Khel Ratna Award । ఖేల్‌ రత్న నామినేషన్లలో మనుబాకర్‌ పేరు! నష్ట నివారణ చర్యల్లో కేంద్ర క్రీడాశాఖ

ఆఖరు నిమిషంలో ఖేల్‌ రత్న నామినేషన్ల జాబితాలో మను బాకర్‌ పేరును చేర్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అతి త్వరలో జాబితా సిద్ధం కానున్నట్టు చెబుతున్నారు. తుది జాబితాను బుధవారం (25.12.2024) కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు పంపుతారని సమాచారం.

  • By: TAAZ    news    Dec 24, 2024 4:28 PM IST
Khel Ratna Award । ఖేల్‌ రత్న నామినేషన్లలో మనుబాకర్‌ పేరు! నష్ట నివారణ చర్యల్లో కేంద్ర క్రీడాశాఖ

Khel Ratna Award । రెండు ఒలింపిక్‌ పతకాల విజేత అయిన షూటర్‌ మను బాకర్‌ పేరు ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డుల జాబితాలో లేకపోవడంతో తలెత్తి వివాదంతో క్రీడా శాఖ నష్ట నివారణ చర్యలకు దిగింది. రెండు పతకాలు సాధించిన తన కుమార్తె పేరు ఖేల్‌ రత్న నామినేషన్లలో లేకపోవడంపై ఆమె తండ్రి కూడా తీవ్రస్థాయిలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. వివిధ వర్గాల నుంచి సైతం విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆఖరు నిమిషంలో ఖేల్‌ రత్న నామినేషన్ల జాబితాలో మను బాకర్‌ పేరును చేర్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అతి త్వరలో జాబితా సిద్ధం కానున్నట్టు చెబుతున్నారు. తుది జాబితాను బుధవారం (25.12.2024) కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయకు పంపుతారని సమాచారం. క్రీడాశాఖ స్కీం ఫర్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు’కు సంబంధించిన 5.1, 5.2 ఆర్టికల్స్‌ను ఉపయోగించి మను బాకర్‌ పేరును చేర్చుతుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంటున్నది.

మను బాకర్‌ పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో మొదట రజత పతకం సాధించింది. అనంతరం సహ షూటర్‌ సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి పది మీటర్ల మిక్సిడ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రెండో రజత పతకం గెలుపొందింది. 5.1, 5.2 ఆర్టికల్స్‌ ప్రకారం.. అవార్డుకు అర్హులైన వారు తమంతట తాముగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. దానితోపాటు కేంద్ర ప్రభుత్వం వివిధ క్యాటగిరీల్లో ఇద్దరు క్రీడాకారుల పేర్లను సిఫారసు చేసే వీలు ఉన్నది. వాస్తవానికి మను బాకర్‌ పేరును ది నేషనల్‌ రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సిఫార్సు చేయాల్సి ఉన్నా.. చేయలేదు. దానిపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జాబితాలో మను బాకర్‌ పేరును చేర్చాలని కేంద్ర క్రీడా శాఖను ఎన్‌ఆర్‌ఏఐ కోరింది. వాస్తవానికి మను బాకర్‌ స్వయంగా కూడా వెబ్‌ పోర్టల్‌లో అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నది. అంతకు ముందు క్రీడా శాఖ అధికారులు మాత్రం మను బాకర్‌ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు.

రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించిన నీరజ్‌ చోప్రా సహా దాదాపు అందరు ఒలింపిక్‌ పతక విజేతలు ఖేల్‌ రత్న అవార్డులు పొందారు. ఈ ఏడాది భారతదేశానికి వరుసగా రెండో ఒలింపిక్‌ రజత పతకం సాధించిన భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హర్మన్‌ప్రీత్‌సింగ్‌, పురుషుల హైజంప్‌ విభాగంలో పారిస్‌ పారాలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్లను అవార్డు కమిటీ పొందుపర్చింది. బాకర్‌ పేరు ఖేల్‌ రత్న నామినేషన్లలో లేకపోవడంపై ఆమె తండ్రి రామ్‌ కిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి కూడా అవార్డుల కోసం అడుక్కోవాల్సిన దుస్థితేంటని నిలదీశారు. ‘ఒక ప్రభుత్వ అధికారి నిర్ణయిస్తాడు. కమిటీ సభ్యులు మౌనంగా ఉంటారు. వారి అభిప్రాయం చెప్పరు. నాకేమీ అర్థం కావడం లేదు. క్రీడాకారులను ప్రోత్సహించే పద్ధతి ఇదేనా?’ అని ఆయన మీడియా వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. అవార్డు కోసం తాము దరఖాస్తు చేసినా కమిటీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన చెప్పారు.