మహిళా సాధికారతకు ఎంత దూరమైనా వెళ్తాం

ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మహిళలకు సాయం
మొదటి ఏడాదిలోనే 21600 కోట్ల వడ్డీ లేని రుణం
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్
సోలార్ విద్యుత్తు ప్రాజెక్టుల కేటాయింపుపై దృష్టి
లక్షేట్టిపేటలో సభలో డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
విధాత, హైదరాబాద్ : మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న మహిళలకు సహాయం చేస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్ పెట్టి మహిళలు వ్యాపారాలు చేసుకునే కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో (Lakshettipet) డిప్యూటీ సీఎం భట్టి పర్యటించి మంత్రులు దామోదర రాజనరసింహ(Damodar Raja Narasimha), జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో(Duddilla Sridhar Babu) కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం దండెపల్లి మండలం(Dandepalli Mandal) రెబ్బెనపల్లిలో(Rebbenapalli) ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్(Indira Mahila Shakti Solar Power Plant) నిర్మాణానికి భూమిపూజ చేశారు.
వేంపల్లి, పోచంపహాడ్ శివారులలోని 212 ఎకరాల్లో రూ.30కోట్ల వ్యయంతో చేపట్టిన అత్యాధుని సదుపాయాలతో ఇండస్ట్రియల్ పార్క్ పనులను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. మహిళా సాధికారత కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించినప్పుడు, ఇది సాధ్యామా అంటూ కొందరు అవహేళన చేశారన్నారు. కానీ, మొదటి ఏడాదిలోనే లక్ష్యానికి మించి రూ.21600 కోట్ల వడ్డీ లేని రుణం చెక్కులను మహిళా సంఘాలకు అందజేశామని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిపించేందుకు 600 ఆర్టీసీ బస్సుల ప్రాతిపాదించామని, అందులో 150 బస్సులు ఇచ్చామన్నారు. త్వరలో మిగతా బస్సులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్లు, పెరటి కోళ్ల పెంపకం పాల డైరీ, పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి భవనాల ఏర్పాటుకు ప్రోత్సహిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్ పెట్టి మహిళలు వ్యాపారాలు చేసుకునే కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల కేటాయింపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు భట్టి తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. అదిలాబాద్ జిల్లా(Adilabad District) అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును(Babasaheb Ambedkar Pranahita Chevella Project) చేపడుతామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు.