రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే… అక్కడ బూతుల కంపునే: జగదీష్ రెడ్డి ఫైర్

నల్లగొండ సభ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభతో జిల్లాకు వచ్చింది ఏమీ లేదని, సీఎం ఎప్పుడొచ్చిన తిట్లు తప్పా మాకు మాకొచ్చిందేమి లేదు అనే భావన ప్రజల్లో ఉందని, కేసీఆర్ వస్తే నిధుల వరద ..రేవంత్ వస్తే బూతుల కంపు వస్తుందని జనం అనుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుండి
నల్గొండ జిల్లాకు చేసిందేమీ లేదని, ఇక్క కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందేనని స్పష్టం చేశారు. నిన్న నల్లగొండ లో సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ కుర్చీల ముందట వాంతి చేసుకుని పోయారని ఎద్దేవా చేశారు. మూసీ కంపును మించిన కంపు సీఎం నోటి నుంచి వస్తోందని, సబ్జెక్టు లేనోడు సంస్కారం లేనోడే వ్యక్తిగతంగా తిట్లు అందుకుంటాడని, రేవంత్ రెడ్డి స్థాయికి మేము దిగజారబోమని స్పష్టం చేశారు.

నిన్ను సొంత పార్టీ వారు తొక్కేస్తారు..

మూసీ ప్రక్షాళనకు అడ్డుపడే వారిని తొక్కుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనం అని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను తొక్కి…పైసలు పెట్టి పదవులు కొని, బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని..నీచమైన బూతు భాష మాట్లాడే సంస్కారహీనమైన రేవంత్ రెడ్డి నుంచి తొక్కుడు భాష, బూతులు తప్ప ఇంకేమి ఆశిస్తామని ఎద్దేవా చేశారు. తొక్కుడు ఆలోచన ఆనాడు కేసీఆర్ కు వస్తే ఈరోజు రేవంత్ అడ్రస్ వినిపించేది కాదన్నారు. 50 కోట్లిచ్చి పీసీసీ పదవి తెచ్చుకుని.. 50 వేల కోట్లు రేవంత్ లాగా సంపాదించుకోవచ్చని తెలిస్తే మేము పీసీసీ చీఫ్ పదవి తెచుకునేవాళ్లమని కొందరు పాత కాంగ్రెసోళ్లు వాపోతున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ ను చూసి భాదపడుతున్నారన్నారు. రేవంత్ ను తొక్కాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాల్సిన అవసరం లేదని, సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే నిన్ను తొక్కేందుకు టైం కోసం ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాలు పెట్టు..చర్చకు మేం సిద్దం

రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబిన్ కూడా కేసీఆర్ నే టార్గెట్ చేశారని, కాంగ్రెస్ బీజేపీని..బీజేపీ కాంగ్రెస్ ను ఏమీ అనదని, రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ కండ్లల్లోకి చూడడు ..ఆయనను విమర్శించలేడని, ఈ మధ్య కిషన్ రెడ్డిని ఏదో అన్నట్టు చేశాడని జగదీష్ రెడ్డి విమర్శించారు. ,కాంగ్రెస్ బీజేపీ లు కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నాయంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉందని అర్థం అవుతుందన్నారు. అసెంబ్లీ అంటేనే సీఎం రేవంత్ పారిపోయే రకం అని, ఎవరి హయాంలో ఎంత అభివృద్ది జరిగిందో చర్చకు అసెంబ్లీ సమావేశాల కోసం మేము లెటర్ రాయాల్సిన అవసరం ఎందుకని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. మేము నల్లగొండకు రమ్మని లెటర్ రాస్తేనే వచ్చావా ? అసెంబ్లీలో సీఎం మాట్లాడిన దాంట్లో మాకు సగం టైమ్ ఇచ్చినా చాలు అని, వీళ్ళ మొహాలకి కేసీఆర్ రావాల్సిన అవసరం లేదని, అసెంబ్లీ పెడితే కదా తెలిసేది ఎవరు వస్తారో ఎవరు రారోనని జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు పెడితే ఎవరేం చేశారో చర్చకు సిద్దం అన్నారు. రైతు భరోసాను ఎగవేశారని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నారని, రోజుకో స్కామ్ చేస్తూ..ఢిల్లీకి మూటలు మోసుడు..ప్రజలను మోసం చేసుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమి లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి లు పాల్గొన్నారు.

Latest News