Under-19 World Cup | 2026 వరల్డ్‌కప్‌ షెడ్యూల్ విడుదల.. భారత్‌‌ ఏ టీమ్‌లో ఉందంటే?

పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ టోర్నిని జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి

  • By: chinna |    sports |    Published on : Nov 19, 2025 9:22 PM IST
Under-19 World Cup | 2026 వరల్డ్‌కప్‌ షెడ్యూల్ విడుదల.. భారత్‌‌ ఏ టీమ్‌లో ఉందంటే?

పురుషుల అండర్-19 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఈ టోర్నిని జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఐసీసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ టోర్నిలో భారత్–పాకిస్థాన్ వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. దీంతో భారత్, పాకిస్థాన్ జట్లు వేర్వేరు గ్రూప్‌ల్లో ఉండటం వల్ల గ్రూప్‌ లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం లేదు. భారత్ తన తొలి మ్యాచ్‌‌లో అమెరికా(యూఎస్ఏ) తో తలపడనున్నది.

మొత్తం 16 జట్లు 2026 మెగా ఈవెంట్‌లో పాల్గొననుండగా వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. 23 రోజుల్లో 41 మ్యాచ్‌లు జరగనున్నట్లు ఐసీసీ షెడ్యూల్ లో పేర్కొంది. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, న్యూజిలాండ్.. గ్రూప్ బీలో జింబాబ్వే, పాకిస్థాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్. గ్రూప్ సీ లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక లు ఉండగా గ్రూప్ డీ లో టాంజానియా, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా దేశాలు ఉన్నాయి. ఈసారి టాంజానియా తొలిసారి అండర్-19 వరల్డ్‌కప్‌ ఆడుతోంది. దీంతో పాటు జపాన్ 2020 తర్వాత మళ్లీ అండర్-19 వేదికపైకి అడుగుపెట్టబోతోంది.

భారత్ ఆడే మ్యాచులు అన్నీ బులవాయోలో జరగనున్నాయి. భారత్.. జనవరి 15 యూఎస్ఏ తో, జనవరి 17న బంగ్లాదేశ్, జనవరి 24న న్యూజిలాండ్ తో తలపడనున్ని. కాగా, రౌండ్ రాబిన్ సిస్టమ్‌లో గ్రూప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్-6 దశకు అర్హత సాధిస్తాయి. రెండు సూపర్-6 గ్రూప్‌లలో టాప్-2గా నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుతాయి. అనంతరం గెలిచిన దేశాలు ఫైనల్‌లో పోటీపడుతాయి. కాగా, భారత్ ఇప్పటి వరకు అత్యధికంగా ఐదు టైటిళ్లు (2000, 2008, 2012, 2018, 2022) గెలుపొందింది. కాగా, 2024 ఫైనల్ లో భారత్ ను ఓడించిన ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనున్నది.