Ragula Naresh Yadav Paravolleyball | వైకల్యాన్ని పరిహసించి.. ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌కు సూర్యపేట యువ తేజం
ఓర్పు, నేర్పు పట్టుదలతో అంగవైకల్యాన్ని సైతం అధిగమించి ఎన్నో విజయాలు సాధించొచ్చని నిరూపించాడు రాగుల నరేష్ యాదవ్. అక్డోబర్ 8 నుంచి 18 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్ షిప్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు.

Ragula Naresh Yadav Paravolleyball | హైదరాబాద్, ఆగస్ట్ 17 (విధాత): ఓర్పు, నేర్పు పట్టుదలతో అంగవైకల్యాన్ని సైతం అధిగమించి ఎన్నో విజయాలు సాధించొచ్చని నిరూపించాడు రాగుల నరేష్ యాదవ్. అక్డోబర్ 8 నుంచి 18 వరకు అమెరికాలో జరిగే ప్రపంచ సిట్టింగ్ వాలీబాల్ చాంపియన్ షిప్‌లో భారత జట్టుకు ఎంపికయ్యాడు. గతంలోను ఎన్నో టోర్నమెంట్‌లలో భారత్ తరుఫున ఆడి అనేక మెడల్స్ సాధించాడు. నరేష్ యాదవ్ సూర్యాపేట జిల్లాలోని కందిబండ గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబానికి చెందిన మంగయ్య, వెంకమ్మ దంపతుల కుమారుడు. చిన్నతనంలోనే ఎడమకాలికి పోలియో సోకటంతో ఆ కాలు నిస్సత్తువగా మారింది. అయినా పారా క్రీడల్లో అథ్లెట్‌గా, బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా, వాలీబాల్ ఆటగాడిగా జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు. పారా క్రీడల్లో బహుముఖ ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు.
నరేష్ వ్యక్తిగతంగా జాతీయ స్థాయి జావలిన్ త్రోలో రజతం, షాట్‌పుట్‌లో రజతం, అంతర్జాతీయ స్థాయి షాట్‌పుట్‌లో స్వర్ణం, జావలిన్ త్రోలో రజతం ఇలా నాలుగు పతకాలు సంపాదించి భారతకీర్తిని ఎలుగెత్తి చాటాడు. సుమారు 10 టీం క్రీడల్లో పాల్గొన్నాడు. తన జట్టు పతకాల సంపాదనకు పోరాడాడు. ‘2016లో కర్ణాటకలోని బెంగళూరులో జాతీయ స్థాయిలో జరిగిన 5వ స్టాండింగ్ వాలీబాల్ పోటీల్లో నరేష్ కనబరచిన నైపుణ్యంతో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కింది. 2015లో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన జాతీయ స్టాండింగ్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రం తరఫున అడి కాంస్య పతకం సంపాదించాడు. 2016లో శ్రీలంకలోని కొలంబోలో జరిగిన పారా వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాడు. అత్యుత్తమ ప్రతిభ కనబరచి రన్నర్అప్‌గా నిలవడానికి దోహదపడ్డాడు. 2016లో శ్రీలంక, భారత్ మధ్య జరిగిన ఓపెన్ టోర్నమెంట్లో భారత్ జట్టుకు బంగారు పతకాన్ని అందించాడు. 2017లో జరిగిన జాతీయ సిట్టింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో కాంస్య పతకం గెలిచాడు. 2018లో థాయిలాండ్లో భారత్, థాయ్‌లాండ్ జట్ల మధ్య సిట్టింగ్ పారా వాలీబాల్ పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించాడు.
2018లో కోయంబత్తూర్‌లో జరిగిన సీనియర్ సిట్టింగ్ వాలీ బాల్ పోటీల్లో తెలంగాణ టీం కెప్టెన్‌గా కీలకంగా ఆడి కాంస్య పతకం సాధించాడు. 2019లో చైనాలో జరిగిన ప్రపంచ బీచ్ వాలీ బాల్ పోటీల్లో భారత జెట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించి నాలుగో స్థానంలో నిలబెట్టాడు. 2021 హర్యానాలో జరిగిన సీనియర్ నేషనల్ సిట్టింగ్ వాలీ బాల్ తెలంగాణ తరుఫున పాల్గొన్నాడు. 2022 చెన్నైలో జరిగిన సీనియర్ సిట్టింగ్ వాలీబాల్ నేషనల్ పోటీల్లో తెలంగాణ తరుఫున పాల్గొన్నాడు. 2023లో తంజావూరులో జరిగిన నేషనల్ సీనియర్ సిట్టింగ్ వాలీబాల్ తెలంగాణ కెప్టెన్ గా ఆడాడు. 2024లో చైనాలో జరిగిన ప్రపంచ పారా బీచ్ వాలీబాల్ పోటీల్లో భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించి రజతం సాధించాడు. 2016లో ఖేల్ రత్న అవార్డుల ప్రదానం కార్యక్రమంలో పాల్గొనటానికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్నారు. 2015, 16, 17 సంవత్సరాలకు దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా ఉత్తమ స్పోర్ట్స్‌మెన్ అవార్డును దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
CM ON SPORTS UNIVERSITY | స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
Cricket Stadium Warangal | వరంగల్‌లో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం
cricket stadium in forest | ఆ క్రికెట్ మైదానం అమెజాన్ అడవుల్లోనే ఉందా? నిజం తెలిస్తే నివ్వెరపోతారు!