చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ

- అసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో భారత్ తొలి స్వర్ణం
- క్రికెట్‌లోనూ భారత్‌కు స్వర్ణం
విధాత: అసియా క్రీడల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిల జోడీ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించారు. హాంగ్ ఝౌ లో శనివారం జరిగిన ఫైనల్ హోరాహోరీ పోటీలో తమ ప్రత్యర్ధి దక్షిణ కోరియా జంట ఛౌ సోల్ గ్యూ , కిమ్ వన్ హోలను 21-18, 21-16 ల స్కోర్ తేడాలతో ఓడించారు. ప్రతి గేమ్ లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే విధంగా సాగిన మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ జోడి పోరాటం అందరిని ఆకట్టుకుంది. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌లో టీమ్ లేదా వ్యక్తిగత విభాగాల్లో భారత్ స్వర్ణం గెల్చుకోవడం ఇదే ప్రథమం.
మరోవైపు క్రికెట్ లో అప్ఘానిస్తాన్-భారత్ మధ్య జరుగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షంతో రద్ధవ్వగా, భారత్‌ను విజేతగా ప్రకటించడంతో మరో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. వర్షంతో మ్యాచ్ ఆగిన సమయానికి 18.2ఓవర్లలో 5వికెట్లు కోల్పోయిన అఫ్ఘాన్ 112పరుగులు చేసింది. దీంతో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన భారత్‌ను విజేతగా ప్రకటించారు. ఆప్ఘాన్‌కు రజతం లభించింది. అంతకుముందు భారత మహిళల క్రికెట్ జట్టు కూడా స్వర్ణం సాధించింది. భారత్ మహిళల హాకీ జట్టు డిపెండింగ్ చాంపియన్ జపాన్‌పై 2-1తేడాతో గెలిచి క్యాంస్యం సాధించింది.
చెస్‌లో టీమ్ ఈవెంట్లలో పురుషుల జట్టు ప్రజ్ఞానంద, గుకేశ్, విదిత్, అర్జున్, హరికృష్ణలు రజతం సాధించారు. మహిళల చెస్ టీమ్ కోనేరు హంపీ, హారీక ద్రోణవల్లి, వైశాలి, వంతిక, సవితలు కూడా రజతం గెలుపొందారు. మరోవైపు కబడ్డీలో కూడా భారత్ జట్టు ఫైనల్‌లో ఇరాన్‌ను 33-29తేడాతో ఓడించి స్వర్ణం సాదించింది. రెజ్లింగ్‌లో 86కిలోల ప్రీ స్టైల్‌లో దీపక్ పునియా రజతం గెలిచాడు. ఫైనల్‌లో ఇరాన్‌కు చెందిన హసన్ యజ్ధానీ చేతిలో ఓడాడు. మొత్తం ఆసియా క్రీడల్లో శనివారం భారత్ పతకాల సంఖ్య 107కి చేరుకోగా, అందులో 28స్వర్ణాలు, 38రజతాలు, 41కాంస్య పతకాలున్నాయి.