హైదరాబాద్‌ కథ ఇంతటితో సమాప్తం.. క్వాలిఫయర్‌-2కు రాజస్థాన్‌ రాయల్స్‌

ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. భారీ స్కోరుతో ఒత్తిడి పెంచిన రాజస్థాన్‌ రాయల్స్‌.. హైదరాబాద్‌ను కకావికలం చేసి క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో పోరుకు సిద్ధమైంది.

ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ బాల బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ భారీ షాట్‌ ఆడుతున్న దృశ్యం

హైదరాబాద్‌ బౌలింగ్‌ను చిత్తు చేసిన వైభవ్‌ సూర్యవంశీ.. రాజస్థాన్‌ భారీ స్కోరుకు పునాది వేసిన విధ్వంసక ఇన్నింగ్స్‌

ఐపీఎల్‌ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ముగిసింది. నాకౌట్‌ ఒత్తిడిలో రాజస్థాన్‌ రాయల్స్‌ బ్యాటర్లు సృష్టించిన పరుగుల సునామీలో హైదరాబాద్‌ బ్యాటర్లు కొట్టుకుపోయారు. భారీ లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే వికెట్లు కోల్పోయిన సన్​రైజర్స్​.. చివరకు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ రాయల్స్‌ క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో అమీతుమీకి సిద్ధమైంది.

చండీగఢ్​: ముల్లన్‌పూర్‌ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌ పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ మొదట బ్యాటింగ్‌లోనే మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఆరంభం నుంచే దూకుడు చూపిన ఆర్​ఆర్​ బ్యాటర్లు హైదరాబాద్‌ బౌలింగ్‌ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. ముఖ్యంగా వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో బంతులను తుత్తునియలు చేసి మ్యాచ్‌ను ఒక్కసారిగా మార్చేశాడు. అతని బ్యాట్‌ నుంచి వచ్చిన భారీ షాట్లు హైదరాబాద్​ బౌలర్ల వద్ద బంతులు లేకుండా చేశాయి. ధ్రువ్‌ జురెల్‌ కూడా కీలక సమయంలో మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్‌ స్కోరు 243/8కు చేరింది.

భారీ లక్ష్యం.. ఆరంభంలోనే హైదరాబాద్‌ కుదేలు

244 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కావాల్సింది దూకుడైన ఆరంభం. కానీ నాకౌట్‌ ఒత్తిడి, రాజస్థాన్‌ బౌలర్ల కట్టుదిట్టమైన దాడి కలిసి ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్​ నిప్పుల్లాంటి బంతులు సన్​రైజర్స్​ను గతితప్పేలా చేసాయి. పవర్‌ప్లే నుంచే వికెట్లు పడటంతో ఛేదన గాడి తప్పింది. మధ్య ఓవర్లలోనూ నిలకడైన భాగస్వామ్యం లేకపోవడంతో హైదరాబాద్‌ విజయావకాశాలు క్రమంగా కరిగిపోయాయి.

ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ లాంటి మ్యాచ్‌విన్నర్లపై భారీ ఆశలు పెట్టుకున్న హైదరాబాద్​కు ఈసారి ఆ మ్యాజిక్‌ దక్కలేదు. సున్నాకే అభిషేక్​ అవుట్​ కావడంతో అభిమానుల గుండెల్లో రాయిపడింది. ఒక వైపు రన్‌రేట్‌ పెరుగుతుండడం, మరోవైపు వికెట్లు వరుసగా కోల్పోవడంతో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలిపోయింది. భారీ లక్ష్య ఛేదనలో కనీసం ఒక భారీ భాగస్వామ్యం అవసరమైన చోట ఎస్​ఆర్​హెచ్​ పూర్తిగా విఫలమైంది. చివరికి 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్​ అయి, 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

రాజస్థాన్​ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్​ విజృంభించి 3 వికెట్లు తీసుకుని ఆరంభంలోనే హైదరాబాద్​ వెన్ను విరిచాడు. తరువాత బర్జర్​, జడేజా తలా రెండేసి వికెట్లు తీసారు.

