Ipl2024: Mumbai Indians vs Punjab Kings | మొహాలీలో ముంబ‌యి విచిత్ర విజ‌యం

ఐపిఎల్-2024లో భాగంగా నేడు మొహాలీలో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 ప‌రుగుల తేడాతో ముంబ‌యి విజ‌యం సాధించింది.

  • By: Tech    sports    Apr 18, 2024 11:53 PM IST
Ipl2024: Mumbai Indians vs Punjab Kings | మొహాలీలో ముంబ‌యి విచిత్ర విజ‌యం

విజ‌యం రెండు జ‌ట్ల‌తో బంతాట ఆడుకుంది. ఎప్పుడు ఎవ‌రు గెలుస్తారో ఊహించ‌లేక మొహాలీ ప్రేక్ష‌కుల న‌రాలు చిట్లిపోయాయి. ఆట‌గాళ్ల‌కు కూడా ఏదీ న‌మ్మ‌శ‌క్యంగా లేకుండాపోయింది. కాసేపు వీరివైపు, కాసేపు వారివైపు విజ‌యం దోబూచులాడింది.

ఈమ‌ధ్య సొంత మైదానంలో గెలుస్తున్న‌వారే క‌రువ‌య్యారు. నిన్న గుజ‌రాత్‌, మొన్న కోల్‌క‌తా, అంత‌కుముందు బెంగ‌ళూరు, దానికంటే ముందు ముంబ‌యి..ఇలా అంద‌రూ సొంత ఇలాకాలో ఓడిపోతున్న‌వారే. ఈరోజు కూడా అదే పున‌రావృత‌మ‌యింది. కానీ, ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న పంజాబ్‌లో అశుతోష్ శ‌ర్మ ఒక్క‌సారిగా గెలుపు ఆశ‌లు రేపినా, చివ‌రికి మ‌ళ్లీ ముంబ‌యిదే విజ‌య‌మ‌యింది. భారీ ఓట‌మిపాటు కావాల్సిన పంజాబ్ 9 ప‌రుగుల నామ‌మాత్ర‌పు తేడాతో ఓట‌మిపాలైంది.

ఐపిఎల్-2024లో భాగంగా నేడు మొహాలీలో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 9 ప‌రుగుల తేడాతో ముంబ‌యి విజ‌యం సాధించింది. టాస్ గెలిచి, పంజాబ్ జ‌ట్టు ముంబ‌యిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్ బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రిస్తున్నా, ముంబ‌యి బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడి 192 ప‌రుగుల భారీ స్కోరు చేయ‌గ‌లిగారు. పిచ్ నుంచి అందిన స‌హ‌కారాన్ని అందిపుచ్చుకోలేని పంజాబ్ బౌల‌ర్లు వికెట్లు మాత్రం తీయ‌లేక‌పోయారు. ఒక ఇషాన్ కిష‌న్‌(8)ను తొంద‌ర‌గా ఔట్ చేసినా, రోహిత్‌(36), సూర్య‌కుమార్ యాద‌వ్‌(53 బంతుల్లో 78) రెచ్చిపోవ‌డంతో, స్కోర్‌బోర్డు ప‌రుగులు పెట్టింది. రోహిత్ అవుట‌యిన త‌ర్వాత వ‌చ్చిన తిల‌క్ వ‌ర్మ‌(18 బంతుల్లో 34) కూడా దూకుడుగా ఆడ‌టంతో ముంబ‌యి నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ 3, కెప్టెన్ సామ్ క‌ర‌న్ 2, ర‌బాడ ఒక వికెట్ తీసుకున్నారు.

అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ రెండు ఓవ‌ర్ల‌కే నాలుగు కీల‌క వికెట్లు స‌మ‌ర్పించుకుంది. అప్పుడు స్కోరు కేవ‌లం 14 ప‌రుగులు. ఆ దెబ్బ‌తో ఇక పంజాబ్‌కు కోలుకునే అవ‌కాశ‌మే రాలేదు. ముంబ‌యి బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన పంజాబ్ బ్యాట‌ర్ల‌ను ఓ ఆటాడుకున్నారు. శ‌శాంక్‌సింగ్ ఒంట‌రి పోరాటం చేసినా క‌లిసిరాలేదు. శ‌శాంక్ అవుట‌వడంతో పంజాబ్ దింపుడుగ‌ల్లం ఆశ‌లు కూడా ఆవిర‌య్యాయి. అప్పుడు స్కోరు 12.1 ఓవ‌ర్ల‌లో 111/7. చేయాల్సిన ప‌రుగులు 47 బంతుల్లో 82. అప్ప‌డొచ్చాడు ఒక్క‌డు. అశుతోష్ శ‌ర్మ‌. అశుతోష్ రాక‌తో ఒక్క‌సారిగా ఆట మారిపోయింది. వ‌చ్చీరాగానే సిక్స్‌ల‌తో విరుచుకుప‌డ్డ అశుతోష్ మ్యాచ్‌ను మ‌ళ్లీ పంజాబ్ వైపు లాక్కొచ్చాడు. అప్ప‌టిదాకా దిలాసాగా ఉన్న ముంబ‌యిలో కంగారు మొద‌ల‌యింది. కావాల్సినంత లాభం చేసాక అశుతోష్ ( 28 బంతుల్లో 61) అవుట‌య్యాడు. అప్పుడు కావాల్సిన ప‌రుగులు 25. ఇంకా 17 బంతులున్నాయి. కానీ, అదే ఊపును మిగతా బ్యాట‌ర్లు కొన‌సాగించ‌లేక‌పోయారు. చివ‌రికి 19.1 ఓవ‌ర్ల‌లో 183 ప‌రుగుల‌కు పంజాబ్ ఆలైట్ అయింది.

ముంబ‌యి బౌల‌ర్ల‌లో బుమ్రా, కొయిట్జీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, మ‌ధ్వాల్‌, గోపాల్, పాండ్యా త‌లా ఒక‌టి చేజిక్కించుకున్నారు