Manu Bhaker | పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి కాంస్యం

పారిస్ ఒలంపిక్స్‌లో పతకాల వేటలో భారత్ బోణి కొట్టింది. 10మీటర్ల ఏయిర్ పిస్టల్ షూటింగ్‌ విభాగంలో మనుభాకర్ కాంస్య పతకం సాధించింది

Manu Bhaker | పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి కాంస్యం

10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మనుభాకర్‌కు కాంస్యం
ఫైనల్లో అర్జున్ బాబుతా
మనుభాకర్‌కు అభినందనల వెల్లువ…రాష్ట్రపతి, ప్రధానిల ప్రశంసలు

విధాత, హైదరాబాద్ : పారిస్ ఒలంపిక్స్‌లో పతకాల వేటలో భారత్ బోణి కొట్టింది. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్‌ విభాగంలో మనుభాకర్ కాంస్య పతకం సాధించింది. భారత్‌కు ఈ ఒలంపిక్స్‌లో మొదటి పతకాన్ని అందించి దేశ కీర్తీ పతాకాన్ని ఎగరవేసింది. ఈ విభాగంలో 20ఏళ్ల తర్వాతా భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి భారత మహిళా షూటర్‌గా నిలిచిన మనుభాకర్ ఒలింపిక్స్‌ షూటింగ్ పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు) స్వర్ణం, కిమ్ యేజే (241.3 పాయింట్లు) రజతం గెలిచారు. మరోవైపు, పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్జున్ బబుతా అదరగొట్టాడు. అతడు 630.1 స్కోరుతో ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ సందీప్ సింగ్ (629.3 స్కోరు) 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. పురుషుల 10మీ ఎయిర్ పిస్టల్ ఫైనల్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ జరీన్

తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన నిఖత్ జరీన్‌ మహిళల 50 కేజీల విభాగంలో ప్రిక్వార్స్‌లోకి దూసుకెళ్లింది. ఆరంభ పోరులో ఆమె 5-0తో మ్యాక్సీ కరీనా (జర్మనీ)ని ఓడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో నిఖత్ పతకం గెలుస్తుందనే అంచనాలున్నాయి.

మనుభాకర్‌కు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల అభినందనలు

పారిస్ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం అందించిన షూటర్ మనుభాకర్‌పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి .10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 12 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం రావడం విశేషం. తన ప్రతిభతో ఒలంపిక్ కాంస్యం సాధించిన మనుభాకర దేశం కీర్తిని చాటరని, ఆమెను చూసి దేశం గర్వపడుతుందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అభినందనలు తెలిపారు. మనుభాగర్ సాధించినన ఈ విజయం ఎంతోమంది క్రీడాకారులు, మరీ ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ప్రధాని మోదీ సైతం మనుభాకర్‌ను అభినందించారు. షూటింగ్‌లో భారత్ తరపున కాంస్య పతకం సాధించడంతో పాటు ఈ ఘనత అందుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించడం మరో ప్రత్యేకత అన్నారు. ఇదో అపురూపమైన విజయమన్నారు.

ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలు కూడా మనుభాకర్‌ను అభినందించారు. మీ అసాధారణమైన నైపుణ్యం, పట్టుదలకు ఈ విజయమే నిదర్శనమని, మేమంతా గుర్వపడుతున్నామన్నారు. ఈ మహత్తర క్షణం అసంఖ్యాకమైన యువ క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిదాయకం’ అని పోస్ట్ చేశారు .మన అమ్మాయిలు అద్భుతమైన ఆరంభాన్ని అందించారని,ఇంకా చాలా పతకాలు రావాలి’ అని ఆకాంక్షించారు

పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ లో భారత్ నుంచి తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారిస్ లో పథకాల వేట కొనసాగిస్తున్నారు. జులై 26న పారిస్ లో ఆరంభమైన ఒలింపిక్స్ వచ్చేనెల ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయి. ఈ క్రీడల్లో భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పీవీ సింధు (బ్యాడ్మింటన్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), బొమ్మదేవర ధీరజ్ (ఆర్చరీ), జ్యోతి యర్రాజి (అథ్లెటిక్స్), జ్యోతిక శ్రీ (అథ్లెటిక్స్), నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టేబుల్ టెన్నిస్), ఇషా సింగ్ (షూటింగ్)‌లు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇప్పటికే రెండు ఒలింపిక్స్ పతకాలు సాధించారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని అందుకున్న విషయం తెలిసిందే.