Ipl 24 GT vs RCB గుజరాత్ కొంపముంచిన బెంగళూరు

అన్ని మ్యాచ్​లూ ఓడిపోయి పాయింట్లపట్టికలో అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్​ బెంగళూరు ఇప్పుడు వరుసగా గెలుస్తూ మిగతా జట్ల ప్లేఆఫ్ ప్రయాణాన్ని అడ్డుకుంటోంది. ఇవాళ కూడా అదే పరిస్థితి. పది పాయింట్లకు చేరుకుని ప్లేఆఫ్ రేసులో నిలబడాలని గట్టిగా అనుకున్న గుజరాత్​ ఆశలపై ఆర్సీబీ నీళ్లు చల్లింది.

Ipl 24 GT vs RCB  గుజరాత్ కొంపముంచిన బెంగళూరు

ఐపిఎల్​–2024 లో భాగంగా అహ్మదాబాద్​లో జరిగిన 45వ మ్యాచ్లో గుజరాత్​ టైటాన్స్​పై ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గుజరాత్​ విధించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 16 ఓవర్లలో కేవలం ఒకే వికెట్​ కోల్పోయి సాధించింది. విరాట్​ కోహ్లీ(41 బంతుల్లో 70 పరుగులు), విల్​ జాక్స్​(44 బంతుల్లో 100) వీరవిహారంతో బెంగళూరు ఏ సమయంలో కూడా సంయమనం కోల్పోకుండా, ఆడుతూపాడుతూ గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో ఎవరి స్థానాల్లో వారే ఉన్నా, పాయింట్లలో మాత్రం ఆర్సీబీ 6కు చేరింది. బెంగళూరు కోల్పోయిన ఒక వికెట్​ కెప్టెన్​ డ్యుప్లెసీని సాయి కిషోర్​ అవుట్ చేసాడు.

అంతకుముందు రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు టాస్​ గెలిచి గుజరాత్​ను బ్యాటింగ్​కు దించింది. బెంగళూరు వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ, వృద్ధిమాన్ సాహా, స్కోరు 6 పరుగుల వద్ద ఉన్నప్పుడే అవుటయ్యాడు. తర్వాత కెప్టెన్​ గిల్​ కూడా ఎక్కువ సేపు నిలబడకుండా 16 పరుగులకే పెవిలియన్​ చేరాడు. మూడో స్థానంతో బ్యాటింగ్​కు వచ్చిన సాయిసుదర్శన్ అద్భుతంగా ఆడి 84 పరుగులు చేసాడు. సాయితో జతకలిసిన షారుఖ్​ఖాన్​ కూడా 58 పరుగులు చేయడంతో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది.

బెంగళూరు​ బౌలర్లలో సిరాజ్​, మ్యాక్సీ, స్వప్నల్​ తలా ఒక వికెట్ తీసుకున్నారు.