India win over Pak Again | పాకిస్తాన్‌ను మరోసారి మట్టికరిపించిన భారత్
ఆసియాకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్ 4లో తొలి మ్యాచ్ ఆడిన భారత్ పాక్‌ను మళ్లీ చిత్తు చేసింది.
India win over Pak Again | ఆసియాకప్ 2025లో భారత్ అప్రతిహతంగా దూసుకెళ్తోంది. లీగ్ దశలో ఓటమనేదే లేకుండా సూపర్ 4 లోకి అడుగుపెట్టిన భారత్ నేడు పాకిస్తాన్‌తో మరోసారి తలపడింది. లీగ్ పోటీలో భారత్ చేతిలో ఘోర పరాభవం మూటగట్టుకున్న పాకిస్తాన్ నేడు మళ్లీ అదే అవమానాన్ని ఎదుర్కొంది. పాక్ విధించిన 172 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులతో సాధించింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్, ఈసారి బ్యాట్ ఝళిపించింది. తొలి వికెట్(21) తొందరగానే కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్థ శతకంతో చెలరేగాడు. ఆ తర్వాత అందరూ రెండంకెల స్కోరు చేయడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించింది. భారత బౌలర్లలో శివమ్ దూబే 2 వికెట్లు తీసుకోగా, హార్థిక్, కుల్దీప్ చెరో వికెట్ తీసారు.
172 పరుగుల లక్ష్యసాధనకు బరిలో దిగిన భారత్‌కు స్టార్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ చిచ్చరపిడుగుల్లా చెలరేగి శతక (భాగస్వామ్యాన్ని అందించారు. 47 పరుగుల(8 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద గిల్ అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్య డకౌట్ అయి నిరాశపర్చగా, అభిషేక్ ఆఫ్ సెంచరీ సాధించి భారీ సిక్స్‌లతో మురిపించాడు. చివరికి 74 పరుగుల( 39 బంతుల్లో 5 సిక్స్‌లు, 6 ఫోర్లు) వద్ద అబ్రార్ బౌలింగ్‌లో రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన సంజూ సాంసన్ 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. కాగా తిలక్ వర్మ (19 బంతుల్లో 30) చివర్లో చెలరేగి హార్థిక్ పాండ్యా(7 నాటౌట్) సహకారంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
పాక్ బౌలర్లలో హరిస్ రౌఫ్ రెండు వికెట్లు సాధించగా, అబ్రార్, ఫహిమ్ తలో వికెట్ తీసుకున్నారు.

కాగా, భారత ఓపెనర్ల విజృంభణను తట్టుకోలేని పాక్ బౌలర్లు స్లెడ్జింగ్‌కు దిగారు. అఫ్రిదీ అభిషేక్‌తోనూ, రౌఫ్ శుభమన్తోనూ కాసేపు మాటల యుద్ధం చేసారు. అంపైర్లు కలగజేసుకుని ఇరువురిని సముదాయించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram