Meenakshi Meets CM Revanth | సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షీ భేటీ
సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కలిసి నామినేటెడ్ పోస్టుల భర్తీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై చర్చించారు. ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లపై ధర్నా, రాష్ట్రపతి వినతి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Meenakshi Meets CM Revanth | విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై వారు చర్చించినట్లుగా సమాచారం. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలను వారు సీఎంకు అందచేశారని..ప్రతి నియోజకవర్గంలో రెండు పేర్ల చొప్పున ప్రతిపాదనలు అందించినట్లుగా పార్టీ వర్గాల కథనం. అలాగే పార్టీ గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీల నిర్మాణంపై కూడా వారు చర్చించినట్లుగా సమాచారం.
అలాగే బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఆగస్టులో ఢిల్లీలో నిర్వహించాల్సిన ధర్నాపై కూడా చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీలో ఆగస్టు 5,6,7తేదీల్లో ఢిల్లీలో 42శాతం బీసీ రిజర్వేషన్లపై ధర్నాలు చేయాలని.. ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మీనాక్షీ నటరాజన్ గురువారం నుంచి ఆగస్టు 4వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు ,5,6 తేదీల్లో ఢిల్లీలో ధర్నా నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు.