KTR | HCU వెనుక వేల ఎకరాల కుంభకోణం.. BJPఎంపీ ఉన్నాడు! త్వరలో అన్నీ బయటపెడతా

KTR | HCU వెనుక వేల ఎకరాల కుంభకోణం.. BJPఎంపీ ఉన్నాడు! త్వరలో అన్నీ బయటపెడతా

తెలంగాణలో నెగిటివ్ పాలసీలు.. నెగిటివ్ పాలిటిక్స్ : కేటీఆర్

KTR | HCU

విధాత: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగిటివ్ పాలసీలు.. నెగిటివ్ పాలిటిక్స్ కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందని..ఇప్పటికే జీఎస్టీ పెరుగుదల జీరో శాతంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మీద వచ్చే ఆదాయం తప్ప మిగిలిన అన్ని రంగాల్లో ఆదాయం పెంచడంలో విఫలమైందన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల లోపాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మా సిటీ రద్దు, హైడ్రా బీభత్సం, మూసీ విధ్వంసం వంటి నెగిటివ్ పరిపాలన విధానాల వలన తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఒక నెగెటివిటీ డెవలప్ అయిందని విమర్శించారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లనుందని…తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులు అయ్యే ఫార్మా, ఐటీ ఎగుమతులపైన అమెరికా విధించిన పన్నులు తీవ్రంగా నష్టం చేకూర్చబోతున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందన్నారు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు తో భారం

ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. ఇక్కడి కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచిందని కేటీఆర్ ఆరోపించారు. మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్ ధరల పెంపు వలన నిత్యావసర ధరలు రవాణా ఛార్జీలు భారీగా పెరుగుతాయని, సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుందని..బీజేపీ చెప్పిన అచ్చేదిన్ తీసుకురావడం ఇదేనా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మాత్రమే రేట్లు తగ్గించినట్లు ప్రకటనలు చేస్తారని..మోదీ ప్రభుత్వం ధరలను పెంచిన పేరు విచిత్రంగా ఉందని కేటీఆర్ దుయ్యబట్టారు. నిధులు కేంద్రీకృతం అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అందుకే పన్నులు కాకుండా సెస్సుల రూపంలో ధరలు పెంచుతుందన్నారు. రెండు రూపాయల పెట్రోల్, డీజిల్ సెస్, గ్యాస్ సిలిండర్ ధర పెంపు, రూ. 19 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ విలువ తగ్గడం ఇవన్నీ కలిపి ఒకటే రోజు మోదీ హ్యాట్రిక్ కొట్టారన్నారు. ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదని, ప్రధానమంత్రి గాని ఆర్థిక మంత్రి కానీ ఎవరు మాట్లాడటం లేదని విమర్శించారు. పార్లమెంట్లో చర్చ పెట్టమని డిమాండ్ చేసినా పెట్టడం లేదన్నారు. అమెరికా పన్నులు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వలన ప్రజల ఆర్థిక సంపద కరిగిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అమెరికా విధించిన పన్నులపైన కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విధానం లేదని ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వం వలన అనేక నష్టాలు జరుగుతున్నాయన్నారు.

ఢిల్లీ పార్టీలపైన కేటీఆర్ విమర్శలు

రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ బతుకు ఢిల్లీ చేతుల్లోనే ఉందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణను జాతీయ పార్టీలకు అప్పజెప్పితే ఢిల్లీలో రిమోట్ కంట్రోల్ ఉంటుందని ముందే చెప్పామన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేబినెట్ విస్తరణ కూడా చేసుకునే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎనిమిది ఎంపీలను అందిస్తే అదనంగా ఒక రూపాయి కూడా తెలియదన్నారు. రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీలో ఉందన్నారు. ఢిల్లీ నేతల చెప్పులు ఒకరు మోస్తారు.. ఇంకొకరూ ఢిల్లీకి బ్యాగులు మోస్తారని కేటీఆర్ విమర్శించారు.

త్వరలోనే భారీ భూకుంభకోణాన్ని బయటపెడతా.!

హెచ్ సీయూ 400 ఎకరాలు కాదు.. దాని వెనుక వేలఎకరాల వ్యవహారం ఉందని.. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ కూడా ఉన్నారని..ఈ కుంభకోణాన్ని త్వరలోనే బయటపెడుతామని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఉమ్మడి సీఎం రేవంత్‌రెడ్డి అని, రేవంత్‌ని కాపాడుతోంది బండి సంజయ్‌ అని కేటీఆర్ ఆరోపించారు. పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు.

ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాల సభ నిర్వహణకు వరంగల్ ఎల్కతుర్తిలో 1200 ఎకరాల్లో ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయన్నారు. తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తెలుగుదేశం, బీఆర్ఎస్ మాత్రమేనని..అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తామని తెలిపారు. మార్చి 28నాడే వరంగల్ సభ అనుమతి కోసం జిల్లా పోలీసులకు దరఖాస్తు పెట్టడం జరిగిందని, డీజీపీకి వ్యక్తిగతంగా విజ్ఞప్తి కూడా చేశామని తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3,000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశామని.. ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. 27వ తేదీ ఆదివారం కావడం, విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగవని.. ఎలాంటి ట్రాఫిక్ .. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని, రజతోత్సవ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అనుమతి ఇవ్వకపోవడానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి కారణం లేదని, అత్యంత శాంతియుతంగా పార్టీ నిర్వహించుకుంటున్న ఒక సంబరం మాత్రమే నన్నారు. సభా సన్నాహాలకు 33 జిల్లాల నాయకులు ప్రతినిధులతో కేసీఆర్ స్వయంగా నియోజకవర్గాల వారిగా సమీక్ష నిర్వహించారన్నారు. పార్టీ పరంగా సభా ఏర్పాట్లకు కమిటీలను వేసుకోవడం జరిగిందని, మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన వరంగల్ సభ మాదిరి భారీగా నిర్వహణ చేయబోతున్నామని తెలిపారు.

రజతోత్సవ సభ తర్వాత సంస్థాగత నిర్మాణం

వరంగల్ రజతోత్సవ బహిరంగ సభ తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ చేపడుతామని కేటీఆర్ తెలిపారు. పార్టీ సభ్యత్వం, విద్యార్థి విభాగాల సభ్యత్వ నమోదు చేస్తామని, సభ్యత నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందన్నారు. సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని, రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను.. ఇతర కమిటీలను వేసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయని, ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలల పాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఈ సంవత్సరం మొత్తం సంస్థాగత నిర్మాణంతో పాటు, ప్రభుత్వం వైఫల్యాలపైన, ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.