సంచలన చైతన్యం చాకలి ఐలమ్మ

తెలంగాణ ఏర్పాటుకు పోరాట వీర మహిళ చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని చాటిచెబుతూ డాక్టర్ అలేఖ్య పుంజాల ప్రదర్శించిన కూచిపూడి జానపద నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది

సంచలన చైతన్యం చాకలి ఐలమ్మ

ఆకట్టుకున్న కాకతీయ నాటకోత్సవం

విధాత, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ ఏర్పాటుకు పోరాట వీర మహిళ చాకలి ఐలమ్మ స్ఫూర్తి అని చాటిచెబుతూ డాక్టర్ అలేఖ్య పుంజాల ప్రదర్శించిన కూచిపూడి జానపద నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క ఆద్యంతం నృత్య రూపకం తిలకించి డాక్టర్ అలేఖ్య ను అభినందించి ఘనంగా సత్కరించారు. ఆదివారం కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను సాంప్రదాయ కూచిపూడి, జానపద శైలిలో అద్భుత నృత్య రూపకంగా ప్రదర్శించి ఉత్తేజితులను చేశారు. అభినయ కళాతపస్వి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల బృందం ఈ సంచలన ప్రదర్శన చేసి రాజకీయ దిగ్గజాలు, కళాప్రియుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఉత్సవాలను లాంఛనంగా జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. ఈ వేడుకలో ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఆర్య వైశ్య కార్పొరేషన్ అధ్యక్షురాలు కాల్వ సుజాత, మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, కుడా చైర్మన్ ఇ. వెంకట్రాంరెడ్డి, సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్, చాకలి ఐలమ్మ ముని మనవరాలు చిట్యాల శ్వేత తదితరులు పాల్గొన్నారు.