హైదరాబాద్‌ ఛేజ్‌ను కుదేలు చేసిన జోఫ్రా ఆర్చర్‌.. వికెట్‌ తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ సంబరాలు

సూర్యవంశీ సునామీలో తుడిచిపెట్టుకుపోయిన హైదరాబాద్​

కాగా, టాస్​ ఓడిపోయి, బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ బ్యాటర్లు టాస్​ తామే గెల్చి బ్యాటింగ్​ తీసుకున్నట్లు రెచ్చిపోయారు. వండర్​ బాయ్​ వైభవ్​ సూర్యవంశీ చిచ్చరపిడుగల్లే చెలరేగిపోవడంతో సన్​రైజర్స్​ బౌలర్ల బంతులు గతితప్పాయి. వెనకాముందూ చూడకుండా, బౌలర్​ ఎవరనేది కూడా గమనించకుండా ఎడాపెడా సిక్సర్ల మీద సిక్సర్లు బాదిన సూర్యవంశీ మ్యాచ్​ మొత్తం గమనాన్నే మార్చేసాడు. కేవలం 29 బంతుల్లో 12 సిక్స్​లు, 5 ఫోర్లతో 97 పరుగులు చేసి, తృటిలో శతకం చేజార్చుకున్న ఈ బుడతడు హైదరాబాద్​కు చేయాల్సిన నష్టం అంతా చేసేసి వెనుదిరిగాడు. ఆ తరువాత కీపర్​ ధృవ్​ జురెల్(50)​ బాధ్యత తీసుకుని అర్థ శతకంతో రాణించి భారీ స్కోరుకు జట్టును చేర్చాడు. చివరి వరస బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా, అంతగా అవసరం కూడా పడలేదు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో రాజస్థాన్​ 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసింది.

హైదరాబాద్​  బౌలర్లలో ప్రఫుల్​ హింగే 3 వికెట్లు తీసుకున్నాడు. కెప్టెన్​ ప్యాట్​ కమ్మిన్స్​ను సూర్యవంశీ వీర బాదుడు బాదడంతో తన 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకున్నాడు.

ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్‌ దూకుడు

లీగ్‌ దశలో హైదరాబాద్‌ చేతిలో ఎదురైన రెండు పరాజయాలకు రాజస్థాన్‌ సరిగ్గా అవసరమైన చోట గట్టిగా బదులిచ్చింది. బ్యాటింగ్‌లో భారీ స్కోరు, బౌలింగ్‌లో క్రమశిక్షణ, ఫీల్డింగ్‌లో ఎనర్జీ—మూడు విభాగాల్లోనూ RR మెరుగ్గా కనిపించింది. నాకౌట్‌ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుని ఆడిన తీరు ఆ జట్టుకు క్వాలిఫయర్‌-2 ముందు పెద్ద బూస్ట్‌గా మారింది.

ఈ విజయంతో రాజస్థాన్‌ రాయల్స్‌ టైటిల్‌ రేసులో మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్థాన్‌ తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. మరోవైపు, భారీ ఆశలతో ప్లేఆఫ్స్‌లోకి వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రయాణం ఎలిమినేటర్‌తోనే ముగిసింది.

ఒక నాకౌట్‌ మ్యాచ్‌లో కావాల్సిన నిబద్ధతను రాజస్థాన్‌ చూపించింది. అదే సమయంలో, భారీ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో కావాల్సిన పట్టుదల, భాగస్వామ్యాలు హైదరాబాద్‌లో కనిపించలేదు. ఫలితం.. సన్​రైజర్స్​, కావ్యా మారన్​ను ఏడిపిస్తూ ఇంటి దారి పట్టగా, ఆర్​ఆర్​ రాయల్​గా క్వాలిఫయర్‌-2 సమరానికి దూసుకెళ్లింది.

Latest News