ఉపాధి కూలీ.. ఆసియ పతాక విజేత

- 35 కిలోమీటర్ల రేస్ వాక్‌లో కాంస్య పతకం
- సాధించిన యూపీ యువకుడు రామ్‌బాబు
- విజయం వెనుక కఠోర శ్రమ, త్యాగాలు
- హోటల్‌లో వెయిటర్‌గా, కొరియర్‌లో ప్యాకర్‌గా పని
- యువతకు స్ఫూర్తిగా నిలిచిన జీవితం
- రామ్‌బాబు స్టోరీని సోషల్‌మీడియాలో
- పోస్టు చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
విధాత: పట్టుదల, ధ్రుడ సంకల్పం ఉంటే పేద యువకుడైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. జీవితంలో అద్భుతమైన విషయాలను సాధించగలడు. జాతీయ రికార్డును బద్దలు కొట్టగలడు. అందుకు నిదర్శనమే ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత రామ్‌బాబు జీవితం. రామ్‌బాబు 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్‌డ్ టీమ్‌లో భారతదేశానికి కాంస్య పతకం అందించారు. జాతీయ రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి వ్యక్తిలో స్ఫూర్తి నింపాడు.
మోదీ సహా దేశం ప్రశంసలు
ఇదంతా అతడికి ఒక్కరోజులో సాధ్యపడలేదు. విజయం వెనుక కఠోర శ్రమ, నిద్రలేని రాత్రులు, డబ్బులు లేని ధైన్య పరిస్థితులు ఉన్నాయి. రామ్‌బాబు డౌన్ టు ఎర్త్ విజయగాథను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
“ఒకప్పుడు ఉపాధి హామీ కూలీగా, వెయిటర్‌గా పనిచేసిన రామ్ బాబు. ఈ రోజు, ఆసియా గేమ్స్ 35 కిలోమీటర్ల రేస్ వాక్ మిక్స్‌డ్ టీమ్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఇతడి సంకల్పం, పట్టుదల గురించి మాట్లాడండి” అని కస్వాన్ ట్వీట్‌లో రాశారు. రామ్‌బాబు కూలీగా పనిచేస్తున్న వీడియోను కూడా ట్విట్టర్‌లో పెట్టారు. ఇది వైరల్‌గా మారింది. రామ్‌బాబును ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశం మొత్తం ప్రశంసలతో ముంచెత్తుతున్నది.
అసలు ఎవరీ రామ్‌బాబు..
24 ఏళ్ల రామ్‌బాబుది ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని మారుమూల బావర్ గ్రామం. 2012 లండన్ ఒలింపిక్స్‌లో దేశం రెండు రజతాలు, నాలుగు కాంస్య పతకాలను కైవసం చేసుకున్న భారత్ విజయాన్ని చూసిన తర్వాత బాబుకు క్రీడల పట్ల మక్కువ పెరిగింది. మారథాన్ రన్నర్ కావాలనేది అతడి జీవితాశయం. తన ఆశయాన్ని సాధించడానికి వారణాసి వచ్చాడు.
కాగా.. రోజు 200 మీటర్ల ట్రాక్‌పై ప్రాక్టీస్ చేసేవాడు. రోజూ ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రన్నింగే అతడి దినచర్య. ఆ తర్వాత వారణాసిలో హోటల్‌లో వెయిటర్‌గా పనిచేసేవాడు. కొరియర్ ప్యాకేజర్‌గా కూడా పనిచేశాడు. అలా వచ్చిన డబ్బులతో శిక్షణ తీసుకొనే వాడు. ఈ క్రమంలో అతడు రేస్ వాకింగ్‌కు మారాడు. జాతీయ స్థాయికి చేరుకున్నాడు.
ఉపాధి కూలీకి వెళ్తే రూ.150
కొవిడ్ మహమ్మారి సమయంలో రామ్‌బాబు తండ్రి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. గ్రామంలో ఉపాధి హామీ (MNREGA) పనికి వెళ్లానికి రామ్‌బాబును ప్రేరేపించాడు. కొన్నాళ్లు ఉపాధి పనికి వెళ్లాడు. రామ్‌బాబు, అతడి తండ్రి కలిసి ఉపాధి కూలీకి వెళ్తే రూ.300 వచ్చేవి. ఇది వారి కుటుంబానికి ఒక రోజు గడపడానికి సరిపోయేది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రామ్‌బాబు తన అభిరుచిని, ఆశయాన్ని వదులుకోలేదు.
నిరుడు జాతీయ రికార్డు బద్దలు
2022లో గుజరాత్‌లోని ఐఐటీ గాంధీనగర్ అథ్లెటిక్ ట్రాక్‌లో 35 కిలోమీటర్ల రేసు నడకలో 2:36:34 టైమింగ్‌తో జాతీయ రికార్డును రామ్‌బాబు బద్దలు కొట్టాడు. నేషనల్ గేమ్స్ 2022లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఇప్పుడు తాజాగా హాంగ్‌జౌలో జరిగిన ఆసియా గేమ్స్‌లో 35 కిమీ రేస్ వాక్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో మంజు రాణితో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. తన పోరాట కథను మరింత స్ఫూర్తిదాయకంగా మార్చాడు.