IND vs WI 2nd Test | రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్​ : దీటుగా పోరాడిన వెస్టిండీస్​

వెస్ట్‌ఇండీస్‌పై రెండో టెస్ట్‌లో భారత్‌ విజయానికి కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం ఉంది. కుల్దీప్‌, బుమ్రా, సిరాజ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని 390 పరుగులకు కట్టడి చేసింది.

  • By: ADHARVA |    sports |    Published on : Oct 13, 2025 7:25 PM IST
IND vs WI 2nd Test | రెండో టెస్టులో గెలుపు దిశగా భారత్​ : దీటుగా పోరాడిన వెస్టిండీస్​

India 58 runs away from 2–0 sweep of West Indies | IND vs WI Test 2025

IND vs WI Test | వెస్టిండీస్​పై రెండో టెస్ట్‌లో భారత్‌ విజయానికి చేరువలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన భారత్‌, వెస్టిండీస్​ను ఫాలోఆన్‌కు దింపింది.  కానీ వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో నిబ్బరంగా ఆడింది. పిచ్​ మందకొడిగా మారడంతో భారత్​కు వికెట్లు లభించడం కష్టంగా మారింది. ఫాలోఆన్​లోనే మళ్లీ ఆలౌట్​ చేసి మరోసారి ఇన్నింగ్​ విజయం సాధించాలన్న కల నెరవేరలేదు. ఇద్దరు వెస్టిండీస్​ బ్యాటర్లు సెంచరీలు చేయడంతో 390 పరుగులకు ఆలౌట్​ అయి, 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్​ ముందుంచింది. ఆట ముగిసే సమయానికి భారత్​ ఒక వికెట్​ నష్టానికి 63 పరుగులు చేసి, విజయానికి 58 పరుగుల దూరంలో ఉంది. సాయిసుదర్శన్‌ (30*), కేఎల్‌ రాహుల్‌ (25*) క్రీజులో ఉన్నారు.

వెస్ట్‌ఇండీస్‌ ధీటైన పోరాటం

అంతకుముందు  ఫాలోఆన్‌కు దిగిన వెస్టిండీస్​ రెండో ఇన్నింగ్స్​లో మంచి ప్రతిఘటన ప్రదర్శించింది. జాన్‌ క్యాంప్‌బెల్‌ (115), షై హోప్‌ (103) శతకాలు చేసి జట్టును నిలబెట్టారు. చివరి వికెట్‌ జంట 79 పరుగులు చేయడంతో ఆలౌట్​ ఆలస్యమైంది.

అయితే బుమ్రా, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌ త్రయం సమర్థంగా బౌలింగ్‌ చేసి ఇన్నింగ్స్‌ను ముగించారు. సిరాజ్‌ హోప్‌ వికెట్‌ తీసి బ్రేక్‌ ఇవ్వగా, కుల్దీప్‌ వరుసగా మూడు వికెట్లు తీశాడు. బుమ్రా కూడా చివరి దశలో కీలకంగా బౌలింగ్​ చేసాడు. కుల్దీప్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఎనిమిది వికెట్లు సాధించి ప్రధాన వికెట్​ టేకర్​గా  నిలిచాడు.

ఆఖరి రోజుకు వాయిదా పడ్డ విజయం

భారత్‌కి ఇప్పుడు కేవలం 58 పరుగులు మాత్రమే అవసరం ఉంది. పిచ్‌ నిస్సారంగా ఉన్నా, బ్యాటర్లు రేపు పెద్దగా ఇబ్బంది పడకుండానే ఆటను తొందరగా ముగిస్తారని అంచనా. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌ను 2–0 తేడాతో గెలుచుకోనుంది.