ఉమ్మడి నల్లగొండలో రెండు ఎంపీ సీట్లు హస్తగతమే.. నల్లగొండ, భువనగిరిలలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 2019లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఈ రెండు సిటింగ్ స్థానాలను గతంలో కంటే భారీ మెజార్టీతో నిలబట్టుకుంది.

విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, భువనగిరి లోక్ సభ స్థానాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 2019లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఈ రెండు సిటింగ్ స్థానాలను గతంలో కంటే భారీ మెజార్టీతో నిలబట్టుకుంది. అనూహ్యంగా ఈ రెండు స్థానాల్లోనూ బీఆరెస్ పార్టీ మూడో స్థానంకు పడిపోగా, బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. నల్లగొండ లోక్ సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి దేశంలోనే భారీ మెజార్టీతో గెలిచిన వారిలో ఒకరుగా నిలిచారు. రఘువీర్‌రెడ్డి 5లక్షల 59,906ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రఘువీర్‌రెడ్డికి 7,84,337ఓట్లు, బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి 2లక్షల 24వేల, 431ఓట్లు, బీఆరెస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి 2లక్షల 18వేల 417ఓట్లు పోలయ్యాయి.
భువనగిరి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి 2లక్షల 22వేల 249ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి 6లక్షల 23,762ఓట్లు, రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు 4లక్షల 1513ఓట్లు, బీఆరెస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ యాదవ్‌కు 2లక్షల 54వేల838 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 2023అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12అసెంబ్లీ స్థానాల్లో సూర్యాపేట మినహా మిగతా 11ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించడం విశేషం. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకుని మిగతా 11స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన బీఆరెస్ లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ కంటే వెనుకబడి మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల పుణ్యమా అని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ ముందెన్నడు సాధించని రీతిలో ఓట్లు సాధించడం విశేషం.