వైఎస్ షర్మిల: ఏపీ లిక్కర్ స్కామ్ పై జగన్ సమాధానం చెప్పాలి

అమరావతి : ఏపీ లిక్కర్ స్కామ్ పై అప్పటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై సమాధానం చెప్పాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల డిమాండ్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. డిజిటల్ పద్దతిలో కాకుండా ఓన్లీ క్యాష్ పద్దతిలో మద్యం ఎందుకు అమ్మారు? అన్నదానిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేవలం రూ.3500 కోట్లకే పరిమితం కాదన్నారు. ఓన్లీ క్యాష్ పద్ధతిలో మద్యం అమ్మకాలు చేసింది అనధికార అమ్మకాల కోసమేనని షర్మిల ఆరోపించారు. కేవలం బ్లాక్ మనీ కోసమే..పన్నులు ఎగ్గొట్టాలనే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని ఆమె ఆరోపించారు. మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని విమర్శించారు. డిస్టలరీల వద్ద కమీషన్‌లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్‌కి నెలకు రూ. 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు జరిగితేనే వాళ్లకు ముడుపులు వస్తాయని అందుకే క్యాష్ పద్దతిలో అమ్మకాలు చేశారన్నారు. అసలు నాన్ డ్యూడీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారన్నది కూడా సిట్ తేల్చాలని కోరారు. అనధికార మద్యం అమ్మి వేల కోట్లు దోచేశారని.. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ స్కాం మీద శ్వేతపత్రం ఇచ్చారని..లక్ష కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే డిజిటల్ పేమెంట్స్ కేవలం 600 కోట్లు వచ్చాయన్నారని.. 99 వేల కోట్లు ఎక్కడ పోయాయో తెలియదు అన్నారని గుర్తు చేశారు. ఒక్క శాతం కూడా లిక్కర్ సొమ్ము ప్రభుత్వానికి రాలేదు అన్నారని.. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో చేసిన ఆరోపణలో విచారణ జరపాల్సి ఉందని.. లక్ష కోట్ల లిక్కర్ స్కామ్ పై నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బ్రాండ్ లిక్కర్లను నిలిపి చేసి.. చీప్ లిక్కర్ తయారీని ఎందుకు ప్రోత్సహించారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు. ఇదంతా కుట్రలో భాగంగా జరిగిందన్నారు. గత ఐదేళ్లలో ముప్పై లక్షల మందికి కిడ్నీ సమస్యలు వచ్చాయని.. మరో ముప్పై వేల మందికి పైగా చీప్ లిక్కర్ కారణంగా చనిపోయారని చెప్పారు. కోట్లాది మంది ప్రజలు ఏదో ఒక రూపంలో అనారోగ్యం బారిన పడ్డారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని సిట్‌తోపాటు సీఎం చంద్రబాబుకు ఆమె సూచించారు. ఈ మద్యం వ్యవహారంలో తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే వైఎస్ జగన్ తరచూ చెబుతున్నారని షర్మిల తప్పుబట్టారు. రిషి కొండను ఎందుకు తవ్వారో కూడా ఇంత వరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో సాక్షి హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అని వైఎస్ షర్మిల తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరికీ బి టీమ్ కాదన్నారు. ప్రధాని మోదీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా దత్త పుత్రుడుగానే ఉన్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి వైఎస్ జగన్ ఊడిగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అనేక ప్రాజెక్టులను అదానీకి వైఎస్ జగన్ అడ్డగోలుగా కట్టెబెట్టారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో బాబు, జగన్ ,పవన్ ముగ్గురు బీజేపీకి తొత్తులు అని షర్మిల అని షర్మిల ఆరోపించారు.