Aliens Exist | గ్రహాంతరవాసుల జాడ తెలిసేది ‘ఆ సంవత్సరం’లోనే .. బ్రిటన్ శాస్త్రవేత్త ధీమా
2075 నాటికల్లా గ్రహాంతరవాసుల ఉనికిపై స్పష్టమైన ఆధారాలు లభిస్తాయని బ్రిటిష్ శాస్త్రవేత్త డేమ్ మ్యాగీ చెబుతున్నారు. అదే జరిగితే.. మనిషి తన స్థానం గురించి తిరిగి ఆలోచన చేయాల్సిన చరిత్రాత్మక క్షణం అవుతుంది.
- 2075 నాటికి ఏలియెన్స్ ఉనికిపై ఆధారాలు
- నమ్మకంగా చెబుతున్న బ్రిటిష్ శాస్త్రవేత్త డేమ్ మ్యాగీ
- K2–18b గ్రహ వాతావరణంలో జీవం ఉన్నప్పుడు ఏర్పడే కొన్ని అణువుల గుర్తింపుతో కొత్త చర్చ
Aliens Exist | మనం ఒంటరివాళ్లమా? మనలాంటి జీవులు వేరే గ్రహాల్లో ఉన్నాయా? ఇది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు కనుగొనేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ఇంకా ఆ ఆన్వేషణ కొనసాగుతూనే ఉన్నది. మరికొద్ది రోజుల్లో ముగియనున్న 2025 సంవత్సరం మొత్తం యూఎఫ్‌వోలు, యూఏపీలు, ఏలియన్స్.. వీటి చుట్టూ తిరిగినట్టు కనిపిస్తున్నది. నిజంగానే భూమికి వెలుపల జీవం ఉందా? ఉంటే అది ఎప్పుడైనా మనల్ని సమీపిస్తుందా? లేక మనం వారి చెంతకు చేరే అవకాశం వస్తుందా? ఇవే ప్రశ్నలు! సమాధానాలు మాత్రం కచ్చితంగా దొరకడం లేదు. అయితే.. ఈ చర్చలకు మరింత ఊపునిచ్చింది.. 3I/ATLAS అనే మూడో ఇంటర్‌స్టెల్లర్ ఆబ్జెక్ట్. దాని ప్రయాణ మార్గం అసాధారణంగా, కచ్చితత్వంతో ఉండటంతో కొంతమంది శాస్త్రవేత్తలు ఇది సహజమైన ఆబ్జెక్ట్ కాకపోవచ్చున్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇంతలోనే బ్రిటన్‌కు చెందిన ఒక ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఈ చర్చను కొత్తమలుపు తిప్పారు. ‘ఏలియన్స్ ఉన్నారని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ఘంటాపథంగా చెబుతున్నారు లండన్ యూనివర్సిటీ కాలేజ్ (UCL)లో భౌతిక శాస్త్రం–ఖగోళ శాస్త్ర విభాగానికి చెందిన డేమీ మ్యాగీ అడెరిన్ –పోకాక్. వేరొక గ్రహంపై జీవాన్ని 2075 నాటికి మనుషులు కనుగొంటారని ఆమె ప్రకటించారు. అంటే ఈ విశ్వాంతరాళలో మనం ఒంటరివాళ్లం కానట్టయితే.. ఆ విషయం మరో 50 ఏళ్లలో రుజువు అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.
ఈ భూమి ఒక్కటే ప్రత్యేకమైనదా?
ఈ అనంత విశ్వంలో సుమారు 200 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయని శస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సౌర వ్యవస్థ అలాంటి ఒకానొక పాలపుంతలోనిదే. ఇంతటి విశ్వంలో జీవానికి అవసరమైన పరిస్థితులు, వాతావరణం కేవలం భూమిలోనే ఉండటం అసాధ్యమని, వేరే పాలపుంతల్లో సైతం జీవం ఉండేందుకు అవకాశం ఉందని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. ‘ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు జీవం ఇక్కడ మాత్రమే ఏర్పడిందని ఎలా అనుకోగలం?’ అని ఆమె ప్రశ్నించారు.
మనకన్నా ముందే ఈ విశ్వంలో జీవం ఉండి ఉంటే?
