Comet 3I/ATLAS | ఆ తోకచుక్క భూమి వైపే దూసుకొస్తోందన్న ప్రచారంలో నిజమెంత?
3I/ATLAS అనే తోకచుక్క భూమివైపే వస్తోందన్న ప్రచారం అని NASA, ESA స్పష్టం చేసాయి. ఆ ధూమకేతువు భూమికి ‘అత్యంత’ సమీపంగా వచ్చే దూరం 27 కోట్ల కి.మీ. కాబట్టి, 3ఐతో భూమికి గానీ, మన ఇతర గ్రహాలకు కానీ ఎటువంటి ప్రమాదం వాటిల్లదని అంతరిక్ష సంస్థలు హామీ ఇచ్చాయి.

NASA, ESA Confirm: Interstellar Comet 3I/ATLAS Poses No Threat to Earth
- అది సౌరకుటుంబం ఆవలి తోకచుక్క మాత్రమే.
- ఒక్క భూమి మాత్రమే కాదు, ఏ గ్రహానికీ ప్రమాదకరం కాదు
- గ్రహాంతర వాసుల నౌక అనేది కేవలం ఊహాగానాలు
- సోషల్ మీడియాలో ప్రచారాలు నమ్మొద్దు
- ప్రతీక్షణం పరిశీలిస్తున్నాం : నాసా, ఈఎస్‌ఏ స్పష్టీకరణ
విధాత సైన్స్ డెస్క్, అక్టోబర్ 4, 2025:
సోషల్ మీడియాల్లో ఒక్కసారిగా వ్యాప్తి చెందిన రూమర్లు… భారీ తోకచుక్క భూమి వైపు వేగంగా దూసుకొస్తోందని, అది మన భూగోళానికి పెద్ద ప్రమాదమని చాలామంది చెబుతున్నారు. కొందరు దాన్ని గ్రహాంతరవాసుల నౌక అని, భూమిపై దాడి చేసే ఉద్దేశంతో వచ్చిందని కూడా ఊహిస్తున్నారు. కానీ,ఈ తోకచుక్కతో భూమికి ఎటువంటి ప్రమాదం లేదు. ఇది మన సౌరకుటుంబం ఆవతల నుండి వస్తున్న అత్యంత సహజమైన ‘వస్తువు’ మాత్రమేనని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా(NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) స్పష్టంగా చెబుతున్నాయి. ఆల్‌జజీరా ఫాక్ట్-చెకింగ్ ఏజెన్సీ సనద్ ఈ విషయాన్ని వివరంగా పరిశోధించి, నిజాలు వెల్లడించింది. మనం కూడా ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందాం.
3I/ATLAS గురించి ఈ పుకార్లు ఎలా మొదలయ్యాయి? ‘ఎక్స్’లో గందరగోళం
ఈ గందరగోళం అక్టోబర్ 1 నుంచి ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాల్లో భారీగా వ్యాప్తి చెందుతోంది. కారణం, సెప్టెంబర్ 29న న్యూయార్క్ పోస్ట్ పత్రికలో వచ్చిన ఒక వ్యాసం. ఆ వ్యాసం శీర్షిక – “భారీ తోకచుక్క మనమీదకు వచ్చేస్తోంది, దాని పరిమాణం ఇంతకుముందు అంచనాల కంటే చాలా ఎక్కువ, ఇది గ్రహాంతర సాంకేతికత కావచ్చు, ఇది మన జీవితాలను సమూలంగా మార్చబోతోంది” అని. ఇదే ఆ పోస్ట్:
‘Massive’ comet hurtling toward us is larger than previously thought, could be alien tech, scientist says: ‘It could change everything for us’ https://t.co/oMA2ZSjpvo pic.twitter.com/82PiccCgas
— New York Post (@nypost) September 29, 2025
ఈ కథనంలో హార్వర్డ్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఆవీ లోబ్ వ్యాఖ్యలుగా చెబుతున్న మాటలున్నాయి. ఆయన తోకచుక్క పరిమాణం 33 బిలియన్ టన్నులు ఉండవచ్చని, సాధారణ తోకచుక్కలలా దానికి తోక లేకపోవడం వంటి విషయాలు ఊహాగానాలుగా చెప్పాడు.
దీంతో ఎక్స్‌లో ఈ కథనం స్క్రీన్‌షాట్‌లు షేర్ అవుతూ, వాటిని మరింత భయంకరంగా మార్చేశారు. ఒక ఖాతా ‘స్టీవెన్ గ్రీన్‌స్ట్రీట్’ పేరుతో – “భారీ గ్రహాంతర నౌక భూమి వైపు వస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకు ఎవరూ మాట్లాడటం లేదు?” అని పోస్ట్ చేసింది. దానికి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరొక ‘డాక్టర్ డిస్‌క్లోజర్’ అనే ఖాతా, “అసలు అమెరికా సైనిక జనరల్స్ ఎందుకు సమావేశమైనారు?” అంటూ పోస్ట్ చేసింది. దీన్ని సెప్టెంబర్ 30న అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ నాయకత్వాన జరిగిన మిలిటరీ మీటింగ్‌కు లింక్ చేసి, తోకచుక్కతో కలిపి చూపించారు.
చాలామంది “ఈ తోకచుక్క తప్పకుండా భూమిని తాకుతుంది, మనం మనల్ని ఎలా రక్షించుకోవాలి?” అంటూ చర్చలు మొదలుపెట్టారు. ఒకరు “మెస్సయా క్రూ, ఫ్రీడమ్ టీమ్, ఇండిపెండెన్స్ టీమ్” అనే ఊహాత్మక మిషన్‌ల గురించి చెప్పారు.. అంటే, ఆర్మగెడ్డాన్, డీప్ ఇంపాక్ట్ లాంటి సినిమాల ప్రభావమన్నమాట. ఇది 1.3 లక్ష మైళ్లు/గంటకు వేగంతో వస్తోందని, అమెరికా సైన్యం దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందని కూడా రూమర్లు వ్యాపించాయి. ఇలాంటి పోస్ట్‌లు లక్షలాది వ్యూస్ పొంది, ప్రజల్లో భయాన్ని మరింత పెంచాయి.
గ్రహాంతరవాసుల నౌకా? లేదా మామూలు తోకచుక్కా?
కొందరు ఈ తోకచుక్కను గ్రహాంతరవాసుల నౌక అనీ, మనపై దాడి చేయడానికే వస్తోందని చెబుతున్నారు. @MyLordBebo అనే ఖాతా ఒక నకిలీ వీడియోతో “ఇది భూమివైపు వస్తోన్న ఏలియన్ ప్రోబ్ కావచ్చు” అని అమెరికన్ శాస్త్రవేత్త మిచియో కాకుకి తప్పుడు వ్యాఖ్యలు ఆపాదించింది.
దానికి 2.9 లక్షల వ్యూస్ వచ్చాయి. కానీ, సానడ్ పరిశోధన ప్రకారం, ఇది అబద్దం. ఆ చిత్రం ఫిబ్రవరి 2025లో కాకు ఇంటర్వ్యూది. అప్పటికి ఇంకా ఈ తోకచుక్క కనుగొనబడలేదు.
‘ఆస్ట్రానమీ వైబ్స్’ అనే మరొక ఖాతా, “చాలా మంది శాస్త్రవేత్తలు ఇది వింత తోకచుక్క అని అంటున్నారు, కానీ కొందరు ఇది మరో నాగరికత నుంచి వచ్చిన ఇంజనీర్డ్ ప్రోబ్ కావచ్చని చెబుతున్నారు” అని ఊహించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వందలాది పోస్ట్‌లు చాలా వైరల్ అయ్యాయి.
అసలు నిజాలు ఏమిటి? – నాసా-ఈఎస్‌ఏలు ఏం చెబుతున్నాయంటే.?
సనద్ పరిశోధన ప్రకారం, ఈ తోకచుక్క (కామెట్ 3I/ATLAS, లేదా C/2025 N1) జూలై 1, 2025న నాసా ATLAS టెలిస్కోప్‌తో గుర్తించబడింది. ఇది 1I/ఓమువామువా’ (2017), 2I/బోరిసావ్ (2019) తర్వాత మన సౌర వ్యవస్థ లోపలికి వచ్చిన మూడో అంతరిక్ష వస్తువు. ( ఈ నామకరణం ఎలా ఉంటుందంటే, ముందుగా ఉన్న అంకె 1,2,3.. అదేది క్రమసంఖ్యను సూచిస్తుంది. ఐ అంటే ఇంటర్స్టెల్లార్ – సౌరవ్యవస్థ ఆవలిది అని, / తరువాత ఉన్నది కనుగొన్నవారి పేరు లేదా టెలిస్కోప్ పేరు) ఇది అంతరిక్షం నుండి వస్తోంది కాబట్టి, వేగం గంటకు 2 లక్షల 10వేల కిలోమీటర్లు(గంటకు 1.3 లక్ష మైళ్లు)గా ఉంది. ఇదే మన సౌర వ్యవస్థలో అత్యంత వేగవంతమైన వస్తువు.
