ఉత్కంఠ పోరులో అరుణ విజయం

ఉత్కంఠ పోరులో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గా డీకే అరుణ విజయం సాధించారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు నుంచి అరుణ స్వల్ప మెజారిటీ తో ముందంజ లో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు మెజారిటీ తగ్గడం పెరుగుతుండడంతో ఫలితం దోబూచులాడింది

ఉత్కంఠ పోరులో అరుణ విజయం

– విజయం ఎదుట కాంగ్రెస్ అభ్యర్థి వంశీ బోల్తా
– ఒక్క రౌండ్ లోనూ మెజారిటీ సాధించని కాంగ్రెస్ అభ్యర్థి
– చివరి వరకు దోబూచులాడిన విజయం
– చివరి రౌండ్లో తేలిన ఫలితం.. ఉద్యోగులు సైతం బీజేపీ వెంటే
– స్వల్ప మెజారిటీ తో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయాన్ని ప్రకటించిన అధికారులు
……………………………….
విధాత, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
…………………………………..
ఉత్కంఠ పోరులో మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గా డీకే అరుణ విజయం సాధించారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు నుంచి అరుణ స్వల్ప మెజారిటీ తో ముందంజ లో ఉన్నారు. రౌండ్ రౌండ్ కు మెజారిటీ తగ్గడం పెరుగుతుండడంతో ఫలితం దోబూచులాడింది.చివరి రౌండ్ వరకు స్వల్ప మెజారిటీ కనబరిచిన బీజేపీ 4350 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచందు రెడ్డి గట్టి పోటీ ఇచ్చినా చివరికి స్వల్ప తేడా తో ఓటమి చెందారు. మొత్తం 21 రౌండ్ వరకు కౌంటింగ్ జరిగింది.బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కు 506747 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి కి 503111ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి 154296 ఓట్ల తో సరిపెట్టుకున్నారు.వీటితో పాటు పోస్టల్ బ్యాలెట్ కూడా లెక్కించారు.ఈ ఓట్లలో కూడా బీజేపీ అధిక్యం కనబర్చింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 4350 ఓట్ల అధిక్యత తో బీజేపీ అభ్యర్థి గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.
………………………………..
ఏడుగురు ఎమ్మెల్యే లు ఉన్నా కాంగ్రెస్ కు తప్పని ఓటమి :
…………………………………..
కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యే లు… సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా… ఎనిమిది పర్యాయాలు సీఎం పర్యటన… వెరసి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట ను బీజేపీ బద్దలు కొట్టింది.కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సులువు అనుకున్న పార్టీ శ్రేణులు ఫలితం చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిది లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, కొడంగల్, షాద్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాలు ఉన్నా ఇక్కడ అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.ఇందులో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి గా బాధ్యతలు చేపట్టారు.ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కి బలం ఉండడం తో ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న వంశీచంద్ రెడ్డి గెలుపు సునాయాసంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఏ పార్లమెంట్ నియోజకవర్గం లో ఏ క్యాడర్ లేకున్నా బీజేపీ అభ్యర్థి గా డీకే అరుణ బరిలోకి రావడం నియోజకవర్గం పై పట్టు బిగించడం తో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కి వెళ్ళింది. ఇక్కడ బీజేపీ గెలిస్తే తన పరువు పోతుందనే ఉద్దెశం తో ఈ పార్లమెంట్ నియోజకవర్గం లో ఎనిమిది సార్లు ఎన్నికల ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చెందుతారని పలు సర్వే లు వెల్లడించడం తో సీఎం దృష్టి అంతా ఈ నియోజకవర్గం పైనే పెట్టారు.

ప్రచారం లో డీకే అరుణ ను టార్గెట్ చేసి మాట్లాడం.. మహిళ అని చూడకుండా విమర్శలు చేయడంతో సీఎం పై కొంత అసహనం పెరిగింది. మహిళ అని చూడకుండా పండపెట్టి తొక్కుతా అని డీకే అరుణ ను అనడం జిల్లా లో వివాదస్పదం అయింది. ఈ మాటనే అరుణ ప్రచారం లో బాగా వాడుకుంది. మహిళ పై సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా కొంత మైనస్ గా మారినట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతూ ప్రచారం లో దూసుకుపోయిన అరుణ కు నేడు విజయం వరించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారాయణ పేట, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్ లో బీజేపీ అధిక్యం ప్రదర్శించగా, జడ్చర్ల, షాద్ నగర్, కొడంగల్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఆశించిన మెజారిటీ రాకపోడడం కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఓటమికి కారణమైంది. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంచి మెజారిటీ రావడం తో అరుణ విజయానికి బాటలు పడ్డాయి. నారాయణ పేట నియోజకవర్గం ఆమె పుట్టిన గడ్డ కావడం… మక్తల్ ఆమె పెరిగిన ప్రాంతం కావడం.. గతంలో మక్తల్ ఎమ్మెల్యే గా ఆమె తండ్రి చిట్టెం నర్సి రెడ్డి చేసిన సేవలు ప్రస్తుత ఎన్నికల్లో అరుణ కు కలిసివచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ల మాటలు ప్రజలు నమ్మలేదని తెలుస్తోంది. ఏడుగురు ఎమ్మెల్యే లు ఉన్నా తమ పార్టీ అభ్యర్థి ని గెలిపించుకోలేక పోయారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సక్రమంగా క్యాడర్ లేని బీజేపీ గెలుపొందడం తో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశ్చర్యనికి గురవుతున్నారు. క్యాడర్ లేకున్నా మోడీ చరిష్మా తో ప్రచారం లో ఒంటరిగా పోరు చేసి నేడు పార్లమెంట్ సభ్యురాలిగా డీకే అరుణ ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. ఒకవైపు బీ ఆర్ ఎస్ గట్టి పోటీ ఇవ్వక పోవడం కూడా బీజేపీ కి కలిసి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో బీ ఆర్ ఎస్ క్యాడర్ చివరి నిమిషం లో బీజేపీ వైపు మళ్ళిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఏదియేమైనా ఉత్కంఠ రేపిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చివరకు బీజేపీ కి విజయం దక్కింది.