ఏలియన్స్ కనిపిస్తే వాళ్లు మనకంటే సాంకేతికంగా చాలా ముందు భాగాన ఉంటారనే విషయంలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డేమ్ మ్యాగీ అభిప్రాయం కూడా ఇదే. వాళ్లు మనకంటే వయసులో పెద్దవాళ్లయి ఉండవచ్చునని, శాస్త్ర, సాంకేతికత పరిజ్ఞానాల విషయంలోనూ మనకంటే ముందు ఉండి ఉంటారని అంటున్నారు. అంటే.. మనం ఇప్పుడిప్పుడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంగా చెప్పుకొంటున్నవి వాళ్లు వేల ఏళ్ల క్రితం దాటేసి ఉంటారని ఊహ. ఈ వాదనకు బలం చేకూర్చేందుకు డ్రేక్ ఈక్వేషన్‌ను డేమ్ మ్యాగీ ప్రస్తావించారు. అనంత విశ్వంలో అపారమైన నక్షత్రాలు, అసంఖ్యా గ్రహాలు ఉన్న రీత్యా.. మనం ఒంటరివాళ్లం కాదనేది డ్రేక్ ఈక్వేషన్.
మన పాలపుంతలోనే 300 కోట్లకు పైగా నక్షత్రాలు ఉన్నాయని అంచనా. వాటిలో చాలా వరకూ మన సూర్యుడిలాంటివే. కొన్ని సూర్యుడికంటే అతి భారీ నక్షత్రాలు సైతం ఉన్నాయి.
ఎక్స్‌ప్లానెట్స్
మన సౌర వ్యవస్థకు బయటి నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను ఎక్స్‌ప్లానెట్స్ అంటారు. ఇటువంటి ఎక్స్‌ప్లానెట్స్‌ను మన శాస్త్రవేత్తలు వేల సంఖ్యలో ఇప్పటికే గుర్తించారు. నాసా ఒక్కటే సుమారు 6వేల ఎక్స్‌ప్లానెట్స్‌ను అధికారికంగా నిర్ధారించింది.
2025 పతాక శీర్షికల్లో K2–18b
ఈ ఏడాది పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన గ్రహాల్లో K2–18b ఒకటి. భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం జీవానికి అత్యంత అనుకూలమైనదిగా భావించే ప్రాంతంలో ఉండటమే ఈ చర్చకు కారణం. K2–18b గ్రహ వాతావరణంలో జీవం ఉన్నప్పుడు ఏర్పడే కొన్ని అణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ సముద్రాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, ఏదో ఒక రూపంలో జీవం ఉండి ఉండేందుకు ఆస్కారం ఉన్నదని నమ్ముతున్నారు.
వాళ్లు ఉన్నారు.. కానీ ఎప్పుడు కలుస్తారన్నదే సమస్య!
గ్రహాంతరవాసుల ఉన్నారా? లేదా అన్న ప్రశ్నకు డేమ్ మ్యాగీ చాలా స్పష్టంగా సమాధానం చెబుతున్నారు. ‘ఏలియన్స్ ఉన్నారు. కానీ.. వాళ్లను కనుగొనడమే మన ముందు ఇప్పుడు ఉన్న కీలక సవాలు’ అని ఆమె నొక్కి చెబుతున్నారు. ఆమె అంచనా ప్రకారం.. రాబోయే 50 ఏళ్లలోపే భూమికి వెలుపలి గ్రహాలపై జీవ ఉనికికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. అదే జరిగితే.. అది కేవలం శాస్త్రీయ విజయం మాత్రమే కాదు.. మనిషి తన స్థానం గురించి తిరిగి ఆలోచన చేయాల్సిన చరిత్రాత్మక క్షణం అవుతుంది. అప్పటిదాకా ఈ అన్వేషణలు, విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
Alien Documentary| ఏలియన్స్ ఉన్నారా?..న్యూయార్క్ పోస్ట్ వైరల్ !
Alien Spacecraft Attack | దాడి చేసేందుకు వస్తున్న గ్రహాంతర వాసులు..? నవంబర్‌లో యుద్ధమేనా!
Alien Mummies | ఆ మమ్మీలు.. గ్రహాంతర వాసులవేనా?.. మెక్సికన్ వైద్యుల పరీక్షల్లో విస్మయం గొల్పే వాస్తవాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram