కవిత కౌన్ కిస్కా హై..?: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

విధాత, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం అర్డినెన్స్ ప్రకటనను తన విజయంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) చెప్పుకోవడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ మేం చేసిన దానికి కవిత రంగులు పూసుకోవడం ఏంటి? కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారన్నారు. చోటా మోటా ధర్నాలు చేసి నా వల్లే అన్ని అయ్యాయని అనడం ఏమనుకోవాలని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లకు కవితకి సంబంధం లేదని..ఇందులో ఆమె ప్రమేయం ఏం లేదన్నారు. అసలు కవిత కౌన్ కిస్కా హై..?..కవిత లేదు, భవిత లేదు అని మండిపడ్డారు. కేసీఆర్ పదేళ్లు బీసీలకుఏం వెలగబెట్టారని..ఇప్పుడు కవిత బీసీ పాట పాడుతుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ గాంధీ ఎజెండా, రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్ అని స్పష్టం చేశారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ప్రకటనతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయం ఉందన్నారు. Rahul Gandhi ఆశయాన్ని నెరవేర్చిన అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ సభ్యుల కృషి అభినందనీయం అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందన్నారు.