కాంగ్రెస్ వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి కప్పం కట్టుడు తప్ప రాష్ట్రానికి తెచ్చిన లాభం ఏం లేదని, వందసార్లు ఢిల్లీకి పోయాడు.. కానీ వంద పైసలు కూడా తేలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్లొని మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రం అన్ని పంటలను కొనాల్సిందే అని తీస్మార్ ఖాన్ లెక్క మాట్లాడాడని, ఇప్పుడు కేంద్రం ఎంత చెప్తే అంతే కొంటాం అంటూ బుడ్డర్ ఖాన్ మాటలు చెప్తుండని, కేంద్రంలోని మోదీ ఇచ్చిన కోటా ప్రకారమే కొంటానంటే మరి నువ్వేం చేస్తావ్? సీఎంగా నువ్వెందుకు ఉన్నావ్? అని కేటీఆర్ నిలదీశారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ 30ఏళ్లు విధ్వంసానికి గురైందని, జనం నోట ఇప్పుడు కేసీఆర్ రావాలి..కాంగ్రెస్ పోవాలి అన్న నినాదమే వినిపిస్తుందన్నారు.
చిట్టినాయుడు, ఆయన టీమ్ కు సినిమానే
తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి
వేధిస్తున్న వారిని వదిలిపెట్టబోమని, నేను కేసీఆర్ సారంతా మంచోన్నైతే కాదు అని, వచ్చే ఐదేళ్లు చిట్టినాయుడుకు ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత పక్కా నాది అని కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లు ఏదీ మర్చిపోం. మనల్ని ఇబ్బంది పెట్టినోడిని మర్చిపోం.. మనమీద కేసులు పెట్టినోడిని మరిచిపోం. మనతో నిలబడినోళ్లను కూడా మరిచిపోమని స్పష్టం చేశారు. రిటైరైనా పారిపోయినా సప్తసముద్రాల అవతల దాక్కున్నా.. ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో..అటువంటి ఒక్కొక్కడిని వెతికి తెచ్చి మీ ముందట నిలబెట్టే బాధ్యత నాది.. వదిలిపెట్టే సమస్యే లేదన్నారు. ఇది నేనేం ఊరికే చెప్పడం లేదు.. గుర్తు పెట్టుకోండి అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
