రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 30డీఈఓ పోస్టులు ఖాళీగా పెట్టి విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే కేవలం ముగ్గురే రెగ్యులర్ డీఈఓలు ఉన్నారనని, 30 చోట్ల పోస్టులు ఖాళీగా పెట్టడంతో విద్యావ్యవస్థ అధ్వాన్నంగా తయారైందన్నారు.
అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని, తక్షణమే ప్రభుత్వం రెగ్యులర్ డీఈఓలను నియమించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
రాజకీయ కక్షతో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్ధిని కుంటుపరిచారని హరీశ్ రావు విమర్శించారు. కావాలంటే పథకం పేరు మార్చుకోవాలి కానీ, బడుల అభివృద్ధిని ఆపొద్దు అని, కొత్తగా పాఠశాలల్లో ఒక్క గది కూడా కట్టే ప్రయత్నం చేయడం లేదు అన్నారు. పాఠశాలల్లో స్కావెంజర్ల బిల్లులు గత ఏడాదివి నాలుగు నెలలు, ఈ ఏడాదివి నాలుగు నెలలు పెండింగ్‌లో ఉండటంతో ఆ భారం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు, డీఏల సమస్యలతో పాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తోందన్నారు.
