T20 world cup IND vs PAK దాయాదుల పోరు …పాకిస్తాన్​పై భారత్​ ఘనవిజయం

రికార్డు చెరిగిపోకుండా భారత్​ దాయాది పాకిస్తాన్​పై విజయభేరి మోగించింది. తక్కువ స్కోర్ల మ్యాచ్​లో ఘనవిజయం సాధించింది.

T20 world cup IND vs PAK  దాయాదుల పోరు …పాకిస్తాన్​పై భారత్​ ఘనవిజయం

టి20 ప్రపంచకప్​(T20 World Cup)లో భాగంగా న్యూయార్క్​లో జరిగిన హై ఓల్టేజ్​ మ్యాచ్​లో పాకిస్తాన్​(Pakistan)పై భారత్(India)​ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్​ గెలిచిన పాకిస్తాన్​  ఊహించినట్లే భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించింది. న్యూయార్క్​ పిచ్​పై బంతి అనూహ్యంగా బౌన్సవుతందని ఇరుజట్లకు ముందే తెలుసు కాబట్టి, భారత్​ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. తొలి వికెట్​గా విరాట్​ కోహ్లీ(4) వెనుదిరగగా, రిషభ్​ పంత్​ రోహిత్​తో జత కలసి స్కోరును ముందుకు నడిపించాడు. వెనువెంటనే రోహిత్​(13) కూడా అవుటవగా, ఆశ్యర్యకరంగా అక్షర్​ పటేల్​ బ్యాటింగ్​ వచ్చాడు. రిషభ్​, అక్షర్​ కలిసి ఇన్నింగ్స్​ను కాస్తా ముందుకు తోయగా, తరువాత వచ్చినవారెవరూ సరిగ్గా నిలబడలేకపోయారు. దాంతో 19 ఓవర్లలో భారత్​ 119 పరుగులకే ఆలౌట్​ అయింది. పాక్​ బౌలర్లలో నసీమ్​ షా, హారిస్​ రౌఫ్​ చెరో 3 వికెట్లు తీసుకోగా, ఆమిర్​ 2, అఫ్రిది ఒక వికెట్​ తీసుకున్నాడు.

120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్​, ఆరంభంలో బాగానే ఆడింది. దాదాపు 15 ఓవర్ల వరకు పాకిస్తాన్​దే పైచేయిగా కనబడింది. అప్పటికి 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 80 పరుగులు చేసింది. అప్పటినుండి మ్యాచ్​ భారత్​వేపు మళ్లింది. పరుగులేమీ రాకుండా వికెట్లు పడుతుండేసరికి ఒత్తిడికి లోనైన పాక్​ బ్యాటర్లు మరింత ఇబ్బంది పడ్డారు. మరోవైపు పుంజుకున్న భారత్​ బౌలర్లు పాక్​ను వణికించేసరికి వారి వద్ద సమాధానం లేకుండా పోయింది. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్​ 7 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేసి ఓడిపోయింది.

భారత బౌలర్లలో బుమ్రా (Jasprit Bumrah) అద్భుతంగా బౌలింగ్​ చేసి 3 వికెట్లు తీసుకోగా, హార్థిక్​ పాండ్యా 2, అర్షదీప్​, అక్షర్​ చెరొకటి పంచుకున్నారు. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన భారత్​ 4 పాయింట్లతో, 1.455 నెట్​ రన్​రేట్​తో నిలబడింది. కాగా ఆడిన రెండు మ్యాచ్​లలో ఓడిపోయి పాకిస్తాన్​ సూపర్​ 8 స్థానాన్ని సంక్లిష్టం చేసుకుంది.

నిజానికి టాస్​ ఓడి, 119 పరుగులే చేసినప్పుడు సగటు భారత అభిమానులందరూ మ్యాచ్​ పోయిందని నిర్ణయించేసుకున్నారు. కానీ, అనూహ్యంగా భారత బౌలర్లు చెలరేగిన విధానం అమాంతం అభిమానుల్లో ఆనందాన్ని తిరిగితెచ్చింది. 34 వేల సామర్థ్యమున్న న్యూయార్క్​ స్టేడియం మొట్టమొదటిసారిగి కిటకిటలాడుతూ మొత్తం నిండిపోయి రికార్డు స్థాపించింది.