KTR Defamation Threat | కోర్టుకు లాగుతా.. డ్రగ్స్ కేసులో ఆధారాలుంటే బయటపెట్టాలి: రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
తనపైన ఏమైనా డ్రగ్స్ కేసు నమోదైందా? దాంతో తనకు సంబంధం ఉన్నట్లుగా ఆధారాలున్నాయా ? దమ్ముంటే బయటపెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. లేకుంటే సీఎం చేసింది చౌకబారు, చిల్లర వ్యాఖ్యలు అని ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

KTR Defamation Threat | ఢిల్లీలో మీడియా చిట్ చాట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా అసత్య ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. ”హైదరాబాద్‌లో నాతో ముఖాముఖి చర్చకు వచ్చే దమ్ములేక ఢిల్లిలో రేవంత్ రెడ్డి నాపై బురదజల్లుతున్నాడు. కేవలం చట్టం పరిధి నుంచి..న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే ముఖ్యమంత్రి చిట్‌చాట్‌ల పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారు. రేవంత్‌రెడ్డి.. ఇక నీ నిరాధార ఆరోపణలను సహించేది లేదు.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్ పేరుతో తనపైన, ఇతరులపైన విషయం చిమ్మడం ఇదే మొదటిసారి కాదన్నారు. కేవలం ముఖ్యమంత్రి కార్యాలయానికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు సంయమనం పాటించానన్నారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతున్నదని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆధారం ఏమిటో చెప్పాలన్నారు. నాపై ఏమైనా మాదక ద్రవ్యాల కేసు నమోదైందా? దాంతో నాకు సంబంధం ఉన్నట్లుగా ఆధారాలున్నాయా ? దమ్ముంటే బయటపెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. లేకుంటే సీఎం చేసింది చౌకబారు, చిల్లర వ్యాఖ్యలు అని ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ముందు నిలబడే ధైర్యం లేక దొంగ చాటుగా చిట్ చాట్ లతో వ్యక్తిత్వ హననం చేయడం రేవంత్ రెడ్డికి కొత్త కాదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.