IPL 2024 SRH Vs RR | రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం.. ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

సమిష్టిగా రాణిస్తే, విజయం ఎంత అలవోకగా వరిస్తుందో ఈ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు నిరూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన సన్‌రైజర్స్‌, రాజస్థాన్ రాయల్స్పై తిరుగులేని విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

IPL 2024 SRH Vs RR | రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం.. ఫైనల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

చివ‌రి అంకానికి చేరుకున్న ఐపిఎల్ 2024 (IPL 2024)లో భాగంగా చెన్నైలో నేడు జ‌రిగిన క్వాలిఫ‌య‌ర్ 2(Qualifier- 2) మ్యాచ్‌లో హైద‌రాబాద్ 36 ప‌రుగుల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. ముందుగా టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న రాజ‌స్థాన్‌(Rajasthan Royals), 13 ప‌రుగుల వ‌ద్ద హైద‌రాబాద్‌ (Sunrisers Hyderabad)ను తొలిదెబ్బ తీసింది. హార్డ్ హిట్టర్ అభిషేక్ శ‌ర్మ(12)ను పెవిలియ‌న్‌కు పంపింది. త‌ర్వాత వ‌చ్చిన రాహుల్ త్రిపాఠి, మ‌రో ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్‌తో క‌లిసి, ఎడాపెడా బౌండ‌రీలు బాదుతూ, స్కోర్ బోర్డును ప‌రుగెత్తించాడు. 55 పరుగుల వ‌ద్ద త్రిపాఠీ వికెట్ కోల్పోయిన స‌న్‌రైజ‌ర్స్‌, వెంటనే మార్క్‌ర‌మ్‌నూ కోల్పోయింది. ఒక ప‌క్క క్లాసెన్ నింపాదిగా ఆడుతూ, స్కోరు పెంచుతూంటే, ఇంకోప‌క్క వికెట్లు క్రమం తప్పకుండా ప‌డిపోయాయి. కానీ, చైన్నై స్లో పిచ్‌పై ప‌రుగులు రావ‌డం క‌ష్టమైనా, స‌న్‌రైజ‌ర్స్ క‌ష్టసాధ్యమైన ల‌క్ష్యాన్ని(175)ని రాయ‌ల్స్‌కు నిర్దేశించింది. క్లాసెన్(50) దాదాపు చివ‌రి వ‌ర‌కు ఉండి అర్థసెంచ‌రీ సాధించాడు.  మొత్తానికి నిర్ణీత 20 ఓవ‌ర్లలో హైద‌రాబాద్ 9 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

రాజ‌స్థాన్ బౌల‌ర్లలో ట్రెంట్ బౌల్ట్‌, ఆవేశ్‌ఖాన్ చెరో మూడు వికెట్లు తీయ‌గా, సందీప్ శ‌ర్మ రెండు వికెట్లు తీసుకున్నాడు. పేరెన్నిక గ‌న్న స్పిన్నర్లు అశ్విన్‌, చాహ‌ల్ ఉన్నా, అన్ని వికెట్లూ పేస్ బౌల‌ర్లకే ప‌డ‌టం విశేషం.

త‌ర్వాత, 176 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 24 ప‌రుగుల వ‌ద్ద త‌మ తొలి వికెట్‌ను స‌మ‌ర్పించుకుంది. య‌శస్వి జైస్వాల్(42) కాస్తా దూకుడుగా ఆడినా, మిగ‌తావారంతా విఫ‌ల‌మయ్యారు. ఒక్క ధృవ్ జురెల్‌(56) మాత్రమే కాస్తా నిల‌దొక్కుకుని ఆడాడు. ఇంతా చేసి, ఈ న‌ష్టమంతా క‌లిగించింది స్పిన్నర్లు. అది కూడా రెగ్యుల‌ర్ స్పిన్నర్లు కాదు. ఇప్పటిదాకా బ్యాట్‌తో అద‌ర‌గొట్టిన అభిషేక్ శ‌ర్మ (Abhishek Sharma)త‌న ఆఫ్ స్పిన్‌తో హ‌డ‌లెత్తించి, రెండు వికెట్లు తీసుకోగా, షాబాజ్‌ఖాన్(Shabaz Khan) మూడు వికెట్లు తీసుకున్నాడు. ఫీల్డింగ్‌తో కూడా హైద‌రాబాద్ (Super fielding)అద్భుతాలే చేసింది. ప‌రుగులు రాకుండా రాజ‌స్థాన్‌ను నిరోధించి ఒత్తిడిలోకి నెట్టేసింది. ఫ‌లితంగా పెద్ద షాట్ల రూపంలో వికెట్లు ప‌డిపోయాయి. చివ‌రికి 20 ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 139 ప‌రుగులు మాత్రమే చేసి, టోర్నీ నుండి నిష్క్రమించింది.

హైద‌రాబాద్ బౌల‌ర్లలో షాబాజ్ మూడు, అభిషేక్ రెండు, క‌మిన్స్‌, న‌ట‌రాజ‌న్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజ‌యంతో ఈ నెల 26న జ‌రిగే ఫైన‌ల్లో, త‌న క్వాలిఫ‌య‌ర్ 1 ప్రత్యర్థి కోల్‌క‌తాతో హైద‌రాబాద్  త‌ల‌ప‌డ‌నుంది.  దీంతో సన్​రైజర్స్​ ఫైనల్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​గా షాబాజ్​ అహ్మద్​(18 పరుగులు, 3 వికెట్లు) ఎంపికయ్యాడు.