ‌ధ్య‌ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే మండేంత వైరం ఉండేది కానీ 2002లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా ఎన్నుకుందామ‌ని అధికార పార్టీ పెట్టిన ప్ర‌తిపాద‌న‌కు ప్ర‌తిప‌క్ష పార్టీలైన టీడీపీ, సీపీఐ, సీపీఎం త‌దిత‌ర పార్టీల‌న్ని ఆమోదం తెలిపాయి. దీంతో దివంగ‌త ఎమ్మెల్యే రాగ్యానాయ‌క్ స‌తీమ‌ణి ధీరావ‌త్ భార‌తిని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. ఇలా ఆనాడు అన్ని పార్టీలు విభేదాలు మ‌రిచి మ‌ర‌ణించి ఎమ్మెల్యే ఆత్మ‌కు శాంతి క‌లిగే విధంగా ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డం ఆనాడు ఒక సాంప్ర‌దాయంగా కొన‌సాగింది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీలో 2014లో ఆళ్ల‌గ‌డ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి రోడ్డ ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే, ఆనాటి వైసీపీ అభ్య‌ర్థిగా భూమా అఖిల ప్రియ‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. భ‌ద్ద శుత్రుత్వం ఉన్న‌ప్ప‌టికీ చంద్ర‌బాబు పోటీకి నిలుప‌లేదు. ఇది అంతా గ‌తం.. కానీ ఉమ్మ‌డి రాష్ట్రంలోనే ఈ సాంప్ర‌దాయానికి మొట్ట‌మొద‌టి సారిగా బీఆరెస్ తెర‌దించింది.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే 2007 డిసెంబ‌ర్‌28న‌ ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే పి. జ‌నార్థ‌న్‌రెడ్డి గుండె పోటుతో మ‌ర‌ణించారు. ఆ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో పీజే ఆర్ కుమారుడు విష్ణు వ‌ర్థ‌న్‌రెడ్డిని ఏక‌గ్రీవంగా ఎన్నుకోవ‌డానికి స‌హ‌క‌రించాల‌ని అధికార కాంగ్రెస్ పార్టీ కోరింది. నాటి ప్ర‌ధాన ప్ర‌తిప‌ద‌క్ష‌మైన టీడీపీ, ఇత‌ర ప‌క్షాలైన సీపీఐ,సీపీఎం పార్టీల‌న్నీ ఏక‌గ్రీవానికి అంగీక‌రించాయి. కానీ బీఆరెస్ అధినేత కేసీఆర్ ఇందుకు స‌సేమిరా అన్నారు. రాజ‌కీయాల‌లో వార‌స‌త్వాలు ఎందుకు, సానుభూతులెమిటీ పోరాడి గెల‌వాలంటూ ఆ ఉప ఎన్నిక‌లో బీఆరెస్ అభ్య‌ర్థిని పోటీకి దింపాడు.

దీంతో ఆనాడు విష్ణు వ‌ర్థ‌న్‌రెడ్డి గెలుపు లాంఛ‌న‌మే అయిన‌ప్ప‌టికీ పోటీ అని వార్య‌మైంది. ఆత‌రువాత తెలంగాణ‌లో ఏ కార‌ణం చేత ఉప ఎన్నిక వ‌చ్చినా పోటీ అని వార్యం అయింది. బీఆరెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా జ‌రిగిన అన్ని ఉప ఎన్నిక‌ల్లో పోటీ జ‌రిగింది. ఇలా బీఆరెస్ పార్టీ ఏక‌గ్రీవానికి స్వ‌స్థి ప‌ల‌క‌డంతో 2024, 2025ల‌లో బీఆరెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మ‌ర‌ణంతో జ‌రిగిన ఉపఎన్నిక‌ల్లో పోటీ జ‌రిగి త‌న స్థానాల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెపుతున్నారు. ఇదే ఏక‌గ్రీవ సాంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాల‌కు బీఆరెస్‌కు ఏక‌గ్రీవంగా వ‌దిలేవార‌ని చెపుతున్నారు. ఇందంతా బీఆరెస్ స్వ‌యంకృప‌రాద‌మ‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల‌లో జ‌రుగుతున్న‌ది.