పరిమాణం: హబుల్ టెలిస్కోప్ అంచనా ప్రకారం, దాని పరిమాణం 440 మీటర్ల (1,444 అడుగులు) నుండి 5.6 కిలోమీటర్ల(3.5 మైళ్లు) వరకు ఉండవచ్చు. చుట్టూ ధూళి, గ్యాస్‌తో “దీర్ఘ గోళాకారంలో” కనిపిస్తుంది.
దూరం: మొదటగా భూమికి దగ్గరగా వచ్చింది జూలై 21, 2025న – 24 కోట్ల కి.మీ దూరం. ఇది భూమి-సూర్యుడి మధ్య దూరం కంటే 1.5 రెట్లు ఎక్కువ. యూరోపియన స్పేస్ ఏజెన్సీ చెబుతున్నా దాని ప్రకారం, ఇది భూమి లేదా ఏ గ్రహానికీ ప్రమాదకరం కాదు – అక్టోబర్ 30న సూర్యునికి దగ్గరగా 21 కోట్ల కిలోమీటర్ల దూరం నుండి అంగారకుడి కక్ష్య గుండా(దగ్గరగా అంటే దాదాపు 3 కోట్ల కి.మీ దూరం) వెళుతుంది.
అరుదైన అవకాశం: ఇది అంతరిక్ష వస్తువులను అధ్యయనం చేయడానికి అరుదైన అవకాశమనీ, సూర్యుడికి చేరువయ్యే క్షణం నుండి ఈఎస్‌ఏ కు చెందిన మార్స్, జూపిటర్ ప్రోబ్‌లు మార్స్ ఎక్సప్రెస్, ఎక్సోమార్స్ ఆర్బిటర్ దీన్ని అక్టోబర్ 1నుండి 7వ తేదీ వరకు నిశితంగా పరిశీలిస్తాయని నాసా స్పష్టం చేసింది.
ఇది గ్రహాంతరవాసుల నౌకనే ఊహలకు ఎటువంటి ఆధారాలు లేవు. ఆవీ లోబ్ మాటలు కేవలం ఊహాగానాలు మాత్రమే. – నాసా దీన్ని సహజ తోకచుక్కగానే వర్గీకరించింది.
ఎందుకు ఇలాంటి పుకార్లు వ్యాపిస్తాయి?
సాధారణంగా సోషల్ మీడియాలో నకిలీ, భయపెట్టే కంటెంట్ వేగంగా వ్యాపిస్తుంది. నిజమైన వార్తలను తప్పుగా వివరిస్తూ, పాత చిత్రాలు, ఊహాగానాలు కలిపి పోస్ట్ చేస్తారు. న్యూయార్క్ పోస్ట్ వంటి మీడియా కూడా మన సౌర వ్యవస్థ వైపు వస్తోందని చెప్పి గందరగోళాన్ని పెంచాయి, కానీ సురక్షిత దూరాన్ని స్పష్టంగా చెప్పలేదు.
ఈ తోకచుక్క మనకు ఎంతమాత్రమూ ప్రమాదకరం కాకపోగా, శాస్త్రవేత్తలకు అంతరిక్ష రసాయనాలు, డైనమిక్స్ అధ్యయనం చేయడానికి గొప్ప అవకాశం. సెప్టెంబర్ చివరి వరకు టెలిస్కోప్‌లతో చూడవచ్చు. ఇలాంటి వైరల్ రూమర్లకు దూరంగా ఉండి, నాసా, ఈఎస్‌ఏ వంటి సంస్థల అధికారిక సైట్‌లను చూడండి. అంతరిక్షం ఇంకా చాలా అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉన్నది వాస్తవమే అయినా, ఇది మాత్రం వాటిలో ప్రమాదకరమైనదేం కాదు!
(అల్‌జజీరా సనద్ ఫాక్ట్-చెక్, NASA, ESAల అధికారిక సమాచారం ఆధారంగా.)