IND vs WI Test | విండీస్​తో రెండో టెస్ట్​లో భారత్‌ ఘన విజయం – 2–0తో సిరీస్‌ సొంతం

వెస్ట్‌ఇండీస్‌పై రెండో టెస్ట్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో గెలిచింది. కేఎల్‌ రాహుల్‌ అర్ధశతకం సాధించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. భారత్‌ 2–0తో సిరీస్‌ కైవసం చేసుకుంది.

  • By: ADHARVA |    sports |    Published on : Oct 14, 2025 10:57 AM IST
IND vs WI Test | విండీస్​తో రెండో టెస్ట్​లో భారత్‌ ఘన విజయం – 2–0తో సిరీస్‌ సొంతం

India vs West Indies 2nd Test Day 5 | IND won by 7 wickets | Test Series 2025

వెస్టిండీస్‌పై రెండో టెస్ట్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఢిల్లీ ఆరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏడు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను 2–0 తేడాతో వైట్​వాష్​ చేసింది. నాలుగో రోజు 63/1 స్కోరుతో ఆటను కొనసాగించిన భారత్‌, ఐదో రోజు మిగిలిన 58 పరుగులు మొదటి గంటోనే సాధించి, మ్యాచ్​ను ముగించింది. 121 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 3 వికెట్లు కోల్పోయి, కేవలం 35.2 ఓవర్లలో చేరుకుంది.

అర్ధశతకంతో మెరిసిన కేఎల్‌ రాహుల్‌

కేఎల్‌ రాహుల్‌ అద్భుత బ్యాటింగ్‌ చేసి 58 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. ఆయన సాయిసుదర్శన్‌ (39)తో కలిసి రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సాయిసుదర్శన్‌ ఔటయ్యాక కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (13) క్రీజులోకి వచ్చి ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. చివర్లో రాహుల్‌ తోడుగా వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురేల్‌ (6*) నిలిచి భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. రెండు వికెట్లు ఆఫ్‌-స్పిన్నర్‌ రోస్టన్‌ చేస్‌ (2/36) ఖాతాలో చేరాయి.

ఈ విజయంతో భారత్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0 తేడాతో గెలిచింది. టెస్ట్‌ క్రికెట్‌లో వెస్టిండీస్‌పై భారత్‌ ఆధిపత్యం మరోసారి రుజువైంది. బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, సిరాజ్‌ చూపిన అద్భుత ప్రదర్శనతో పాటు రాహుల్‌ బ్యాటింగ్‌ భారత్‌ విజయానికి ప్రధాన కారణాలయ్యాయి.