కే.లక్ష్మణ్ : బిల్లు పెండింగ్ లో ఉండగానే ఆర్డీనెన్స్ ?

కోర్టును ఆశ్రయిస్తే నెగ్గగలరా
బీసీలను రాజకీయ అస్త్రాలుగా వాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తేనే ముఖ్యమంత్రి అవుతారా
బీజేపీ రాజ్యసభ సభ్యులు..పార్టీ ఓబీపీ జాతీయ మోర్చా అధ్యక్షులు: కే.లక్ష్మణ్
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసేందుకు క్యాబినెట్ లో ఆర్డినెన్స్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం బీసీలను వంచించేందుకు చేస్తున్న వ్యవహారమేనని బీజేపీ రాజ్యసభ సభ్యులు..పార్టీ ఓబీపీ జాతీయ మోర్చా అధ్యక్షులు కే.లక్ష్మణ్(K. Laxman) విమర్శించారు. రాష్ట్రపతి వద్ద ఉన్న బిల్ పెండింగ్ లో ఉందని..ఆ విషయం తేలక ముందే ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించారు. కేంద్రంపై నిందలు వేసేందుకు రేవంత్ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని..స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం మంత్రి వర్గం తీర్మానం చేయడం బీసీలను వంచించడమేనని ఆరోపించారు. షెడ్యూల్ 9లో పొందుపరుస్తేనే రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని…రాష్ట్రపతి వద్ద బిల్లును ఉపసంహరించకుండా ఆర్డినెన్సు ఎలా తెస్తారని…ఇపుడు ఆర్డినెన్సు ను గవర్నర్ ఆమోదిస్తారా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ చట్టబద్దతపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే నెగ్గగలరా అని ప్రశ్నించారు.
బీసీల పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు
బీసీల పేరుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు. గతంలో జంతర్ మంతర్ లో బీసీ బిల్లు కోసం సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేశారని..ఇప్పుడు ఆర్డినెన్స్ తెస్తున్నారని…స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నపటికీ.. కోర్టులో నిలబడేలా నిర్ణయాలు జరగాలని గుర్తుచేశారు. ఎస్సీ(SC), ఎస్టీల(ST), బీసీ(BC)లకు రిజర్వేషన్లు ఇచ్చినపుడు.. 50 శాతానికి మించ కూడదని కోర్టు చెప్పిన సంగతి మరువరాదన్నారు. స్థానిక సంస్థల్లో ఎంత ప్రాతినిధ్యం ఉందనే దానిపై 2012 లోనే సుప్రీం కోర్టు రిజర్వేషన్ల విషయంలో కొన్ని ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. రాహుల్ కు బీసీలపై కపట ప్రేమ ఉందన్నారు. బీసీలపై బీఆర్ఎస్(BRS) పార్టీది ద్వంద వైఖరి అని..కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండుకూడా వారిని వంచించే కుట్రలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, వైసీపీలు గతంలో బీసీలను మోసం చేశాయని..బీసీలను దగా చేసి.. ఓట్లు పొంది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని..కామారెడ్డి డిక్లరేషన్ ఆరు నెలల్లో అమలు చేస్తాం అని చెప్పిందన్నారు. అసెంబ్లీలో కానీ,ప్రజల ముందు కానీ కమిషన్ చేసిన సర్వేలను ఎందుకు బహిర్గతం చెయ్యలేదని..వివరణాత్మకంగా డెడికేషన్ కమిషన్ విచారణ జరపాలని. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు బహిర్గతం చెయ్యాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ ఊసే లేదని..తెలంగాణ రోల్ మోడల్ అంటే.. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమా అని లక్ష్మణ్ నిలదీశారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ..మహిళా అయినా బీజేపీతోనే సాధ్యం
రాష్ట్ర, జాతీయ పార్టీ అధ్యక్ష పదవులైనా…సీఎం, పీఎం, రాష్ట్రపతి పదవులైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు..మహిళలకు ఇవ్వడం బీజేపీ పార్టీతోనే సాధ్యమని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అనేక రాష్ట్రాల్లో బీసీలను బీజేపీ ముఖ్యమంత్రి చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీ మాత్రమే బీసీ ముఖ్యమంత్రి అని హామీ ఇచ్చిందన్నారు. బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తేనే ముఖ్యమంత్రి అవుతారా అని..బండారు దత్తాత్రేయ, బండి సంజయ్.. లక్ష్మణ్ లు ముగ్గురు బీసీలకు ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తు చేశారు. రోహిత్ వేముల కేసులో బీజేపీ అధ్యక్షుడు, అడ్వకేట్ రామచందర్ రావు పాత్ర లేదని కోర్టు స్పష్టం చేసిందని..ఈ విషయంలో డిప్యూటీ సీఎం భట్టి పసలేని వాదన చేస్తున్నారన్నారు. రాజాసింగ్ రాజీనామాను రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీకి పంపింది జాతీయ పార్టీ ఆమోదించిందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.