హైదరాబాద్ ఎట్టకేలకు మళ్లీ జూలు విదిల్చింది. లక్నో సూపర్ జయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో వికెట్ పోకుండా ఘనవిజయం సాధించి ప్లేఆఫ్స్‌కు మరింత దగ్గరయింది.
• సన్‌రైజర్స్ దెబ్బకు ఇంటిముఖం పట్టిన ముంబై
• 10 ఓవర్లలో టి20ల్లో హైదరాబాద్ అత్యధిక స్కోరు
ఐపిఎల్ 2024లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన 57వ మ్యాచ్‌లో లక్నోతో తలపడిన సన్‌రైజర్స్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎల్ఎస్జీని హైదరాబాద్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు రావడం ఎంత పెద్ద తప్పో కాసేపట్లోనే రాహుల్‌కు తెలిసివచ్చింది. హైదరబాద్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ లక్నో పతనానికి శ్రీకారం చుట్టి ప్రమాదకరమైన డికాక్(2), స్టయినిస్(3)ను పెవిలియన్‌కు పంపించాడు. కెప్టెన్ రాహుల్(29), కృణాల్ పాండ్యా(24) నిరాశపరచగా, అఖర్లో పూరన్(48), ఆయుష్ బదోని(55) నిలదొక్కుకోవడంతో లక్నో 165 పరుగుల నామమాత్రపు స్కోరు చేయగలిగింది. సన్‌రైజర్స్ బౌలర్లలో భువీ 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకోవడం విశేషం కాగా, ఆ 12 పరుగులు కేవలం సింగిల్స్ కావడం గమనార్హం. ఒక వికెట్ కెప్టెన్ కమ్మిన్స్ తీసుకున్నాడు.
166 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు వర్షం లేని రాత్రి లక్నో బౌలర్లకు నిజంగానే చుక్కలు చూపించారు. ఇది నిజంగా ప్రళయకాల విధ్వంసం. 167 పరుగుల లక్ష్యాన్నివారిద్దరే కేవలం 9.4 ఓవర్లలోనే అధిగమించారంటే వారు లక్నో బౌలర్లపై చేసిన దాడి ఎంత విధ్వంసకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓపెనర్లు ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89, 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75, 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ జయింట్స్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. సిక్స్‌లు, ఫోర్లతో స్టేడియాన్ని మోతెక్కించారు. ప్రతీ రెండవ బంతీ బౌండరీ దాటిందంటే వారి దూకుడు ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. లక్నో ఫీల్డర్లకు అసలు పనే లేకుండా
పోయింది. వారందరూ హాయిగా ఎక్కడున్నవారు అక్కడే నిలబడిపోయారు. ఇరు జట్ల పవర్ ప్లే వివరాలు చూద్దామా.. గమ్మత్తుగా ఉంటుంది.
పవర్ ప్లే పోలిక
విషయం | లక్నో | హైదరాబాద్ |
---|---|---|
స్కోరు | 27/2 | 107/0 |
రన్‌రేట్ | 4.6 | 17.83 |
4/6 | 0/1 | 13/8 |
ఈ ఘనవిజయంతో సన్‌రైజర్స్ చాలా ముఖ్యమైన నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకుని –0.075 నుండి ఏకంగా +0.406కు చేరుకుంది. చెన్నైని కిందకి నెట్టి, 14 పాయింట్లతో మూడో స్థానానికి ఎగబాకింది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయముంది. హైదరాబాద్ సాధించిన ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్ అవకాశాలు గల్లంతయి, ఇంటిముఖం పట్టింది.