అక్బరుద్దీన్ ఒవైసీ కూతురు పెళ్లి కోసమే రేవంత్ రెడ్డి లండన్ వెళ్ళాడని, సొంత డబ్బులతో పెళ్లికి వెళ్లకుండా ప్రజల సొమ్ముతో వెళ్లడం ఏమటని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి టూర్ పై రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ టూర్ కు క్లియరెన్స్ ఎందుకు రాలేదో మాకు తెలియదు అన్నారు.
క్లియరెన్స్ రాకుండా టికెట్ల ఎందుకు కొనుక్కున్నారని అర్వింద్ ప్రశ్నించారు. లండన్ లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ కూతురు పెళ్లీకి వెళ్లే తేదీలు కలిసేలా రేవంత్ తన టూర్ ను షెడ్యూల్ చేసుకుని..పైకి విదేశీ యూనివర్సిటీలను తెలంగాణకు తీసుకొచ్చేందుకు, తెలంగాణను ఎడ్యూకేషన్ హబ్ చేసేందుకు విదేశీ టూర్లకు వెళ్లున్నానంటూ కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ఎందుకని అర్వింద్ ప్రశ్నించారు.
దేశ వ్యతిరేక శక్తులను కలవడానికి లండన్‌లోని బ్లవట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌కు రేవంత్ రెడ్డి పోతున్నారని ఆరోపించారు. అనునిత్యం దేశంపై విషంకక్కే వారితో మీటింగ్‌లో పాల్గొంటున్నారని, సదరు స్కూల్‌కు దేశ వ్యతిరేక శక్తి అయిన జార్జ్ సోరోస్ ఫండింగ్ చేస్తున్నారని, యాంటీ నేషనల్స్ అయిన వీరికి 1 బిలియన్ డాలర్లు ఫండింగ్ చేసినట్లు స్వయంగా జార్జ్ సోరోస్ చెప్పుకొచ్చారని గుర్తు చేశారు. భారతదేశ వ్యతిరేక ప్రచారంలో ఈ స్కూల్ చాలా చురుకుగా ఉంటుందని, అలాంటి చోటుకు రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్తున్నారు? ఆయన ఉద్దేశం ఏమిటి? అని అర్వింద్ ప్రశ్నించారు. దేశ వ్యతిరేక శక్తులను కలిసేందుకు ప్రభుత్వ సొమ్ము వృథా ఎందుకని, ఎడ్యుకేషన్ కోసమే అంటూ డ్రామాలు ఎందుకని విమర్శించారు.
పదవీ గండంతోనే రేవంత్ వెనక్కి: రఘునందన్ రావు
ఆగస్టు సంక్షోభం భయం..30మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం సమాచారంతో తనకు పదవీ గండం ఏర్పడుతుందన్న ఆందోళనతో సీఎం రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటన నుంచి వెనక్కి వచ్చారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. పదవి కాపాడుకునేందుకు విదేశీ టూర్ నుంచి మధ్యలో వెనక్కి వచ్చారని, విదేశీ టూర్ కు కేంద్రం అనుమతి రాకపోతే మాపై ఎందుకు విమర్శలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
